రేషన్‌ డీలర్లకు మొండిచెయ్యి

ABN , First Publish Date - 2022-05-27T04:31:07+05:30 IST

రేషన్‌ డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపుతోంది. కేంద్ర ప్రభుత్వం కమీషన్‌ వాటాను చెల్లిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా విడుదల చేయడం లేదు. దీంతో రేషన్‌ డీలర్లపై భారం పడుతోంది. చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే నిత్యావసర సరుకులకు కమీషన్లు పెంచుతూ కేంద్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం క్వింటాలు సరుకులు పంపిణీ చేస్తే డీలర్లకు రూ.70 కమీషన్‌ రూపంలో చెల్లిస్తున్న కేంద్రం మరో రూ.20 పెంచుతూ రూ.90 ఇవ్వాలని నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా 423 రేషన్‌ షాపులు ఉండగా వాటి ద్వారా లబ్ధిదారులకు నెలవారి బియ్యం సరఫరా జరుగుతోంది.

రేషన్‌ డీలర్లకు మొండిచెయ్యి

కమీషన్ల వాటా చెల్లిస్తున్న కేంద్ర ప్రభుత్వం

నయా పైసా వాటా విదిల్చని రాష్ట్ర ప్రభుత్వం

కమీషన్‌ పెంచుతూ కేంద్రం నిర్ణయం

పాత బకాయిల కోసం వేచి చూస్తున్న రేషన్‌ డీలర్లు

మంచిర్యాల, మే 26 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపుతోంది. కేంద్ర ప్రభుత్వం కమీషన్‌ వాటాను చెల్లిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా విడుదల చేయడం లేదు. దీంతో రేషన్‌ డీలర్లపై భారం పడుతోంది. చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే నిత్యావసర సరుకులకు కమీషన్లు పెంచుతూ కేంద్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం క్వింటాలు సరుకులు పంపిణీ చేస్తే  డీలర్లకు రూ.70 కమీషన్‌ రూపంలో చెల్లిస్తున్న కేంద్రం మరో రూ.20 పెంచుతూ రూ.90 ఇవ్వాలని నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా 423 రేషన్‌ షాపులు ఉండగా వాటి ద్వారా లబ్ధిదారులకు నెలవారి బియ్యం సరఫరా జరుగుతోంది. జిల్లాలో మొత్తం 2 లక్షల 14వేల236 కార్డులు ఉండగా, కుటుంబంలోని లబ్ధిదారులందరికీ కిలో రూపాయి చొప్పున రేషన్‌ బియ్యం సరఫరా అవుతున్నాయి. బియ్యం సరఫరా చేసినందుకు డీలర్‌కు కిలోకు రూ.1 చొప్పున లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం వసూలు చేస్తోంది. కరోనా కాలంలో లబ్ధిదారులకు తలా ఒక్కంటికి 10కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. ఇందుకోసం ప్రభుత్వం డీలర్లకు ప్రత్యేకంగా కమీషన్‌ అందజేస్తామని ప్రకటించినప్పటికీ అందులో జాప్యం జరుగుతోంది.

కమీషన్‌ చెల్లింపులు ఇలా...

రేషన్‌ షాపుల ద్వారా లబ్ధిదారులకు సరుకులు సరఫరా చేసేందుకు డీలర్‌కు ఇచ్చే కమీషన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 65, 35 శాతాల్లో భరించాలి. ప్రస్తుతం డీలర్‌కు ప్రతి క్వింటాల్‌పై రూ.100 కమీషన్‌ ఇస్తున్నందున నిర్ణీత వాటా ప్రకారం కేంద్రం రూ.65, రాష్ట్రం రూ.35 చెల్లించాలి. అలా కాకుండా కేంద్రం తన వాటా చెల్లిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 35 శాతాన్ని డీలరే భరించాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం రూ.70 చెల్లిస్తుండగా డీలర్లు చెల్లించిన వాటాను కలిపి రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.100 చొప్పున కమీషన్‌ చెల్లిస్తోంది.  దీనిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చెల్లిస్తోంది.  ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం డీలర్లకు క్వింటాలుపై రూ.90 కమీషన్‌ పెంచడంతో ఇక మీదట డీలర్‌ తన వాటా కింద రూ.10 రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. తమ వాటా కింద చెల్లించాల్సిన రూ.10 డీలర్లు భారంగా భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తన వాటాను రూ.90కి పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వం మిగతా రూ.10ని కలిపి తమకు కమీషన్‌ అందజేస్తే బాగుంటదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పాత బకాయిల చెల్లింపులు ఎప్పుడు..?

కరోనా కష్టకాలంలో ప్రభుత్వాలు ఉచిత బియ్యం సరఫరా చేయడంతో డీలర్లకు కమీషన్లు ప్రభుత్వాలే చెల్లించాల్సి ఉంది. ఉచిత బియ్యం సరఫరా రాష్ట్రంలో మే నెలతో ముగిసింది. ఫిబ్రవరి వరకే కమీషన్లు అందాయని, మార్చి, ఏప్రిల్‌ మాసాలకు సంబంధించి కమీషన్లు చెల్లించలేదని డీలర్లు చెబుతున్నారు. ప్రైవేటు బ్యాంకుల్లో ఖాతాలున్న డీలర్లకు జనవరి నుంచి కమీషన్లు రావాల్సి ఉన్నట్లు చెబుతున్నారు.   రెండు నెలల కమీషన్లు కేంద్రం నుంచి విడుదలైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఖాతాల్లో జమ చేయడం లేదనే అభిప్రాయాలు డీలర్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఎప్పటి కమీషన్లు అప్పుడు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డీలర్లు కోరుతున్నారు. 

సరుకుల లేమితో ఇబ్బందులు..

చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం మాత్రమే పంపిణీ చేయడంతో కమీషన్లు సరిపోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  నెలలో 100 క్వింటాళ్లు సరఫరా చేసే డీలర్‌కు రూ. 10వేల కమీషన్‌ వస్తుంది. ఇందులో గది కిరాయి కనీసం రూ. 2వేలు, గమాస్తాకు రూ. 3వేలు వెచ్చించాలి. మిగతా రూ. 5వేలతోనే డీలరు నెలంతా గడపాల్సి వస్తోంది. బియ్యంతోపాటు చక్కెర, గోధుమలు, పప్పులు తదితర సరుకులు పంపిణీ చేస్తే లాభసాటిగా ఉంటుందని డీలర్లు చెబుతున్నారు. సరుకులు పెంచితే తమ వంతు వాటా కింద క్వింటాలుకు రూ.10 చొప్పున చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తే తమ వాటా రూ.10ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని డీలర్లు అభిప్రాయ పడుతున్నారు. 

బియ్యం రవాణాలో ఆలస్యం

ఒక్కో రేషన్‌ దుకాణానికి గ్రామీణ ప్రాంతాల్లో నెలకు కార్డు లిమిట్‌ 500 ఉండగా, మున్సిపాలిటీలో 800 నుంచి 1000 కార్డులు ఉంటాయి.   1 నుంచి 15వ తేదీ వరకు షాపులు తెరిచి ఉండాలి. మంచిర్యాల మండలానికి సంబంధించిన ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నస్పూర్‌లో ఏర్పాటు చేశారు. సరుకు రవాణా ఆలస్యం కావడంతో ఈ నెల బియ్యం పంపిణీ గడువు తేదీని ఈనెల 19కి పెంచారు. ప్రతీ నెల 30వ తేదీ లోపు సరుకులు సరఫరా చేస్తే 1 నుంచి 15 వరకు లబ్ధిదారులకు అందుతాయి. ఈ నెలలో కొన్ని షాపుల్లో 13వ తేదీన సరుకులు చేరాయి. రేషన్‌ షాపుల్లో ఈ పాస్‌ విధానంతో లబ్ధిదారులు తనకు తోచిన చోట సరుకులు తీసుకునే వెసలుబాటు ఉంది. కొన్ని షాపులకు సరుకులు సకాలంలో అందడం, మరికొన్నింటికి ఆలస్యం కావడంతో లబ్ధిదారులు సమీపంలోని సరుకులు అందుబాటులో ఉన్న షాపునకు వెళ్లి తీసుకుంటారు. దీంతో ఆలస్యంగా సరుకులు తీసుకున్న డీలర్లు పంపిణీ చేయలేక కమీషన్లకు దూరం అవుతున్నారు. దీనికి తోడు గోదాముల నుంచి రేషన్‌ షాపులకు సరఫరా అయ్యే 50 కేజీల బస్తాల్లో 3 నుంచి 4 కిలోల వరకు తరుగు వస్తుందని డీలర్లు చెబుతున్నారు. షాపుల నిర్వహణలో తాము నష్టపోతున్నామని డీలర్లు ఆవేదన చెందుతున్నారు.  

Updated Date - 2022-05-27T04:31:07+05:30 IST