పరిస్థితులు మారేవరకూ రేషన్‌ ఉచితంగా ఇస్తాం

ABN , First Publish Date - 2020-04-04T11:46:19+05:30 IST

స్వీయ నియంత్రణకు ప్రజలంతా సహకరించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాఽథరాజు అన్నారు.

పరిస్థితులు మారేవరకూ రేషన్‌ ఉచితంగా ఇస్తాం

గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు


పాలకొల్లు టౌన్‌, ఏప్రిల్‌ 3 : స్వీయ నియంత్రణకు ప్రజలంతా సహకరించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాఽథరాజు అన్నారు. పాలకొల్లు ఏఎంసీ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గంలోని కరోనా కమిటీ సభ్యులతో   సమీక్షించారు.కరోనా నియంత్రణ చేసేందుకు లోటు పాట్లు ఏమి ఉన్నాయంటూ ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కరోనా వైరస్‌ నియంత్రణకు నిబంధనలు కఠినతరం చేయాలని పోలీస్‌ అధికారులకు సూచించామన్నారు.  సీఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డి పరిస్థితి యథా స్థితికి వచ్చే వరకూ నిత్యావసరాలు ఉచితంగా అందజేసేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం కోనుగోలు చేస్తుందని, మిల్లర్లు సైతం ఎంఎస్‌పి ధరలకే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటు న్నామన్నారు. ఆక్వా ఉత్పత్తులు కొనుగోలు చేయని వ్యాపారులపై వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. పారిశుధ్య మెరుగుదలకు చర్యలు తీసుకున్నామన్నారు. మరో 11 రోజులు సహకరించాలని కోరారు.కరోనా నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ, నిరంతరం ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. 


పెనుగొండలో  కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన కారణంగా పది రోజులు పాటు ప్రజలను బయటకు  రాకుండా కట్టడి చేయాలన్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కరోనా విపత్తులో పేదలకు రూ.5 వేలు ఇవ్వాలని, నిత్యావసర సరుకులు, రేషన్‌ వంటివి వలంటీర్ల ద్వారా ఇంటికే సరఫరా చేసేలా మంత్రి ప్రభు త్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌,డీసీసీబీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ యడ్ల తాతాజీ, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, నరసాపురం సబ్‌కలెక్టర్‌ కెఎస్‌ విశ్వనాథన్‌, డీఎస్పీ కె.నాగేశ్వరరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో కొమ్మూరి వెంకట రామకృష్ణ, డీఎల్‌పీవో ఎం.నాగలత, ప్రత్యేకాధికారి షాజానాయక్‌, మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్‌.ప్రమోద్‌ కుమార్‌, నియోజకవర్గంలోని తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు, వ్యవసాయ శాఖ అధికారులు, వైద్యాధికారులు, పెనుగొండ  తహసీల్దార్‌ రవికుమార్‌, ఎస్‌ఐ నాగరాజు, పలువురు అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-04T11:46:19+05:30 IST