Bhupinder Singh: ఆ విలక్షణ స్వరంలో విషాదపు జీర.. భూపిందర్ సింగ్ వణికే గొంతులోనే వాటిని వినాలి..!

ABN , First Publish Date - 2022-07-19T23:08:58+05:30 IST

సుమధుర గాయకుడు భూపిందర్ సింగ్ మరిక లేరు అనే వార్తని నిజమని నమ్మబలుక్కునే ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్రయత్నంగా గుర్తుకొచ్చిన పాట -

Bhupinder Singh: ఆ విలక్షణ స్వరంలో విషాదపు జీర.. భూపిందర్ సింగ్ వణికే గొంతులోనే వాటిని వినాలి..!

"కిసీ నజర్ కో తేరా...

... ఇంతిజార్ ఆజ్ భి హై"


సుమధుర గాయకుడు భూపిందర్ సింగ్ మరిక లేరు అనే వార్తని నిజమని నమ్మబలుక్కునే ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్రయత్నంగా గుర్తుకొచ్చిన పాట - 

కిసీ నజర్ కో తేరా ఇంతిజార్ ఆజ్ భి హై

కహా హో తుమ్ కె యె దిల్ బేకార్ ఆజ్ భీ హై

(నీచూపు కోసం... ఎదురు చూపు ఇప్పటికీ ఉంది

నువ్వెక్కడున్నవో నని ఈ మనసు ఆరాటం ఇప్పటికీ ఉంది)


1985 లో వచ్చిన ఐత్ బార్ (1985) సినిమాలో పాట అది. బూపీందర్, ఆశాభొంస్లేతో కలిసి పాడిన గీతం. దారుణమైన హత్య, దానివెనక అంతుబట్టని రహస్యం వగైరాల ఆ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని సున్నితం చేస్తుంది భూపేందర్ పాడిన ఆ సుకుమారమైన గజల్. 


న పూచ్ కిత్నె మొహబ్బత్ కె జఖమ్ ఖాయి హై 

కి జిన్ కొ సోచ్ కె దిల్ సౌదగర్ ఆజ్ భీ హై    

(ప్రేమ వల్ల ఎంత గాయపడ్డానని అడగొద్దు

ఆమె తలపు వ్యథతో మనసుని నింపేయడం ఇప్పటికీ ఉంది)

- అంటూ తన సుస్వరంతో గుండె గుల్ల చేస్తాడు భూపిందర్. 


ఆయన గొంతే అంత! ఆ విలక్షణ స్వరంలో విషాదపు జీర తాను పాడిన పాటలకి ఒక ప్రత్యేకమైన తాత్వికతని అందిస్తుంది. విషాదమంటే ట్రాజడీ అని కాదు, ఆర్ద్రం!


"దిల్ ఢూంఢతా హై ఫిర్ వహి...పుర్సత్ కే రాత్ దిన్"- మౌసమ్ చిత్రగీతిక గుర్తుందా?


మళ్ళీ ఆ రికామీ రేయీంబవళ్ల కోసం తపిస్తోందీ హృదయం... అంటూ కవి-దర్శకుడు గుల్జార్ కలం నుంచి జాలువారిన పదాలు- భూపిందర్ గొంతుకలో పాటగా సుళ్లు తిరిగిన జ్ఞాపకాల రొదని మర్చిపోగలమా? 


"ఆంఖో మే భిగే భిగే సె లమ్హే లియే హుయే"

హిమశీకరాలు కురుస్తున్న శీతవేళల్లో శిఖరాల అంచు నుంచి లోయల ప్రతిధ్వనుల నిస్సవ్వడి వింటూ కళ్లు విచలితమైన వేళ ... మళ్ళీ ఆ రికామీ రేయీంబవళ్ల కోసం తపిస్తోందీ హృదయం- అంటూ ఆర్ద్రత కుమ్మరిస్తాడాయన.


రూనా లైలా తో కలిసి ఘరౌందా (1977) సినిమాలో గుల్జార్ సాబ్ రాసిన ఒక యుగళగీతం పాడాడు భూపిందర్- "దో దివానే షహర్ మే...". అది కాదు అక్కడ విశేషం, ఓ గూడు కోసం అన్వేషించిన ప్రేమోన్మత్తులు ఇద్దరూ తర్వాత విడిపోతారు. 

అప్పుడు భూపిన్ దా పాడతాడు: 


ఏక్ అకేలా ఇస్ షహర్ మే

రాత్ ఔర్ దోపహర్ మే

- ఓ ఏకాకి పట్టణమంతా రాత్రింబవళ్లూ కూడు, గూడు కోసం వెతుక్కుంటూనే ఉంటాడు. ఆ దిమ్మరి గురించి, ఆ ఒంటరివాడి గురించి కవి గుల్జార్ ఓ పాదం రాస్తాడు:  "దిన్ ఖాలీ ఖాలీ బర్తన్ హై... ఔర్ రాత్ హై జైసే అంధా ఖుయాన్" - అది వినాలి భూపిందర్ వణికే గొంతులో. పగళ్ళు ఖాళీ పాత్రలా, రాత్రిళ్లు చీకటి నుయ్యలా ఉన్న ఓ ఒంటరివాడి దైన్యం... విషాదం- ఆయన స్వరంలో చిక్కనై మనసుని పిండేస్తాయి. 


భూపిందర్ పాడిన తొలిచిత్రం- "హకీకత్" (1964). ఆయన తొలి పాట-  "హోకే మజబూర్ ముఝె ఉస్నే భులాయా హోగా". భారత్-చైనా యుద్ధ నేపథ్యంతో వచ్చిన సినిమా "హకీకత్". చాలా మంది సైనికులు అమరులైతే, చాలా కొద్దిమంది మాత్రం బ్రతికి బట్టకడతారు. కాని బైట ప్రపంచానికి వాళ్ళు కూడా మృతులే. వాళ్లని కూడా చనిపోయిన వీరజవానులుగానే భావిస్తారు. నిజానికి మృత్యువును కూడా ఎదిరించగల ధీరులు, ఆ పరిస్థితికి తల్లడిల్లుతారు. అటువంటి కరుణరసార్ద్రమైన సన్నివేశమది. 


ఆమె నన్ను మర్చిపోయి ఉండొచ్చు, నిన్నటి గాథల్ని ఆమె హృదయం నెమరువేసి ఉండొచ్చు- అనే అర్థమొచ్చే గీతం- "హోకే మజబూర్ ముఝె ఉస్నే భులాయా హోగా" పాటని మన్నాడే, రఫీ, తలత్ మహ్మూద్ వంటి మహాగాయకులతో కలిసి పాడే అవకాశం వచ్చింది భూపిందర్ సింగ్ కి. అది మొదలు దశాబ్దాల తరబడి ఆ ఆర్ద్ర గాత్రం  స్రోతస్వినిలా ప్రవహిస్తూనే ఉంది.

* *

Updated Date - 2022-07-19T23:08:58+05:30 IST