రెండో అవకాశం.. శ్రీవారు ఎందుకిచ్చారంటే..

ABN , First Publish Date - 2021-08-12T07:07:07+05:30 IST

గత పాలకమండలి..

రెండో అవకాశం.. శ్రీవారు ఎందుకిచ్చారంటే..
శ్రీవారి ఆలయంలో టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సుబ్బారెడ్డితో మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి,ఎమ్మెల్యేలు,టీటీడీ ఉన్నతాధికారులు

ఆగిపోయిన పనుల పూర్తికే శ్రీవారు రెండో అవకాశమిచ్చారు

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

శ్రీవారి కైంకర్యాలకు స్వదేశీ ఆవుపాలతో నెయ్యి తయారీ

గోశాలల్లో పిండ మార్పిడిపై వెటర్నరీ వర్శిటీతో ఎంవోయూ


తిరుమల(ఆంధ్రజ్యోతి): గత పాలకమండలి అనేక బృహత్తర కార్యక్రమాల నిర్వహణకు ఆమోదం తెలిపినా కొవిడ్‌ వల్ల కొన్ని ఆగిపోయాయి. ఆ పనులన్నీ తిరిగి కొనసాగించేందుకే శ్రీవారు మరోసారి తనకు సేవచేసుకునే అవకాశమిచ్చారని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ చైర్మన్‌గా బుధవారం ఉదయం రెండవసారి బాధ్యతలు తీసుకున్న ఆయన వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అన్నమయ్య భవనానికి చేరుకున్నారు. స్వదేశీ ఆవు పాల నుంచి శ్రీవారికి కైంకర్యాలకు అవసరమైన నెయ్యి తయారు చేయడానికి ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంతో చేపట్టిన ఎంవోయూ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, పశువైద్య విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్‌ పద్మనాభరెడ్డి సమక్షంలో గోశాల డైరెక్టర్‌ హరనాథరెడ్డి, పశువైద్య విశ్వవిద్యాలయం రిజిస్ర్టార్‌ డాక్టర్‌ రవి ఎంఓయూ పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ శ్రీవారి కైంకర్యాలకు, దీపారాధనకు వినియోగించే నెయ్యిని స్వదేశీ ఆవు పాల నుంచి తయారు చేయడానికి పశువైద్య విశ్వవిద్యాలయం తగిన సాంకేతిక సహకారం అందిస్తుందని తెలిపారు.


పిండ మార్పిడి పథకం, పశుదాణా తయారీకి కుదుర్చుకున్న ఎంవోయూ ద్వారా ఎస్వీ పశు వైద్య విశ్వవిద్యాలయం డాక్టర్లు గోసంరక్షణశాలలోని అవులన్నింటినీ పరీక్షించి వాటిలో పిండోత్పత్తికి, అధిక పాల ఉత్పత్తికి తగిన వైద్యం అందిస్తారన్నారు. తిరుపతి, పలమనేరుల్లోని గోవులకు జన్యుపరంగా ఉన్నత లక్షణాలున్న దూడలను పుట్టించి, పాల ఉత్పత్తి పెంచే ఏర్పాట్లు చేస్తారన్నారు. అలాగే దాణా తయారీకి పశువైద్య విశ్వవిద్యాలయం, అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ప్రతాప్‌రెడ్డి సాంకేతిక సహకారంతో న్యూటెక్‌ బయో సైన్సెస్‌ ఇండియా కంపెనీతో టీటీడీ ఎంవోయూ కుదుర్చుకుందన్నారు.తిరుపతి గోశాల ప్రాంగణంలో నాణ్యమైన ఉన్నత ప్రమాణాలు కలిగిన సమీకృత పశువుల దాణాను తయారు చేయనున్నట్టు వివరించారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాసులు, ప్రసాదరాజు, దొరబాబు, ఎమ్మెల్సీ కృష్ణమూర్తి, టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-12T07:07:07+05:30 IST