ఎనిమిదేళ్లుగా.. అన్నదానం... శ్రీలలిత సహస్ర సేవా సమితి సభ్యుల ఔదార్యం

ABN , First Publish Date - 2020-02-20T06:29:21+05:30 IST

జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డుకాలనీ, ఓంనగర్‌ కాలనీ, ఆర్‌ఆర్‌ కాలనీలకు చెందిన 29మంది మహిళలు ఒక గ్రూపుగా ఏర్పడి శ్రీలలిత సహస్ర సేవా సమితి

ఎనిమిదేళ్లుగా.. అన్నదానం... శ్రీలలిత సహస్ర సేవా సమితి సభ్యుల ఔదార్యం

హౌసింగ్‌బోర్డుకాలనీ, (నాగర్‌కర్నూల్‌), ఫిబ్రవరి 19 : జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డుకాలనీ, ఓంనగర్‌ కాలనీ, ఆర్‌ఆర్‌ కాలనీలకు చెందిన 29మంది మహిళలు ఒక గ్రూపుగా ఏర్పడి శ్రీలలిత సహస్ర సేవా సమితి పేరుతో గత ఎనిమిదేళ్లుగా శివస్వాముల ఆకలి తీరుస్తున్నారు. శివరాత్రికి ముందు 11రోజుల నుంచి కాలినడక శ్రీశైలం వెళ్లే శివ స్వాముల ఆకలి, దప్పిక తీర్చడం కోసం హౌసింగ్‌బోర్డుకాలనీలో టెంట్‌ వేసుకొని వారికి సేవ చేస్తున్నారు. ఉదయం ఫలాలు, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం అల్పాహారంతోపాటు రాత్రి పూట వారికి పడుకోవడానికి విడిదిని కూడా ఏర్పాటు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎవరిని చేయి చాచి అడగకుండా వారే తలా కొంత పోగు చేసుకొని స్వాములకు సేవ చేయడం గమనార్హం. శివస్వాములకే కాక కార్తీక మాసంలో అయ్యప్ప మాలధారణ చేసే అయ్యప్ప భక్తులకు అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నదానం కూడా నిర్వహిస్తుంటారు. ప్రతి ఏటా డిసెంబరులో జరిగే అయ్యప్పస్వామి మహాపడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న వేలాదిమంది భక్తులకు భోజన తాంబులాలను వడ్డించే కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తుంటారు. ఫిబ్రవరి మాసంలో శివమాలధారణ స్వీకరించిన భక్తులు, కాలినడకన శ్రీశైలం వెళ్లే భక్తులకు నిత్యం 400 మంది వరకు అన్నదానాన్ని ఏర్పాటు చేస్తున్నామని శ్రీలలిత సహస్ర సేవా సమితి అధ్యక్షురాలు రేవతి తెలిపారు. ఉపాధ్యక్షురాలు సరిత, ముఖ్య సభ్యురాళ్లు రాధ, అనసూయమ్మ, పద్మ, కృష్ణవేణి, పుష్పలత, సుబ్బమ్మ, బాలీశ్వరి, విజయలక్ష్మీ దగ్గరుండి అన్నదానానికి కావాల్సిన ఏర్పాట్లు నిర్వహిస్తుంటారు.


స్వాములకు సేవ చేయడం అదృష్టం..

శివ మాలధారులకు సేవ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. మహిళలమంతా కలిసి గొప్ప ఆలోచనతో ఎనిమిదేళ్లుగా విజయవంతంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. శివస్వాములతోపాటు అయ్యప్ప స్వాములకు కూడా ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ ఉదయం నుంచి రాత్రి వరకు స్వాముల సేవలో తరించడం పూర్వ జన్మ సుకృతం. 

- రేవతి, శ్రీలలిత సహస్ర సేవా సమితి బృందం 

Updated Date - 2020-02-20T06:29:21+05:30 IST