పోలింగ్‌ సిబ్బందికి ప్రత్యేక కేంద్రాలు

ABN , First Publish Date - 2022-09-22T07:09:47+05:30 IST

ఎన్నికల సమయంలో పోలింగ్‌ సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేక కేంద్రాలను (ఓటర్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌) ఏర్పాటుచేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించింది.

పోలింగ్‌ సిబ్బందికి ప్రత్యేక కేంద్రాలు

శిక్షణ సమయంలోనే ఓటు వేసేలా చర్యలు.. బ్యాలెట్‌ పత్రాల దుర్వినియోగంపై ఈసీ ఆందోళన

నియమావళిలో మార్పుల కోసం కేంద్రానికి నివేదించాలని నిర్ణయం


న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: ఎన్నికల సమయంలో పోలింగ్‌ సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేక కేంద్రాలను (ఓటర్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌) ఏర్పాటుచేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న ఎన్నికల నియమావళిలో  మార్పుల కోసం కేంద్రానికి నివేదించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం... పోలింగ్‌ సిబ్బంది ఓట్ల లెక్కింపు రోజు ఉదయం 8 గంటలలోపు ఎప్పుడైనా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.పోలింగ్‌ విధుల కోసం సొంత నియోజకవర్గం కాకుండా ఇతర నియోజకవర్గాలకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఈ మేరకు వారికి వెసులుబాటు కల్పించారు. దీంతో పోలింగ్‌ సిబ్బంది వారికిచ్చిన బ్యాలెట్‌ పత్రాలను తమ వద్దే చాలా రోజులు ఉంచుకుంటున్నారు.


దీనివల్ల పోలింగ్‌ సిబ్బందిని రాజకీయ నాయకులు, పార్టీలు ప్రభావితం చేయటంతోపాటు... బ్యాలెట్‌ పేపర్లు దుర్వినియోగం కావచ్చని ఈసీ భావిస్తోంది. ఇలా బ్యాలెట్‌ పేపర్లను దగ్గరే ఉంచుకోవటం వల్ల పోలింగ్‌ సిబ్బందికి బెదిరింపులు కూడా వచ్చే అవకాశం ఉందని ఈసీ ఆందోళన చెందుతోంది. దీన్ని నివారించటానికి పోలింగ్‌ సిబ్బంది ఓటు వేసే విధానంలో మార్పులు చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేయాలని ఈ నెల 16న జరిగిన  సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ నిర్ణయించారు. దీన్ని అనుసరించి పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ ఇచ్చే ప్రదేశంలోనే ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటుచేస్తారు. పోలింగ్‌ సిబ్బంది శిక్షణ ముగించుకుని తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లకముందే ఫెసిలిటేషన్‌ సెంటర్లలో ఓటు హక్కును వినియోగించుకోవాలి. బ్యాలెట్‌ పత్రాలను తమతోపాటు తీసుకెళ్లటం కుదరదు. అయితే ప్రత్యేక కేంద్రాలను ఉపయోగించుకోనివారు ఇప్పుడున్న మాదిరిగానే పోస్టు ద్వారా కూడా బ్యాలెట్‌ పత్రాలను పంపించటానికి అనుమతించాలని ఈసీ నిర్ణయించింది. ఓట్ల లెక్కింపు రోజు ఉదయం 8 గంటలకల్లా ఆయా బ్యాలెట్‌ పేపర్లు సంబంధిత రిటర్నింగ్‌కు ఆఫీసర్‌కు చేరేలా పోస్టు చేయాల్సి ఉంటుంది.

Updated Date - 2022-09-22T07:09:47+05:30 IST