SriLanka విడిచి పారిపోయిన అధ్యక్షుడు Gotabaya Rajapaksa .. మిలిటరీ విమానంలో..

ABN , First Publish Date - 2022-07-13T16:30:20+05:30 IST

శ్రీలంక(Srilanka) అధ్యక్షుడు గొటబాయ రాజపక్స(Gotabaya Rajapaksa) దేశం విడిచి పారిపోయారు.

SriLanka విడిచి పారిపోయిన అధ్యక్షుడు Gotabaya Rajapaksa .. మిలిటరీ విమానంలో..

కొలంబో: శ్రీలంక(Srilanka) అధ్యక్షుడు గొటబాయ రాజపక్స(Gotabaya Rajapaksa) దేశం విడిచి పారిపోయారు. మిలిటరీ విమానంలో మాల్దీవులు(Maldives) చేరుకున్నారు. బుధవారం ఉదయం మాలే(Male) నగరంలోని వెలానా ఎయిర్‌పోర్టులో ఆయన ప్రత్యక్షమయ్యారు. గొటబాయతోపాటు ఆయన సతీమణి, ఇద్దరు బాడీగార్డులు వెంటవున్నారు. మాల్దీవుల ప్రభుత్వ ప్రతినిధులు గొటబాయకు స్వాగతం పలికారు. మాలేలోని ఎయిర్‌పోర్టులో దిగాక పోలీస్ ఎస్కార్ట్‌తో రహస్య ప్రాంతానికి తరలించారు. మంగళవారం రాత్రి కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి అధ్యక్షుడు గొటబాయ ఇద్దరు బాడీ గార్డులతో మిలిటరీ విమానం బయలుదేరినట్టు ఆ దేశ రక్షణశాఖ వర్గాలు పేర్కొన్నాయి. 


మంగళవారం రాత్రి విమానం కావాలంటూ అధ్యక్షుడు గొటబాయ తమను కోరారని శ్రీలంక రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. నిబంధనలకు లోబడి విమానాన్ని సిద్ధం చేశామని అధికారులు వివరించారు. శ్రీలంక త్రివిధ దళాలకు అధ్యక్షుడే సుప్రీం కమాండర్‌గా ఉంటారని వివరించారు. కాగా ప్రధానమంత్రి కార్యాలయం కూడా అధ్యక్షుడి పరారీని నిర్ధారించింది. గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారని తెలిపింది. మరోవైపు గొటబాయ తమ్ముడు, మాజీ ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్స(Basil Rajapaksa) కూడా దేశం విడిచి పారిపోయినట్టు రిపోర్టులు వస్తున్నాయి.


కాగా అరెస్టుల నుంచి తప్పించుకునేందుకే గొటబాయ రాజపక్స శ్రీలంక నుంచి పారిపోయారని సమాచారం. అరెస్టు చేసే అవకాశం ఉండడంతోనే ఆయన విదేశాలకు పారిపోవాలని నిర్ణయించుకున్నట్టు స్థానిక మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. కాగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనల నేపథ్యంలో  బుధవారం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. కానీ అంతకంటే ముందే లంక విడిచి పారిపోయారు. కాగా జులై 20న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.

Updated Date - 2022-07-13T16:30:20+05:30 IST