Abn logo
Apr 20 2021 @ 23:03PM

రాములోరి కల్యాణానికి రామతీర్థం ముస్తాబు
ఆలయం లోపలే క్రతువు

భక్తులకు అనుమతి నిరాకరణ

నెల్లిమర్ల, ఏప్రిల్‌ 20: రామతీర్థం రామస్వామివారి దేవస్థానంలో బుధవారం శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏటా నవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కరోనా సెకెండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఆలయం లోపలే వేడుకలు పరిమితం కానున్నాయి. భక్తులకు అనుమతి నిరాకరించారు. ఏటా ఆలయం వెలుపల వేదిక ఏర్పాటుచేసి అశేష భక్తజనం నడుమ కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపేవారు. ఉత్తరాంధ్రతో పాటు చత్తీస్‌గడ్‌, ఒడిశాల నుంచి సైతం భక్తులు స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు వచ్చేవారు. గత ఏడాది నుంచి కరోనాతో వేడుకలను రద్దుచేశారు. ఆలయం లోపల కేవలం అర్చకులు మాత్రమే ఉండి క్రతువు పూర్తిచేయనున్నారు.  స్వామివారి కల్యాణోత్సవంలో ప్రధాన భూమిక వహించే గోటితో వలచిన తలంబ్రాలను తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామానికి చెందిన రామభక్తులు తీసుకొచ్చారు. ముక్కోటి ఏకాదశి నాడు గోటితో వలచిన తలంబ్రాల తయారీకి శ్రీకారంచుట్టారు. ముద్దాపు విష్ణువు ఆధ్వర్యంలో రామభక్తులు మంగళవారం తలంబ్రాలను ఈవో ప్రసాదరావుకు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు ఖండవిల్లి సాయిరామాచార్యులు, కిరణ్‌, గొడవర్తి నరసింహాచార్యులు, పాణంగిపల్లి ప్రసాద్‌, పవన్‌కుమార్‌, రామ్‌గోపాల్‌ తదితరులు పాల్గొన్నారుటీటీడీ అధికారులు పంపించిన పట్టు వస్త్రాలను బుధవారం స్థానిక ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అందజేయనున్నట్టు ఈవో ప్రసాదరావు తెలిపారు.

 
Advertisement
Advertisement
Advertisement