- 4న కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కేసు విచారణ
- సర్వసభ్యమండలి సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు
చెన్నై, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సమావేశాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసర కేసుగా పరిగణించి విచారణ జరిపేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో స్థానిక వానగరంలో ఈ నెల 11వ తేదీనసర్వసభ్యమండలి సమావేశం నిర్వహణకు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వర్గీయులు భారీ ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ నెల 23న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సమావేశంలో హైకోర్టు ప్రథమ ధర్మాసనం ఉత్తర్వుల మేరకు సవ్యంగా సాగలేదని, 23 తీర్మానాలను తిరస్కరించి కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన సర్వసభ్యమండలి సభ్యుడు షణ్ముగం తాజాగా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అంతేగాక ఈ నెల 11న ఎడప్పాడి వర్గీయులు నిర్వహించదలచిన సర్వసభ్యమండలిపై స్టే విధించాలని కోరుతూ మరో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లను అత్యవసర కేసులుగా పరిగణించి విచారణ జరపాలంటూ షణ్ముగం తరఫు న్యాయవాదులు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దురైసామి, జస్టిస్ సుందర్‌మోహన్‌తో కూడిన ధర్మాసనం ముందు అభ్యర్థించారు. అయితే ఇందుకు ధర్మాసనం తిరస్కరించింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన పిటిషన్ మాత్రమే అత్యవసర కేసుగా పరిగణించి ఈ నెల 4న విచారిస్తామని, అయితే సర్వసభ్యమండలి సమావేశంపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణ జరుపలేమని స్పష్టం చేసింది. దీంతో ఈపీఎస్ వర్గ నేతలు ఈ నెల 11వ తేదీన సర్వసభ్యమండలి సమావేశాన్ని జరుపుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి