ఆక్వా రైతులకు ఊరట

ABN , First Publish Date - 2022-09-12T05:53:48+05:30 IST

కోస్తాలో ఆక్వా ఉత్పత్తుల రవాణాకు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా కిసాన్‌ రైలును నడిపేందుకు రంగం చేసింది.

ఆక్వా రైతులకు ఊరట

చౌకగా చేపలు, రొయ్యల రవాణాకు  కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

త్వరలో పట్టాలెక్కనున్న కిసాన్‌ రైలు


ముదినేపల్లి, సెప్టెంబరు 11: కోస్తాలో ఆక్వా ఉత్పత్తుల రవాణాకు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా కిసాన్‌ రైలును నడిపేందుకు రంగం చేసింది. ప్రధాన మంత్రి మత్స్య సంపద  పథకం కింద ఆక్వా ఉత్పత్తుల ఎగు మతులను ప్రోత్సహించేందుకు, ఆక్వా రైతులకు ఆర్థిక వెసులుబాటు కల్పిం చేందుకు కేంద్రం రెండేళ్లుగా చేస్తున్న కసరత్తు కార్యరూపం దాల్చనుంది. ఇతర దేశాలకు, రాష్ట్రాలకు ఏపీ నుంచి ముఖ్యంగా కోస్తా ప్రాంతం నుంచే 31 శాతం చేపలు, రొయ్యల ఎగుమతులు జరుగుతున్నందున ఈ ప్రత్యేక గూడ్సు రైలును తక్కువ రవాణా ఛార్జీలతో నడపాలని కేంద్రం నిర్ణయించినట్టు రైల్వే బోర్డు ఫ్రైట్‌ మార్కెటింగ్‌ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ అశుతోష్‌ మిశ్రా జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. చాలా కాలంగా ఆక్వా రైతులు, చేపలు, రొయ్యల వర్తక సంఘాలు  ఇతర సరుకుల రవాణా మాదిరి ఆక్వా ఉత్పత్తుల రవాణా కు కూడా ఒక ప్రత్యేక రైలును కోస్తా ప్రాంతం నుంచి ఏర్పాటు చేయాలని కోరుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ రైలు నడిపేందుకు రంగం సిద్ధం చేసింది. దీనిని ఒక పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకుంటున్నది.


ప్రధాన జంక్షన్ల నుంచి....


తొలి దశలో ఈ కిసాన్‌ రైలును ఏపీలోని ప్రధాన ఆక్వా ఉత్పత్తుల ప్రాం తాల నుంచి చేపలు, రొయ్యలు ఎక్కువగా వినియోగించే ప్రాంతాలకు నడుపు తారు. తూర్పు, ఉత్తర రీజియన్లను ఎక్కువగా చేపలను వినియోగించే ప్రాంతాలుగా, మలబార్‌ రీజియన్‌ను ఎక్కువ ఫిష్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్లు ఉన్న ప్రాంతంగా ప్రభుత్వం గుర్తించినట్టు  మిశ్రా పేర్కొన్నారు. విజయవాడ రైల్వే జంక్షన్‌తోపాటు దానికి దగ్గరలోని స్టేషన్ల నుంచి హౌరా, గౌహతి, సిల్‌బార్‌ సెక్టార్‌కు ఈ  రైలును నడుపుతారు. విజయవాడతోపాటు నెల్లూరు, మచిలీ పట్నం, గుడివాడ, భీమవరం నుంచి కూడా కిసాన్‌ రైలులో ఆయా ప్రాంతాల చేపలు, రొయ్యల ఎగుమతులు బట్టి రవాణాకు అవకాశం కల్పిస్తారు. 


ముందుగానే బుకింగ్‌... 


కిసాన్‌ రైలులో ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు  ముందుగానే ఇండెంట్‌ బుక్‌ చేసుకోవాలని గుడివాడ రైల్వే స్టేషన్‌ మార్కెటింగ్‌ అధికారి భగవాన్‌ నాయక్‌ తెలిపారు. ప్రత్యేకంగా ఈ రైలును ఏర్పాటు చేయాలంటే కనీసం 300 టన్నుల ఉత్పత్తులు అవసరం. ఒక్కో బోగీకి 26 టన్నుల చేపలను నింపే సామర్థ్యం ఉంటుంది. ఈ మేరకు రైల్వే శాఖకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసు కుంటే అవసరమైన రోజున, ఆయా స్టేషన్ల నుంచి కిసాన్‌ రైలును ఎగుమతి చేసే రాష్ట్రానికి ఏర్పాటు చేస్తారు. రవాణా ఛార్జీలు కూడా చాలా తక్కువ. రోడ్డు రవాణా ఛార్జీల్లో మూడో వంతు ఉంటుంది. 


ఆక్వా రైతులు వినియోగించుకోవాలి 


కిసాన్‌ రైలును ఆక్వా రైతులు సద్వినియోగం చేసుకోవాలని  బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణారావు కోరారు. ఆక్వా ఉత్పత్తుల రవాణాలో రైతులకు ఆర్థిక భారం తగ్గిం చేందుకు, సులభతరం చేసేం దుకు ప్రధాని మోదీ అమలు చేస్తున్న మత్స్య సంపద యోజన పథకాన్ని వినియో గించుకుని ప్రయోజనం పొందాలని కోరారు. 


కిసాన్‌ రైలు రవాణా ఛార్జీలు విజయవాడ, గుడివాడ నుంచి ఇలా...  

ఎగుమతి అయ్యే ప్రదేశం టన్నుకు చార్జి

హౌరా                     రూ.2000

ఖరగ్‌పూర్‌                 రూ.1850

మాల్దా టౌన్‌             రూ.2390

గౌహతి                     రూ.3020

డిబ్రూఘర్‌                 రూ.3510

దిమాపూర్‌                 రూ.3290

సిల్‌బార్‌                 రూ.3360

కాగా కైకలూరు, భీమవరం నుంచీ ఎగుమతు లకు అవకాశం ఉంది. పైన పేర్కొన్న చార్జీలు ఈ స్టేషన్ల నుంచి కొద్దిగా తగ్గవచ్చు.

Updated Date - 2022-09-12T05:53:48+05:30 IST