కింగ్‌పిన్‌ టోనీ జైల్లో ఉన్నా Drugs.. ఎక్కడ్నుంచి వస్తున్నాయ్.. సహకరిస్తున్నదెవరు..!?

ABN , First Publish Date - 2022-02-28T16:01:02+05:30 IST

దేశంలో డ్రగ్‌ సరఫరాలో కింగ్‌పిన్‌గా భావిస్తున్న టోనీ చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. దీంతో డ్రగ్స్‌ సరఫరా నిలిచిపోయిందని భావించారు. కానీ..

కింగ్‌పిన్‌ టోనీ జైల్లో ఉన్నా Drugs.. ఎక్కడ్నుంచి వస్తున్నాయ్.. సహకరిస్తున్నదెవరు..!?

  • ఎక్కడి నుంచి వస్తున్నాయి..?  
  • కొరియర్‌లో నేరుగా నగరానికి.. 
  • సహకరిస్తున్నది ఎవరు?
  • ఆరా తీస్తున్న పోలీసులు

హైదరాబాద్‌ సిటీ : దేశంలో డ్రగ్‌ సరఫరాలో కింగ్‌పిన్‌గా భావిస్తున్న టోనీ చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. దీంతో డ్రగ్స్‌ సరఫరా నిలిచిపోయిందని భావించారు. కానీ, ఇటీవల విద్యార్థులతో సహా  పలువురు డ్రగ్‌ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కడంతో ఈ దందాకు చెక్‌ పడలేదని తెలుస్తోంది. కొందరు విద్యార్థులు డ్రగ్స్‌కు అలవాటు పడి.. అందులో నుంచి బయటకు రాలేక నేరుగా దిగుమతి చేసుకునే స్థాయికి చేరారని పోలీసులకు పట్టుబడిన వారిని చూస్తే అర్థం అవుతోంది. అయితే, కొరియా నుంచి నేరుగా కొరియర్‌లో నగరానికి డ్రగ్స్‌ దిగుమతి చేసుకోవడంతో దీని వెనుక ఎవరున్నారనే విషయంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.


టోనీ డేటాతో వెలుగులోకి..

డ్రగ్స్‌ సరఫరాదారుడు, నైజీరియా వాసి టోనీని పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే. అయితే, అతడి కాల్‌ లిస్ట్‌, ఫోన్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌, చాటింగ్‌ల డేటా ఆధారంగా పలువురిని గుర్తించిన పోలీసులు, డ్రగ్స్‌ నిరోధానికి ప్రత్యేకంగా నియమించిన హెచ్‌- న్యూ (హైదరాబాద్‌ నార్కొటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌) అధికారులు వారి కదలికలపై నిఘా పెట్టారు. టోనీతో సంబంధాలు కొనసాగించడంతో పాటు.. డ్రగ్స్‌ కొనుగోలు చేసి వినియోగించినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 


డార్క్‌ వెబ్‌సైట్‌ ద్వారా.. 

టోనీ అరె‌స్ట్‌తో డ్రగ్స్‌ సరఫరా లింక్‌ కట్‌కావడంతో అప్పటికే డ్రగ్స్‌కు అలవాటు పడిన కొందరికి టోనీ గోవాలో పరిచయం కావడం, అతడి అనుచరుల గురించి తెలిసిన వారు నేరుగా అక్కడికే వెళ్లారు. గోవాలో లభించిన సమాచారం మేరకు డార్క్‌ వెబ్‌సైట్‌ ద్వారా కొరియాకు డ్రగ్స్‌ ఆర్డర్‌ చేశారు. ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరిగాయి. ఇంకేముంది నేరుగా వీరు సూచించిన అడ్ర్‌సకు కొకైన్‌ పార్సిల్‌ చేరుకుంది.


సూత్రధారి ఎవరు..?

తొలుత డ్రగ్స్‌ కొనుగోలు చేసిన వారు.. ఇప్పుడు నేరుగా డ్రగ్స్‌ దిగుమతి చేసుకునే స్థాయికి చేరుకోవడం వెనుక ఎవరున్నారనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. గోవాలో వీరికి సలహాలు ఇచ్చింది ఎవరు? ఈ వ్యవహారానికి స్రూతధారి ఎవరు? టోనీతో పరిచయం ఉన్నావారైనా, కొత్తవారు ఎవరైనా టోనీలా డ్రగ్స్‌ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నారా? అన్న విషయాలపై ఆరా తీసుకున్నారు. శనివారం నగర పోలీసులు అరెస్టు చేసిన వారిని తిరిగి కస్టడీకి తీసుకుని విచారించే అవకాశమున్నందున మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.


ఉక్కుపాదమే..

డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు హైదరాబాద్‌ పోలీసులు రెండు ప్రత్యేక విభాగాలను ప్రారంభించారు. ఇటీవల ప్రారంభమైన హెచ్‌-న్యూ (హైదరాబాద్‌ నార్కొటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌) కార్యకలాపాలు సీపీ కార్యాలయం నుంచి కొనసాగుతున్నాయి. ఇప్పటికే గుర్తించిన వినియోగదారులు, సరఫరాదారులపై చర్యలు చేపడుతున్న  హెచ్‌-న్యూ అధికారులు ఇకముందు డ్రగ్స్‌ స్థావరాలపై దాడులు, కేసులు చేయడం, డ్రగ్స్‌ ఉనికిని గుర్తించడం, మాదకద్రవ్యాలను అరికట్టడమే ధ్యేయంగా 24 గంటలు పని చేయనున్నారు. అదేవిధంగా ఎన్‌ఐఎస్‌డబ్ల్యూ (నార్కొటిక్స్‌ ఇన్వెస్టిగేషన్‌ సూపర్‌విజన్‌ వింగ్‌) అనే మరో విభాగం సాయంతో నిందితుల రిమాండ్‌లు, వారి నుంచి సీజ్‌ చేసిన సామగ్రిని కోర్టుకు అప్పగించడంతోపాటు చార్జ్‌షీట్‌ల సమర్పణ, ఆధారాలను సేకరించి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటారు.

Updated Date - 2022-02-28T16:01:02+05:30 IST