Abn logo
Jun 15 2021 @ 12:45PM

టైటానిక్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఆ ఆరుగురు ఏమయ్యారు..? అమెరికా తరిమేశాక..

‘టైటానిక్’ తరాల అంతరాలను దాటి ప్రపంచం మొత్తం ఒక అద్భుతమైన ప్రేమకావ్యంగా మన్ననలు పొందిన చిత్రం. ఈ సినిమాలో కనిపించే టైటానిక్ పడవ నిజంగానే ఉందని, సముద్రం అంతర్భాగంలో కలిసిపోయిన అసలు ఓడ నేపథ్యంలోనే జేమ్స్ కామరూన్ తన ప్రేమకావ్యాన్ని తెరకెక్కించాడని తెలుసు కదా. అయితే నిజమైన టైటానిక్ పడవ మునిగిపోయినప్పుడు ఓ ఆరుగురు చైనీయులు ప్రాణాలతో బయటపడ్డారని తెలుసా? చాలా తక్కువ మందికి ఈ విషయం తెలుస్తుంది. ఎందుకంటే ఈ నిజాన్ని అప్పటి మీడియా తమ అవాస్తవాలతో సమాధి చేసింది. ఈ ఆరుగురిని క్రూరులుగా, చెడ్డవారిగా చిత్రీకరించింది. అయితే ఈ ఆరుగురు టైటానిక్ హీరోల గురించి నిజాలు బయటపెట్టేందుకు ముందుకొచ్చారు హాలీవుడ్ డైరెక్టర్ ఆర్థర్ జోన్స్.

టైటానిక్ చిత్రంలో కూడా ఒక చైనీయుడు బతకడాన్ని కామరూన్ అత్యద్భుతంగా చిత్రించారు. అయితే ఎడిటింగ్‌లో ఈ సీన్ కట్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ రోజ్ ఎలాగైతే ఒక తలుపు చెక్క పట్టుకొని బతికిందో, నిజానికి ఒక చైనీయుడు కూడా అసలు టైటానికి మునకలో అలాగే తప్పించుకున్నాడు. ఆయన పేరు ‘ఫాంగ్ లాంగ్’. అయితే ఆ సినిమాలో హీరోయిన్‌లా ఆయన కథ అంత గొప్పగా సాగలేదు. వివక్ష, ద్వేషం చుట్టుముట్టాయి. చావు అంచుల వరకూ వెళ్లి తిరిగొచ్చిన తన అనుభవాలను భావితరాలకు పంచిపెట్టాలంటే భయపడేలా చేశాయి. అట్లాంటిక్ సముద్రంలో గడ్డకట్టే చలిలో ఉన్న ఆయన్ను కాపాడిన సిబ్బంది న్యూయార్క్ సమీపంలోని ఎల్లీస్ దీవికి తరలించారు. కానీ అప్పట్లో అమెరికాలో చైనీస్ ఎక్స్‌క్లూజన్ చట్టం అమల్లో ఉంది. అంటే చైనీయులను అమెరికాలోకి రానివ్వరన్నమాట. దీంతో ఫాంగ్ లాంగ్‌, ఆయనలాగే తప్పించుకున్న మరో ఆరుగురిని వెనక్కు పంపేసింది అగ్రరాజ్యం.

(ది సిక్స్.. సినిమా పోస్టర్)

టైటానిక్‌ నౌకలో 8 మంది చైనీయులు ఉన్నారు. వారి పేర్లు లీ బింగ్, ఫాంగ్‌లాండ్, చాంగ్‌ చిప్, అహ్‌ లామ్, చుంగ్‌ఫూ, లింగ్‌ హీ. లాన్ లామ్, లి లింగ్ అనే ఇద్దరు చనిపోయారు. అయితే ఈ పడవ ప్రమాదంలో బతికి బట్టకట్టిన చైనీయులు లైఫ్ బోట్లలో సీట్ల కింద దూరి బయటపడ్డారని అప్పట్లో కొన్ని పత్రికలు వార్తలు ప్రచురించాయి. అలాగే పడవ మునిగిపోయే సమయంలో ఆడవారిని, చిన్నపిల్లలను కాపాడటానికి అందరూ ప్రాధాన్యం ఇచ్చారని, కానీ ఈ చైనా వాళ్లు మాత్రం ఆడవాళ్లలా వేషం వేసుకొని ప్రాణాలు కాపాడుకున్నారని కథలు వినిపించాయి. అయితే ఆ తర్వాత స్టీవెన్ ష్వాంకర్ అనే పరిశోధకుడు చేసిన దర్యాప్తులో అలాంటివేమీ జరగలేదని తేలింది.

అమెరికా నుంచి వెనక్కు పంపేసిన వీరిని క్యూబా పంపారు. అక్కడ కొంచెం కోలుకున్నాక ఇంగ్లండ్ చేరుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్‌లో నావికుల కొరత ఎక్కువగా ఉండటంతో వారికి ఉపాధి దొరికింది. న్యుమోనియా రావడంతో చాంగ్‌ చిప్ 1914లో మరణించారు. లండన్‌లో ఓ మారు మూల ప్రాంతంలో ఆయన్ను సమాధి చేశారు. మిగతా వాళ్లు 1920 వరకూ కలిసి ఒకే చోట పనిచేశారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో వలసదారులపై స్థానికుల్లో వ్యతిరేకత మొదలైంది. వీళ్లలో కొందరు బ్రిటన్ అమ్మాయిలను పెళ్లి చేసుకొని, పిల్లలను కని కుటుంబంతో సుఖంగా ఉంటున్నారు. కానీ ప్రజల్లో వ్యతిరేకతతో కుటుంబాన్ని వదిలి విదేశాలకు పారిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. వీరిలో అహ్ లామ్ హాంకాంగ్ వెళ్లగా, లింగ్ హీ కలకత్తా వచ్చారు. లీ జింగ్ కెనడా ప్రయాణం కాగా, ఫాంగ్ లాంగ్ తిరిగి అమెరికా వచ్చి అక్కడే స్థిరపడ్డారు. కానీ వీరిలో ఎవరూ కూడా తమ జీవితంలోని అంత ముఖ్యమైన టైటానిక్ ఘటనను తమ కుటుంబీకులకు కూడా చెప్పుకోలేదు. అంటే వారిపై అప్పటి ప్రచారం ఎంత భయంకరమైన ప్రభావం చూపిందో తెలుసుకోవచ్చు. ఈ వాస్తవాలను చెప్పడం, చైనీయులపై అప్పట్లో అమెరికా పత్రికలు చూపిన వివక్ష వంటి నిజాలను మన కళ్లకు కట్టడం కోసం ఆర్థన్ జోన్స్ ‘ది సిక్స్’ పేరిట డాక్యుమెంటరీ సినిమా తీశారు.


ప్రత్యేకంమరిన్ని...