కరోనా కేసా.. ఇంట్లోనే ఉండండి

ABN , First Publish Date - 2020-06-30T09:50:02+05:30 IST

అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడాల్సిన..

కరోనా కేసా.. ఇంట్లోనే ఉండండి

పాజిటివ్ బాధితులకు వైద్య సిబ్బంది ఉచిత సలహాలు

రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లని వైనం

ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల పరిస్థితిపై బాధితుల ఆందోళన


విజయవాడ(ఆంధ్రజ్యోతి:) పటమటకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అప్పటికే వెన్నునొప్పితో బాధపడుతున్న ఆయన ప్రభుత్వాసుపత్రి అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా తీసుకెళ్లలేదు. ఇప్పటికీ ఆయన హోమ్ ఐసోలేషన్‌లోనే ఉన్నారు.


వన్‌టౌన్‌కు చెందిన ఓ వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అయినా.. ఆయనను ఆసుపత్రికి తరలించలేదు.


.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. పదుల సంఖ్యలో కరోనా బాధితులు కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లేవారు లేక ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ ప్రాణభయంతో కాలం గడుపుతున్నారు.


అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడాల్సిన వైద్య సిబ్బందే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించడం సంగతి పక్కనపెడితే, వారిని ఆసుపత్రులకు తరలించే దిక్కు కూడా ఉండట్లేదు. రోజూ వైరస్‌ బారిన పడుతున్న బాధితుల్లో సగంమందిని కూడా ఆసుపత్రులకు తరలించట్లేదు. ప్రాణభయంతో వణికిపోతున్న బాధితులు తమను ఆసుపత్రులకు తీసుకెళ్లాలంటూ వైద్యాధికారులకు మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే నాథుడు లేడు. దీంతో పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా.. వారి నుంచి కూడా సరైన స్పందన లభించకపోవడంతో బాధితులు అధికారుల పనితీరుపై మండిపడుతున్నారు.


బాధితుల్లో ప్రాణభయం

ఇటీవల జిల్లాలో కరోనా స్వైరవిహారం చేస్తుండటంతో ప్రజలు అనుమానంతో రోజూ వేలసంఖ్యలో కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా సేకరిస్తున్న నమూనాలతో పాటు రెండు ప్రైవేట్‌ ల్యాబ్‌లకు నమూనాలు సేకరించి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించే అనుమతులు ఇచ్చింది. దీంతో ఖర్చుకు వెనకాడకుండా ఆ ల్యాబ్‌లకు కూడా వెళ్లి శాంపిల్స్‌ ఇచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. రెండు, మూడు రోజుల తర్వాత వాటి రిపోర్టులు వస్తున్నాయి. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారికి సంబంధిత వైద్యసిబ్బంది ఫోన్లు చేసి.. కరోనా సోకినట్లు సమాచారం అందజేస్తున్నారు. బాధితులు చికిత్స కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నారు. 


ఇంట్లోనే ఉండండి అంటూ సలహాలు

బాధితులకు జిల్లాలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి, గన్నవరం సమీపంలోని పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రి, ఇబ్రహీంపట్నంలోని నిమ్రా ఆసుపత్రుల్లో మాత్రమే చికిత్స అందిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో లేదు. దీంతో బాధితులు తమను ఆసుపత్రికి తీసుకువెళ్లాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులకు మొరపెట్టుకుంటున్నా అంబులెన్స్‌లు ఖాళీ లేవని, కొన్ని పనిచేయడం లేదంటూ చెబుతున్నారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ తగ్గిపోతుందంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని మరికొందరు బాధితులు మండిపడుతున్నారు. ఇంట్లోనే ఉంటే తమతోపాటు కుటుంబ సభ్యులకు కూడా వైరస్‌ వ్యాపిస్తుందని, ఇంట్లోని చిన్నపిల్లలు, వృద్ధుల పరిస్థితి ఏమిటంటూ బాధితులు గగ్గోలు పెడుతున్నారు.


క్వారంటైన్‌కు మంగళం

పాజిటివ్‌ బాధితులనే ఆసుపత్రులకు తరలించే పరిస్థితులు లేని తరుణంలో వారి కుటుంబ సభ్యులు, బంధువులు, బాధితులతో కాంటాక్ట్‌ అయినవారిని క్వారంటైన్‌ సెంటర్లకు తరలించే ప్రక్రియ అధ్వానంగా తయారైంది. 


Updated Date - 2020-06-30T09:50:02+05:30 IST