క్రమబద్ధీకరణ షురూ

ABN , First Publish Date - 2022-05-31T06:02:01+05:30 IST

క్రమబద్ధీకరణ షురూ

క్రమబద్ధీకరణ షురూ


  • జిల్లాలో రెగ్యులరైజేషన్‌ కోసం వచ్చిన దరఖాస్తులు 869
  • క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తున్న బృందాలు 
  • నిబంధనల మేరకు లేకపోతే తిరస్కరణ

ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. బృందం సభ్యులు  దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. 

వికారాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది.  ఈ ప్రక్రియ జిల్లా పర్యవేక్షణాధికారిగా వికారాబాద్‌ ఆర్డీవో విజయలక్ష్మి వ్యవహరిస్తుండగా, మండలాల స్థాయిలో తహసీల్దార్లు నేతృత్వం వహిస్తున్నారు. మండల పరిధిలో నాయబ్‌ తహసీల్దార్‌ పర్యవేక్షణలో ఆర్‌ఐలు, వీఆర్‌ఏలతో బృందాలు ఏర్పాటు చేశారు. వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఆధారంగా ఒక్కో మండలంలో ఒక బృందం నుంచి ఏడు బృందాల వరకు నియమించారు. నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తులను పరిశీలించేందుకు ఒక మండల రెవెన్యూ సిబ్బందిని మరో మండలానికి కేటాయించారు. ఎక్కువ దరఖాస్తులు వచ్చిన మండలంలో రెండు, మూడు మండలాల రెవెన్యూ సిబ్బంది సేవలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ జీవో నెం.58 కింద జిల్లాలో 869 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల్లో అత్యధికంగా పరిగిలో 442, మోమిన్‌పేట్‌లో  226, కులకచర్లలో 68, వికారాబాద్‌లో 42, పూడూరులో 20 దరఖాస్తులు వచ్చాయి. మిగతా చోట్ల 20 కంటే తక్కువగా ఉన్నాయి. దరఖాస్తుల పరిశీలనకు సీసీఎల్‌ఏ ప్రత్యేకంగా ఓ యాప్‌ రూపొందించారు. తనిఖీ బృందాలు జీవో 58, 59 కింద ఎన్నెన్ని దరఖాస్తులు వచ్చాయనేది ధృవీకరించుకుని వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం నివేదిక రూపొందించి కలెక్టర్‌కు అందజేయనున్నారు. ఆ తరువాత ప్రభుత్వ నిర్ణయం మేరకు స్థలాలను క్రమబద్ధీకరించనున్నారు. 

 ఎలా పరిశీలిస్తారంటే ...

ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుదారులు సమర్పించిన ఆధారాలతో పాటు ఆ కుటుంబ ఆదాయ పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. దరఖాస్తుదారులు ప్రభుత్వ ఉద్యోగులా లేక ఇతర ఉద్యోగులా అనేది పరిశీలించనున్నారు. దరఖాస్తు చేసుకున్న స్థలం ఏ కేటగిరీకి వస్తుంది, ప్రభుత్వ అభ్యంతరాలు లేని స్థలమా.. లేదా అభ్యంతరాలు ఉన్నదా,  మిగులు భూమి, ఇతర శాఖలకు చెందిన స్థలమా అనే వివరాలు నమోదు చేసుకుంటారు. క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న స్థలం ఖాళీగా ఉందా ? లేక నిర్మాణం పూర్తయిందా ? లేక నిర్మాణంలో ఉందా అనేది నిర్ధారించుకుంటారు. ఆ స్థలం ఎప్పటి నుంచి కబ్జాలో ఉంది, ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయా ? లేదా ? కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా అనేది పరిశీలించనున్నారు. నిర్మాణం చేపడితే కొలతలు తీసుకుని నమోదు చేసుకుంటారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండే దరఖాస్తులను తిరస్కరించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి.  

ఆధారం ఉంటేనే క్రమబద్ధీకరణ

వికారాబాద్‌ జిల్లాలో 2014, డిసెంబరు 31వ తేదీ వరకు భూముల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో 58, 59లు తీసుకువ చ్చింది. జీవో 58 కింద వచ్చిన దరఖాస్తులను ఉచితంగా క్ర మబద్ధీకరించనుండగా, జీవో 59 నిర్ధారించిన నామమాత్రపు విలువతో క్రమబద్ధీకరించనున్నారు. తాము కబ్జాలో ఉన్న ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు విద్యుత్‌, నల్లా బిల్లుల్లో ఏదైనా ఒక బిల్లును ఆధారంగా చూపించి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. మార్చి 31వ తేదీ నాటికి జిల్లాలో 869 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల్లో జీవో 58 కింద దరఖాస్తు చేసుకున్న వారు 125 గజాల్లోపు నిర్మాణం చేపట్టి నివాసం ఉంటే ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయించి ఇవ్వనుంది. జీవో 59లో ప్రభుత్వ స్థలాల విస్తీర్ణం, రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారంగా 50 శాతం నుంచి 100 శాతం వరకు ఛార్జీలు వసూలు చేసి క్రమబద్ధీకరించనున్నారు. 

Updated Date - 2022-05-31T06:02:01+05:30 IST