SRDPకి కాసుల కష్టాలు.. చేతులెత్తేసిన GHMC.. మాట తప్పిన KCR సర్కార్..

ABN , First Publish Date - 2022-01-01T17:24:12+05:30 IST

మహానగరంలో సిగ్నల్‌ చిక్కులు లేని ప్రయాణం కోసం ప్రభుత్వం వ్యూహాత్మక రహదారుల..

SRDPకి కాసుల కష్టాలు.. చేతులెత్తేసిన GHMC.. మాట తప్పిన KCR సర్కార్..

  • ఇప్పటివరకు పూర్తయిన పనుల విలువ రూ.1232.30 కోట్లు
  • పురోగతిలో రూ.4500 కోట్లకుపైగా పనులు
  • ఎస్‌బీఐ రుణం మరో రూ.1000 కోట్లు మాత్రమే అందుబాటులో
  • చెల్లింపునకు షరతులు పెడుతున్న సంస్థ
  • నేడు షేక్‌పేట వంతెన ప్రారంభం

హైదరాబాద్‌ సిటీ : మహానగరంలో సిగ్నల్‌ చిక్కులు లేని ప్రయాణం కోసం ప్రభుత్వం వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ) ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రూ.29 వేల కోట్లకుపైగా అంచనా వ్యయంతో రూపొందించింది. వివిధ దశల్లో రూ.8200 కోట్ల పనులు ప్రారంభించగా, రూ.1232 కోట్ల పనులు పూర్తయ్యాయి. మరో రూ.6 వేల కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు శరవేగంగా సాగిన ప్రాజెక్టుకు కాసుల కష్టాలు తప్పేలా లేవు. గతంతో పోలిస్తే పనుల్లో వేగం గణనీయంగా తగ్గింది. పాలనాపరమైన అనుమతులు జారీ అయినా.. కొత్త ప్రాజెక్టులకు టెండర్లు పిలవడం లేదు. పురోగతిలో ఉన్న నిర్మాణాలు మినహా మిగతా పనులు ప్రారంభించవద్దని మౌఖిక ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది. మునిసిపల్‌ బాండ్ల జారీతో సమీకరించిన నిధులు గతంలోనే ఖర్చవగా.. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలూ క్రమేణా కరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఎస్‌బీఐ రుణం మరో రూ.1000 కోట్లు మాత్రమే అందుబాటులో ఉంది. మీ వంతు వాటా ఖర్చు చేస్తే తప్ప మిగతా మొత్తం ఇవ్వమని రుణం ఇచ్చిన సంస్థలు షరతులు  పెడుతున్నాయి. దీంతో ఎస్‌ఆర్‌డీపీ పనులకు రెడ్‌ సిగ్నల్‌ పడుతోంది. ఇప్పటికే రూ.80 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్టు ఆర్థిక విభాగం వర్గాలు చెబుతున్నాయి.


మాట తప్పిన సర్కారు.. 

ఎస్‌ఆర్‌డీపీ వ్యయాన్ని భరిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పింది. సుమారు రూ.30 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ప్రాజెక్టుల ఖర్చును భరించే బాధ్యతను జీహెచ్‌ఎంసీకి అప్పగించింది. ఇప్పటికే ఎస్‌ఆర్‌డీపీ, సీఆర్‌ఎంపీ, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్ల కోసం రూ.4500 కోట్లకుపైగా వివిధ సంస్థల నుంచి తీసుకున్న రుణానికి వడ్డీ, వాయిదాలు చెల్లించడమే జీహెచ్‌ఎంసీకి కష్టంగా మారుతోంది. ఈ క్రమంలో ఎస్‌ఆర్‌డీపీకి అదనపు నిధులు వెచ్చించే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో మున్ముందు పనుల పరిస్థితేంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. 


నయా సాల్‌ నజరానా..

మహానగరంలో అతి పొడవైన రెండో వంతెన నేడు అందుబాటులోకి రానుంది. టోలిచౌకిలోని గెలాక్సీ థియేటర్‌ నుంచి ఓయూ కాలనీ, షేక్‌పేట, విస్పర్‌ వ్యాలే మీదుగా మల్కం చెరువు వరకు రూ.333.55 కోట్లతో 2.71కి.మీల మేర ఆరు లేన్లుగా నిర్మించిన షేక్‌పేట- ఓయూ కాలనీ వంతెనను కొత్త సంవత్సరం కానుకగా నేడు పౌరులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఉదయం 11.30 గంటలకు మంత్రి కే.తారక రామారావు, ఇతర మంత్రులతో కలిసి వంతెనను ప్రారంభిస్తారు. 


రూ.29,695 కోట్లతో..

ట్రాఫిక్‌ జామ్‌జాటం తగ్గించేందుకు నగర కూడళ్లలో వంతెనలు, ప్రధాన రహదారుల విస్తరణ, అభివృద్ధి బాధ్యతలను జీహెచ్‌ఎంసీకి ప్రభుత్వం అప్పగించింది. ఎస్‌ఆర్‌డీపీలో భాగం గా 54 కూడళ్లలో వంతెనలు/గ్రేడ్‌ సెపరేటర్లు, 135 కి.మీల మేర ఎలివేటెడ్‌ కారిడార్లు, 166 కి.మీల కారిడార్ల అభివృద్ధి, 348 కి.మీల మేర ప్రధాన రహదారులను అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు రూ. 29,695 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఇందులో రూ.5240.41 కోట్ల పనులు ప్రారంభం/నిర్మాణ సంస్థల ఎంపిక జరిగింది. ప్రతిపాదిత ప్రాజెక్టుల్లో మెజార్టీ జీహెచ్‌ఎంసీ చేపడుతుండగా, హెచ్‌ఎండీఏ, ఎన్‌హెచ్‌ఏఐలోని ఆర్‌అండ్‌బీ విభాగాలూ పలు చోట్ల వంతెనలు నిర్మిస్తున్నాయి. 14 చోట్ల వంతెనలు, నాలుగు చోట్ల అండర్‌పా్‌సలు, నాలుగు ఏరియాల్లో ఆర్‌యూబీ/ఆర్‌ఓబీల నిర్మానాన్ని జీహెచ్‌ఎంసీ పూర్తి చేసింది. రూ.387 కోట్లతో హెచ్‌ఎండీఏ నిర్మించిన బాలానగర్‌ వంతెన కూడా అందుబాటులోకి వచ్చింది. ఉప్పల్‌, అంబర్‌పేట, అరాంఘర్‌ నుంచి శంషాబాద్‌ మార్గాల్లో వంతెలను ఆర్‌అండ్‌బీ విభాగం చేపట్టింది.

Updated Date - 2022-01-01T17:24:12+05:30 IST