విజన్ ఉన్న నేతను జనం కోరుకుంటున్నారు: సిద్ధూ

ABN , First Publish Date - 2022-01-03T00:19:27+05:30 IST

పంజాబ్ ప్రజలు తమ ఆశలను నెరవేర్చి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి (రోడ్ మ్యాప్) కోసం కృషి చేయగలిగిన..

విజన్ ఉన్న నేతను జనం కోరుకుంటున్నారు: సిద్ధూ

లూథియానా: పంజాబ్ ప్రజలు తమ ఆశలను నెరవేర్చి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి (రోడ్ మ్యాప్) కోసం కృషి చేయగలిగిన నాయకుడి కోసం ఎదురుచూస్తున్నట్టు పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. 'పంజాబ్ మోడల్' ఒక్కటే ఇందుకు సరైన సమాధానమని తాను బలంగా నమ్ముతున్నట్టు ఆయన పేర్కొన్నారు. సీఎం అభ్యర్థిగా రేసులో ఉన్నాననే సంకేతాలకు ఆయన తాజా వ్యాఖ్యలు అద్దం పడుతున్నట్టు విశ్లేషకులు అంటున్నారు.


రాష్ట్రాన్ని అన్ని ఆర్థిక సమస్యల నుంచి గట్టేక్కించే 'పంజాబ్ మోడల్'ను తాను డవలప్ చేసినట్టు సిద్ధూ తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి, ఉద్యోగాల కల్పనకు వీలైన సమగ్ర వ్యూహంతో ఈ ప్లాన్‌ ఉంటుందన్నారు. పంచాయతీ స్వరాజ్‌ను పటిష్టం చేయాలనే రాజీవ్ గాంధీ విజన్‌ను పరిపుష్టం చేసేదుకు కాంగ్రెస్ తెచ్చిన 73వ రాజ్యాంగ సవరణను అమలు చేసే విధంగా పంజాబ్ మోడల్ ఉంటుందని పేర్కొన్నారు.


బీజేపీపై విమర్శలు..

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఇతర కేంద్ర సంస్థలతో దాడులు జరిపిస్తామని బీజేపీ భయపెడుతోందని, దాంతో  కాంగ్రెస్ నేతలు కొందరు ఆ పార్టీలోకి వెళ్తున్నారని సిద్ధూ ఆరోపించారు. బీజేపీలో చేరండి, లేదా జలంధర్‌కు (ఈడీ కార్యాలయం)కు రావాల్సి ఉంటుందని బీజేపీ నేతలు బెదరిస్తున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విభజన రాజకీయాలను నమ్ముతున్నారని సిద్ధూ ఆరోపించారు. 2020లో ఢిల్లీలో హింసకు సొంత రాజకీయ ప్రయోజనాలు, బీజేపీ, కేజ్రీవాల్ కుమ్మక్కవడం కారణాలన్నారు. అన్నీ ఉచితాలేనంటూ కేజ్రీవాల్ వల విసురుతున్నారని, ఆప్, బీజేపీ కలిసి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని సిద్ధూ విమర్శించారు.

Updated Date - 2022-01-03T00:19:27+05:30 IST