ఉత్తరాంధ్రకు.. ‘స్పెషల్‌’ సందడి!

ABN , First Publish Date - 2021-01-11T06:37:35+05:30 IST

సంక్రాంతి ప్రయాణాలు ఊపందుకుంటున్నాయి. ‘ఆర్టీసీ’ స్పెషల్స్‌ ఉత్తరాంధ్రకు పరుగులు పెడుతున్నాయి.

ఉత్తరాంధ్రకు.. ‘స్పెషల్‌’ సందడి!
పీఎన్‌బీఎస్‌లో ప్రయాణికుల రద్దీ

రెండు రోజులుగా 80కు పైగా బస్సులు 

సోమవారం 90 ప్రత్యేక బస్సులు!

ఒడిశా వరకు బస్సుల్లోనే ప్రయాణాలు

హైదరాబాద్‌కు ఆపరేషన్‌ ప్లాన్‌ ఫలించేనా? 


సంక్రాంతి ప్రయాణాలు ఊపందుకుంటున్నాయి. ‘ఆర్టీసీ’ స్పెషల్స్‌ ఉత్తరాంధ్రకు పరుగులు పెడుతున్నాయి. రెండు రోజులుగా రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళంకు 80కి పైగా స్పెషల్‌ బస్సులు నడుస్తున్నాయి. శనివారం రికార్డు స్థాయిలో 80 స్పెషల్‌ సర్వీసులను, ఆదివారం 85 స్పెషల్స్‌ను ఆర్టీసీ ఈ రూట్‌లో నడిపింది. సోమవారం 90 బస్సులు నడపటానికి అధికారులు ప్లాన్‌ చేశారు. విజయనగరం, ఒడిశా వెళ్లే వారు కూడా ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉత్తరాంధ్రకు బస్సుల రద్దీ పెరిగింది. ఈ ఏడాది రెగ్యులర్‌ రైళ్లు నడవకపోవటంతో రైల్వే ప్రయాణికులు కూడా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. ఇప్పటికే భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఉత్తరాంధ్ర నుంచి అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చిన భక్తులు తిరిగి ప్రయాణమవడంతో బస్సుల రద్దీ పెరిగింది. దీనికి తోడు సంక్రాంతి పండగ సమీపిస్తుండటంతో విజయవాడ చుట్టుపక్కల ఉంటున్న వలస కార్మికులు కూడా తమ సొంత ప్రాంతాలకు తిరిగి ప్రయాణమయ్యారు. వీరి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. పండగ ముందు రోజు వరకూ ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. 


హైదరాబాద్‌కు ఆపరేషన్‌ ప్లాన్‌ ఫలించేనా? 

 హైదరాబాద్‌ నుంచి వచ్చే వారిని తీసుకు రావటం కోసం ఆదివారం ఉదయం విజయవాడ నుంచి 10 స్పెషల్‌ బస్సులను అక్కడికి పంపించారు. హైదరాబాద్‌ వెళ్లిన బస్సులను రాత్రి సమయంలో అక్కడి నుంచి విజయవాడకు నడపాలని ఆర్టీసీ అధికారులు భావించారు. అటు నుంచి ఉండే రద్దీని బట్టి ఈ బస్సులు నడిచే అవకాశం ఉంది. హైదరాబాద్‌ నుంచి పండగ ప్రయాణాలు పెద్దగా లేవు. ఇప్పటికే చాలామంది ఐటీ ఉద్యోగులు వారి సొంతూళ్లకు వచ్చేసి వర్క్‌ ఫ్రం హోమ్‌ చేసుకుంటున్నారు. దీంతో ప్రయాణాలు బాగా తగ్గాయి. పండగ తర్వాత రెగ్యులర్‌గా ఆఫీసులకు రావాలని ఐటీ కంపెనీలు ఆదేశాలు జారీ చేస్తుండటంతో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణాలు భారీగా ఉండవచ్చునని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

Updated Date - 2021-01-11T06:37:35+05:30 IST