Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 07 Aug 2022 15:22:38 IST

Workation: వర్కేషన్‌... ఇదోరకం ఉద్యోగం!

twitter-iconwatsapp-iconfb-icon
Workation: వర్కేషన్‌... ఇదోరకం ఉద్యోగం!

వర్కేషన్‌... ఉద్యోగ పర్వంలో ఇటీవల వినిపిస్తున్న కొత్తపదం. ఏళ్లకు ఏళ్లుగా ఆఫీసుల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు కరోనా దెబ్బకు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటిపట్టునే ల్యాప్‌టాప్‌లతో గంటల తరబడి కుస్తీ పడుతున్నారు. సుదీర్ఘమైన ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ సమయంలో కార్పొరేట్‌ కంపెనీల ఆలోచనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వాటి ఫలితమే... ‘వర్కేషన్‌’. ఉద్యోగి ఉల్లాసంగా, మరింత సృజనాత్మకంగా పనిచేయడానికి ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అవుతున్న సరికొత్త ట్రెండ్‌ ఇది...


కరోనా... ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త పనివిధానానికి తెర లేపింది. అదే ‘రిమోట్‌ వర్క్‌’. అంటే ఆఫీసుకు వెళ్లకుండా ఇంటి నుంచే పనిచేసే పద్ధతి. సుమారుగా గత రెండున్నరేళ్లుగా ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఈ తరహా పని విధానానికి అలవాటు పడ్డారు. అయితే ఇది కూడా ఒక నెలనో, రెండు నెలలో అయితే సమస్య ఉండేది కాదు. సంక్షోభ భూతం పీడ ఎప్పుడు విరుగుడవుతుందో తెలియని తికమకలో రోజులు, నెలలు పోయి, ఏళ్ల తరబడి ఉద్యోగులు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఇలాంటి పనివిధానం గతంలో ఎప్పుడూ ఎక్కడా చూడనిది. ఒకరకంగా ఇంట్లో ల్యాప్‌టాప్‌లతో కుస్తీ పడుతూ ఆఫీసు పనిచేయడం ఇబ్బందే. ముఖ్యంగా కార్పొరేట్‌ ఉద్యోగులు చాలాకాలంగా ఇంటిపట్టునే పనిచేస్తూ బోర్‌గా ఫీలవుతున్నారు. ఏమాత్రం సమయం చిక్కినా ఎక్కడికో ఒకదగ్గరికి ఎగిరిపోవాలని చూస్తున్నవారు ఎక్కువవుతున్నారు. సరిగ్గా వారి ఈ మానసిక స్థితిని అర్థం చేసుకుని సరికొత్త ‘వర్కేషన్‌’ అనే పదం పుట్టుకొచ్చింది. ఇటీవల కాలంలో ఇదొక ట్రెండ్‌గా మారి బాగా పాపులర్‌ అవుతోంది కూడా. 


‘వర్కేషన్‌’ అంటే(Workation)...

‘వర్క్‌’, ‘వెకేషన్‌’... రెండింటి కలయికే ‘వర్కేషన్‌’. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు విహారం రెండూ సమాంతరంగా సాగిపోవడమే దీని ప్రధాన ఉద్దేశం. వర్కేషన్‌లో వెళ్తున్నారంటే రిమోట్‌ ప్రదేశం నుంచి ఉద్యోగం చేస్తున్నారన్నమాటే. రెగ్యులర్‌ ఉద్యోగంలా ఆఫీసు నుంచో, లేకుంటే ఇంటి నుంచో పనిచేయకుండా మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్లిపోయి, అక్కడి నుంచి ల్యాప్‌టాప్‌తో లాగిన్‌ అవడం. ఆఫీసులో అయితే మీ సీట్లో కూర్చుని పనిచేస్తారు. మధ్యలో బ్రేక్‌ సమయంలో క్యాంటీన్‌కో, కాఫీమేకర్‌ దగ్గరకో వెళ్తారు. అదే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అయితే ఇంట్లో ఏదో ఒక గదిలో కూర్చుని పనిచేస్తారు. మధ్య మధ్యలో భార్య, పిల్లలు, కుటుంబసభ్యులతో డిస్టర్బెన్స్‌ ఎలాగూ ఉంటుంది. పైగా విద్యుత్‌ అంతరాయం, ఇంటర్నెట్‌ సరిగా పనిచేయకపోవడం వంటి అనుకోని ఇబ్బందులు కూడా తోడవుతాయి. అదే ‘వర్కేషన్‌’కు వెళితే... ఒక ప్రశాంతమైన ప్రదేశంలో, మీ వర్క్‌కు సంబంధించిన ఏర్పాట్లు రెడీమేడ్‌గా (హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ వంటివి) 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. ప్రశాంతమైన, మీరు ఇష్టపడే వాతావరణంలో ప్రకృతిని, పరిసరాలను ఆస్వాదిస్తూనే ల్యాప్‌టాప్‌లో ఆఫీసు ప్రాజెక్టులు చేయొచ్చు. ఇటీవల కాలంలో చాలా కంపెనీలు ఈ తరహా పనివిధానానికి సై అంటున్నాయి. కరోనా కారణంగా రెండేళ్లకు పైగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో అనేక ఒత్తిళ్లతో సతమతమవుతున్న తమ ఉద్యోగులకు ‘వర్కేషన్‌’ను అలవాటు చేస్తున్నాయి. 


‘ట్రెండ్‌’ ఊపందుకుంటోంది...

‘వర్కేషన్‌’ పనివిధానం మనకన్నా విదేశాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో 42 శాతం మంది ఉద్యోగులు ఈ తరహా పనికి ఇప్పటికే అలవాటు పడ్డారు. ప్రముఖ ట్రావెల్‌ సంస్థ ‘బుకింగ్‌ డాట్‌ కామ్‌’ సర్వే ప్రకారం 28 దేశాలకు చెందిన 20 వేలకు పైగా ట్రావెలర్స్‌ విహారం కోసం కాకుండా, పని కోసం పలు ప్రాంతాలకు వెళ్లేందుకు టికెట్లు బుక్‌ చేసుకుంటున్నారు. ట్రెండ్‌కు తగ్గట్టే పలు కంపెనీలు, ట్రావెల్‌ సంస్థలు, హోటళ్లు, రిసార్టులు తగిన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాయి. ఈ తరహా వెకేషన్‌కు ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తే బాగుంటుందో ప్రణాళికలు రచిస్తున్నాయి. ఉదాహరణకు ఉద్యోగి ఒక గమ్యాన్ని ఎంచుకుని, అక్కడికి చేరుకున్న తర్వాత హోటళ్లు వారి పనికి ఆటంకం కలగకుండా ఉండేందుకు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాయి. హైస్పీడ్‌ ఇంటర్నెట్‌తో కేబుల్స్‌ను, టవర్స్‌ను కొండలు, గుట్టలు, బీచ్‌లు, పచ్చికబయళ్ల ప్రాంతాల్లో అందుబాటులోకి తెస్తున్నాయి. ఉద్యోగులకు కావాల్సిన ఆహార పదార్థాలు... పానీయాలను 24 గంటలు సర్వ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. 


Workation: వర్కేషన్‌... ఇదోరకం ఉద్యోగం!

 ఉల్లాసంగా... సృజనాత్మకంగా...

నచ్చినచోటుకు వెళ్లిపోయి, అక్కడి అందాలను ఆస్వాదిస్తూ ఆఫీసు పనిచేయడం ఒక విభిన్నమైన అనుభవం. ప్రశాంతమైన వాతావరణంలో చెట్టుకిందనో, సరస్సు పక్కనో, సముద్రం ఎదురుగానో లేదంటే కొండ ప్రాంతాల్లో ల్యాప్‌టాప్‌ పట్టుకుని కూర్చుని పనిచేస్తే రొటీన్‌కు భిన్నంగా అనిపిస్తుంది. గది నాలుగు గోడల మధ్య పనిచేసేకన్నా... బయటి వాతావరణంలో క్యాజువల్‌ దుస్తులు ధరించి పనిచేస్తే సృజనాత్మకత పెరుగుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఆరుబయట, సరికొత్త వాతావరణం తప్పకుండా మనసుపై ప్రభావం చూపుతుంది. ఆహ్లాదకరమైన పరిసరాలు పని విధానాన్ని మెరుగు పరుస్తాయి. ఒకేచోట, ఒకే స్థలంలో, ఒకే వాతావరణంలో పనిచేస్తే రొటీన్‌గా అనిపిస్తుంది కానీ... అదే నచ్చిన స్థలంలో, చక్కని వాతావరణంలో అయితే మెదడు మరింత చురుకుగా, సృజనాత్మకంగా పనిచేస్తుందనే విషయాన్ని గ్రహించే చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ‘వర్కేషన్‌’ ఆప్షన్‌ ఇస్తున్నాయి. ఆలోచన వేరు... సృజనాత్మకంగా ఆలోచించడం వేరు. ఈ తరహా ఉద్యోగం తాత్కాలికమే కావొచ్చు కానీ పనిచేసినంత సేపు ఉత్సాహంగా ఉంటుంది. వాటి తాలూకు అనుభూతులు జీవితకాలం వెన్నంటే ఉంటాయి. పైగా నాణ్యతతో కూడిన ఔట్‌పుట్‌కు అవకాశాలు ఎక్కువ. రెగ్యులర్‌గా ఉండే ఇబ్బందులు, శబ్దాలకు దూరంగా... మీదైన ఒక ప్రపంచాన్ని ఆస్వాదిస్తూనే ఆఫీసు డ్యూటీ చేయడమనేది మనసును, బుర్రను రిఫ్రెష్‌ చేస్తుంది కూడా. 


అభిరుచులను బట్టి...

సాధారణంగా విహారం అనగానే వినోదభరితంగా ఉండాలని కోరుకుంటారెవరైనా. అయితే ఈ ‘వర్కేషన్‌’లో వినోదం కన్నా రిలాక్స్‌ ముఖ్యం. ఓ వైపు సీరియస్‌గా పనిచేస్తూనే, ఖాళీ సమయంలో ప్రకృతిని చూస్తూ, కాఫీ తాగుతూనో, స్నాక్‌ తింటూనో రిలాక్స్‌ అవ్వొచ్చు. ఉద్యోగులు తమ అభిరుచులకు అనుగుణంగా గమ్యాలను ఎంచుకుంటున్నారు. కొండ ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలు, అటవీ ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు... ఇలా ఎవరికి నచ్చిన ప్రాంతాలను వారు ‘వర్కేషన్‌’ కోసం ఎంపిక చేసుకుంటున్నారు. మనదేశంలో ఎక్కువ మంది కూర్గ్‌, చిక్‌మగ్‌ళూరు, వయనాడ్‌, ధర్మశాల, కోవలమ్‌లతో పాటు ఇప్పటిదాకా పెద్దగా పేరు వినని కసౌలీ, సక్లేష్‌పూర్‌, అల్మోరా, పంచ్‌గని వంటి వాటిని వర్కింగ్‌ డెస్టినేషన్‌గా, అక్కడి హోటళ్లు, రిసార్టులు బుక్‌ చేసుకుంటున్నారు. ఉద్యోగులకు ఇష్టమైన (చూడాలనుకుంటున్న) ప్రదేశాలను తెలుసుకుని, వారిని కోరుకున్న చోటుకే ‘వర్కేషన్‌’ కోసం ఆయా కంపెనీలు పంపిస్తున్నాయి. ఇటీవల ఆస్ర్టేలియాకు చెందిన ‘సూప్‌ ఏజెన్సీ’ అనే మార్కెటింగ్‌ సంస్థ తన ఉద్యోగులందర్నీ బాలి ద్వీపాలకు ‘వర్కేషన్‌’ కోసం పంపింది. కొందరు ఉద్యోగులు గ్రూపుగా వెళ్తుంటే, చాలామంది మాత్రం వ్యక్తిగతంగా తమకు నచ్చిన ప్రాంతానికి వెళ్లి రిలాక్స్‌ అవుతూనే ఉద్యోగం చేస్తున్నారు. కొన్నిసార్లు అదేప్రాంతం నుంచి మరికొన్నాళ్లు పనిచేస్తానని ఉద్యోగి అభ్యర్థిస్తే అందుకు కంపెనీలు అంగీకరిస్తున్నాయి కూడా. ప్రస్తుత సమయంలో ఒక ఉద్యోగి తన పనిని సక్రమంగా చేయాలంటే వారి మానసిక స్థితితో పాటు, శారీరక స్థితి కూడా ఫిట్‌గా, రిలాక్స్డ్‌గా ఉండాలని కంపెనీలు కోరుకుంటున్నాయి. ‘కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే ఇలాంటి కొత్తరకం ఆలోచనలు చేయాల్సిందే’ అంటున్నారు మానసిక నిపుణులు. 


ప్రణాళిక అవసరమే...

నచ్చిన చోటుకు వెళ్లడమనే సరదాతో ఏదో ఒక గమ్యాన్ని ఎంచుకోవడం కూడా ఇబ్బందే. ముందుగా ఏ ఉద్యోగికైనా ‘వర్కేషన్‌’పై సంపూర్ణ అవగాహన ఉండాలి. ఏ సందర్భంలో, ఎలాంటి పరిస్థితుల్లో వెళుతున్నామో కచ్చితంగా తెలవాలి. విహారానికి వెళ్లినట్టుగా బ్యాగులు సర్దుకుని వెళ్లడం కాదు ‘వర్కేషన్‌’ అంటే. ఉద్యోగ సమయం, పని విధానం, మానసిక పరిస్థితిపై ఎవరైనా సరే కొన్ని ప్రణాళికలు వేసుకోవాల్సిందే. ‘వర్కేషన్‌’ అనేది ఒక దెబ్బకు రెండు పిట్టలు లాంటిదే. ఒకటి రిలాక్స్‌... రెండోది ఉత్పాదకత. ఈ రెండింటిని సమన్వయం చేసుకోవడం చాలా ముఖ్యం. దీనితోపాటు సమయం, సందర్భం కూడా చూసుకోవాలి. తింటున్నప్పుడో, సరదాగా ఈత కొడుతున్నప్పుడో ఆఫీస్‌కు సంబంధించి వీడియో కాల్‌ అటెండ్‌ అయితే ఎలా ఉంటుంది? అందుకే వృత్తి నైపుణ్యత ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుంది. ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’(Work from Home) వల్ల చాలామంది ఉద్యోగులు బెడ్‌నే వర్క్‌ స్టేషన్‌గా చేసుకున్నారు. అయితే అది మంచి పద్ధతి కాదనేది నిపుణుల అభిప్రాయం. ‘వర్కేషన్‌’లో కూడా తప్పకుండా ఒక రెగ్యులర్‌ వర్క్‌ స్టేషన్‌ను సిద్ధం చేసుకోవాల్సిందే. అక్కడే ఆఫీసు పని చేసుకునేలా చూడాలి. ఒకవేళ కంపెనీలు గ్రూపుగా ఉద్యోగులను పంపిస్తే వర్క్‌ స్టేషన్‌ను వారే సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల టీమ్‌వర్క్‌ కనిపిస్తుంది. ఉద్యోగులు ‘వర్కేషన్‌’కు వెళ్లాలని ఎందుకు కోరుకుంటున్నారంటే...


  • సరికొత్త ప్రదేశానికి వెళ్తే సహజంగానే మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. 
  • కొత్త మనుషులు, కొత్త పరిచయాల మధ్య పనిచేయడం ఉత్సాహంగా ఉంటుంది.
  • పని- దినచర్యల నడుమ చిక్కుకుపోయామనే భావనకు గురైనప్పుడు, ఒకేరకం ఆలోచనలకు ఫుల్‌స్టాప్‌ పెట్టి, కొత్త ఆలోచనలు మొగ్గ తొడగడానికి అవకాశాలెక్కువ. 
  • విహారంలా కాకుండా ఎక్కువ కాలం ఒకేచోట ఉంటారు కాబట్టి, రొటీన్‌ జీవితానికి భిన్నంగా కొత్త ప్రాంతాల సంస్కృతులు తెలుసుకోవచ్చు. 

Workation: వర్కేషన్‌... ఇదోరకం ఉద్యోగం!

ఏదేమైనా కరోనా అనంతరం అందరిలో తెలియని నిస్తేజం ఆవరించిందనడంలో సందేహం లేదు. అందుకే విహారయాత్రలకు పొలోమంటూ బ్యాగులు సర్దుకుంటున్నారు. అయితే ఉద్యోగులు తరచూ విహారయాత్రలకు వెళ్లలేరు. అలాంటప్పుడు ఉద్యోగాన్నే(Job) విహారంతో ముడిపెడితే వారిలో కొత్త ఉత్సాహం వస్తుంది. ఈ సూత్రాన్నే ‘వర్కేషన్‌’గా మార్చారు. ‘‘కరోనా వల్ల ప్రజలు వారున్న ప్రాంతాల పట్ల ఆసక్తిని కోల్పోయారు. ఇలాంటి సమయంలో వర్కేషన్‌ అనేది సహజంగానే ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. ఒక గమ్యాన్ని ఎంచుకుని అక్కడే ఐదు రోజులు పనిచేసి, మిగతా వీకెండ్స్‌ ఆ చుట్టుపక్కల జాలీగా గడపడం సులువైన మార్గం. అందుకే ఈ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని ట్రావెల్‌ కంపెనీలు, హోటళ్లు, రిసార్టులు సరికొత్తగా ముస్తాబు అవుతున్నాయి. రానున్న కాలంలో ఇదొక పెద్ద ట్రావెల్‌ ట్రెండ్‌గా మారుతుంది’’ అని హాస్టెల్లర్‌ సంస్థ సీఈవో ప్రణవ్‌ దంగీ అంటున్నారు. నవతరం ఇప్పటికే ఈ తరహా ఉద్యోగానికి స్వాగతం చెబుతోందని రోజురోజుకు పెరుగుతున్న బుకింగ్స్‌, ఎంక్వయిరీలను బట్టి అర్థమవుతోంది. 


రిమోట్‌ వీసా ప్రోగ్రామ్‌(Remote Visa Program)

‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ తర్వాత ‘వర్కేషన్‌’కు అన్ని దేశాల్లో డిమాండ్‌ బాగా పెరిగింది. పలు కార్పొరేట్‌ కంపెనీలకు చెందిన ఉద్యోగస్థులు, ఐటీ నిపుణులు స్వదేశంలోనే కొన్ని ప్రాంతాలను ఎంచుకుని, అక్కడే ఉంటూ ఆన్‌లైన్‌లో ఉద్యోగాలు చేస్తుంటే, మరికొందరు విదేశాలను ఛాయిస్‌గా ఎంచుకుంటున్నారు. ట్రెండ్‌ ఊపందుకోవడంతో పలు దేశాలు తాత్కాలిక వీసాలను కూడా ఇచ్చేందుకు సుముఖతను వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా దుబాయ్‌ ‘రిమోట్‌ వీసా ప్రోగ్రామ్‌’ను ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా సందర్శకులకు ఏడాది పాటు వీసాలను అనుమతిస్తోంది. పలు ప్రాంతాల్లో ఉద్యోగులకు అవసరమైన ఏర్పాట్లు చేసి, వారు ఎలాంటి అవాంతరాలు లేకుండా పనిచేసేందుకు కో వర్కింగ్‌ స్పేస్‌ను సృష్టిస్తోంది. ఎక్కువమంది ‘వర్కేషనర్స్‌’ను ఆకట్టుకునేందుకు ఆయా నగరాల్లోని హోటళ్లు ఏర్పాటు చేసుకున్నాయి. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.