గంటాపై గరంగరం.. విజయసాయిరెడ్డి, ముత్తంశెట్టి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా..

ABN , First Publish Date - 2020-08-08T16:32:01+05:30 IST

‘ఏ పార్టీ అధికారంలో వుంటే... గంటా శ్రీనివాస రావు ఆ పార్టీలో వుంటారు’’ అన్నది అన్ని రాజకీయ పార్టీల విశ్లేషకులు తరచూ అంటుంటారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా వున్న ఆయన, అధికా రంలో వున్న వైసీపీలో చేరడానికి గత కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు దేశం పార్టీ నిర్వహించే

గంటాపై గరంగరం.. విజయసాయిరెడ్డి, ముత్తంశెట్టి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా..

గంటాపై గరం గరం.. అధికారం ఎక్కడుంటే అక్కడ ఉంటారని ఆరోపణలు

మంత్రిగా ఉన్నప్పుడు తమపై కేసులు పెట్టించారని ధ్వజం

కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆవేదన

భీమిలి నియోజకవర్గంలో నిరసనలు

అవినీతి నుంచి బయటపడడానికేనని మంత్రి ముత్తంశెట్టి పలుమార్లు విమర్శ

ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి విజయసాయిరెడ్డి కూడా వ్యతిరేకిస్తున్న వైనం 

20 ఏళ్లలో నాలుగుమార్లు పార్టీలు మారిన విషయాన్ని గుర్తు చేస్తున్న అధికార పార్టీ నేతలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ‘‘ఏ పార్టీ అధికారంలో వుంటే... గంటా శ్రీనివాస రావు ఆ పార్టీలో వుంటారు’’ అన్నది అన్ని రాజకీయ పార్టీల విశ్లేషకులు తరచూ అంటుంటారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా వున్న ఆయన, అధికా రంలో వున్న వైసీపీలో చేరడానికి గత కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.   తెలుగు దేశం పార్టీ నిర్వహించే సమావేశాలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శించక పోవ డం ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. వీటిపై పత్రికల్లో వార్తా కథనాలు వస్తున్నప్పటికీ ఆయన ఖండించకపోవ డం, పార్టీ మార్పుపై వస్తున్న  ఊహాగానాలకు బలం చేకూరుతున్నది. వైసీపీలో చేరడానికి ఈ నెల 9వ తేదీన ముహూర్తం పెట్టుకున్నారని కొందరు, కాదు ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం తాడేపల్లి వెళ్లి సీఎం జగన్‌ సమక్షంలో పార్టీలో చేరతారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. దీనిపై కూడా గంటా పెదవి విప్పడం లేదు. ఆయన అనుచరవర్గం కూడా స్పందించడం లేదు. దీంతో ఆయన వైసీపీలోకి రావడం ఖాయమని తేలడంతో జిల్లాలో వైసీపీ వర్గాలు భగ్గుమంటున్నాయి. 


తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మంత్రి ముత్తంశెట్టి

వైసీపీలోకి గంటా శ్రీనివాసరావు రాకను జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌ఛార్జి విజయసాయిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసింది. ముత్తంశెట్టి అయితే పలుమార్లు పార్టీ సమావేశాలు, ప్రెస్‌మీట్లలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడమే కాకుండా, గంటాపై పలు ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. ఆయన (గంటా శ్రీనివాసరావు) ప్రజలకు మేలు చేయడానికో, రాష్ట్రాన్ని ఉద్ధరించడానికో పార్టీ మారడం లేదన్నారు. ఆయనపై వున్న భూకుంభకోణం కేసులు, సైకిళ్ల కుంభకోణం ఆరోపణల నుంచి బయట పడేందుకు వైసీపీలో చేరడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అధికారం లేకపోతే ఉండలేరని, అందుకే తమ పార్టీలోకి జంప్‌ చేసేందుకు కాచుకు కూర్చొన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌ఛార్జి విజయసాయిరెడ్డి కూడా గంటా శ్రీనివాసరావుపై గతంలో అనేకసార్లు బహిరంగ సభల్లోనే విమర్శలు చేశారు. గంటా అవినీతిపరుడని, భూకుంభకోణాల్లో ఉన్నారని, అటువంటివారిని తాము పార్టీలో చేర్చుకోబోమని స్పష్టం చేశారు. జిల్లాలో కీలకమైన ఇద్దరు నేతలు వైసీపీలోకి తన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో... గంటా నేరుగా పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతూ తన చేరికకు మార్గం సుగమం చేసుకున్నట్టు సమాచారం. ఎటువంటి కండిషన్లు లేకుండా వస్తేనే పార్టీలో చేర్చుకుంటామని, పదవులు ఇచ్చే పరిస్థితి లేదని అధిష్ఠానం స్పష్టం చేయడంతో... ఇందుకు అంగీకరించి వైసీపీలో చేరడానికి గంటా రంగం సిద్ధం చేసుకున్నట్టు చెబుతున్నారు. 


పార్టీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత

తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు... త్వరలో వైసీపీలో చేరడం ఖాయమని వార్తలు రావడంతో గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన భీమిలి నియోజకవర్గం వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.  మంత్రిగా ఉన్నప్పుడు తమను ఎన్నోరకాలుగా వేధించారని, కేసులు పెట్టారని వారు ఆరోపిస్తున్నారు. 2018, సెప్టెంబరులో తమ అధినేత జగన్‌ పాదయాత్రలో భాగంగా భీమిలి రాగా... నాడు మంత్రిగా ఉన్న గంటా... చిన్నాపురం జంక్షన్‌లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని కూలగొట్టించారని వారు గుర్తు చేస్తున్నారు. ఆయనతోపాటు అనుచరవర్గం పలు అక్రమాలకు పాల్పడ్డారని, భూ కబ్జాలు చేశారని వారు ఆరోపిస్తున్నారు. గంటాను పార్టీలో చేర్చుకోవద్దంటూ గురువారం  భీమిలి మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌ పెదబాబు, కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ మాజీ వైస్‌ఛైర్మన్‌ గిరిబాబు, తదితర నేతల ఆధ్వర్యంలో ధర్నాలు, మానవహారాలు చేపట్టారు. ‘అవినీతిపరుడు గంటా మాకొద్దు’,  ‘భూకబ్జాదారులను తీసుకోవద్దు’’ అంటూ నినాదాలు చేశారు.


నాలుగుసార్లు పార్టీ మార్పు...

సుమారు రెండు దశాబ్దాల క్రితం తెలుగుదేశలో చేరి రాజకీయాల్లోకి వచ్చిన గంటా శ్రీనివాసరావు... తరువాత పలు పార్టీలు మారారు. అంతేకాక ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేయలేదు. విశాఖలో వ్యాపారవేత్తగా వున్న ఆయన... 1999లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయడానికి టికెట్‌ ఆశించారని, కానీ గ్రీన్‌ సిగ్నల్‌ లభించలేదని, దీంతో తెలుగుదేశంలో చేరారని  ప్రచారం జరిగింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి నుంచి టీడీపీ  అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు. తరువాత చోడవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడంతో టీడీపీని వీడి అందులో చేరారు. 2009లో అనకాపల్లి నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తరువాత సంభవించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో  పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో ఆయన ఆ పార్టీలోకి వచ్చేశారు. వెంటనే మంత్రి కూడా అయ్యారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్‌ను వీడి మళ్లీ టీడీపీలోకి వచ్చారు. కొత్త రాష్ట్రం అభివృద్ధికి చంద్రబాబునాయుడు వంటి గొప్ప విజన్‌ నాయకుడు  అవసరమని, అందుకే టీడీపీలో చేరానని అన్నారు.  భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందడమే కాకుండా మంత్రి కూడా అయ్యారు. 


ఈ నేపథ్యంలో గత ఏడాది ఎన్నికలకు ముందు అనకాపల్లి ఎంపీగా వున్న ముత్తంశెట్టి శ్రీనివాసరావు... ఈసారి తాను భీమిలి నుంచి ఎమ్మెల్యేగా(2009లో పీఆర్పీ తరపున గెలిచారు) పోటీ చేస్తానని, టికెట్‌ ఇవ్వాలని టీడీపీ అధినేతను కోరారు. చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. రోజులు గడుస్తున్నా ఎటూ తేల్చకపోవడంతో ముత్తంశెట్టి వైసీపీలో చేరారు. భీమిలి టికెట్‌ పొందారు. కారణం ఏదైతేనేం గంటా శ్రీనివాసరావు భీమిలిలో పోటీ చేయకుండా ఎప్పటి మాదిరిగానే నియోజకవర్గం మారారు. ఈసారి విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేసిన సుమారు నాలుగు వేల మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల తరువాత వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరడానికి అప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

Updated Date - 2020-08-08T16:32:01+05:30 IST