Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 21 Sep 2022 12:04:15 IST

Prapancham Sitaram: తెలుగు సంగీతానికి ఖ్యాతిని తెచ్చి.. పరాయి దేశం అమెరికాలో మరణం.. ప్రపంచం సీతారాం గురించి ఓ నిజం..!

twitter-iconwatsapp-iconfb-icon
Prapancham Sitaram: తెలుగు సంగీతానికి ఖ్యాతిని తెచ్చి.. పరాయి దేశం అమెరికాలో మరణం.. ప్రపంచం సీతారాం గురించి ఓ నిజం..!

(ఈరోజు సెప్టెంబరు 21, ప్రపంచం సీతారాం జయంతి)


ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఫ్లూట్ వాయిద్యకారుడు ప్రపంచం సీతారాం. అంతటి సంగీతకారుడు పనిచేసిన రేడియోలోనే నేనూ పనిచేశాను అనే ఒకే ఒక్క కారణం తప్ప ఆయన్ని గురించి రాయగల ఏ యోగ్యతా నాకు లేదని, ఆ ఒక్కటే ఈ వ్యాసానికి ప్రేరణ అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఆత్మగౌరవం కలిగిన కళాకారులు సర్కారీ నౌకరీ చేయడంలో ఎదుర్కునే మానసిక సంఘర్షణలు గురించి ప్రస్తావించాలని అనుకోవడం కూడా ఈ రచనకు దోహదం చేసింది.


ప్రపంచం సీతారాం స్వయం ప్రతిభ కలిగిన వ్యక్తి. స్వయంశక్తితో పైకి వచ్చారు. చేతిలో ఇమిడిపోయే వేణువును ఒక పరికరంగా తీసుకుని జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు. సరయిన వయస్సులో తగిన విద్యార్హతలు సంపాదించుకోలేకపోయినా తదనంతర కాలంలో పట్టుదలతో శ్రమించి అనేక విశ్వవిద్యాలయాల డిగ్రీలు తన ఖాతాలో వేసుకున్నారు. జీవిక కోసం ఒకప్పుడు ఢిల్లీలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఫ్లూట్ కచ్చేరీలు చేసేవారు. ఆ పిదప యూనియన్ పబ్లిక్ సర్వీసు కమీషన్ ద్వారా ఎంపికై రేడియోలో ప్రోగ్రాం ఎక్జిక్యూటివ్ గా చేరి, ఢిల్లీ రేడియో స్టేషన్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు.


ఒకప్పుడు రేడియో అంటే అనేక సంగీత దిగ్గజాల పేర్లు వినిపించేవి. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, ఓలేటి వెంకటేశ్వర్లు, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి (గాత్రం), బాలాంత్రపు రజనీకాంతారావు (వాగ్గేయకారుడు), అన్నవరపు రామస్వామి, మారెళ్ళ కేశవరావు, నేతి శ్రీరామ శర్మ (వయొలిన్) దండమూడి రామ్మోహన రావు, ఎల్లా వెంకటేశ్వరరావు (మృదంగం) ప్రపంచం సీతారాం, ఎన్ ఎస్ శ్రీనివాసన్ (వేణువు), మంచాల జగన్నాధరావు( వీణ), చెన్నై రేడియోలో శర్మ బ్రదర్స్ చిట్టూరి వేణుగోపాల శర్మ (వయొలిన్), చిట్టూరి కామేశ్వర శర్మ (వీణ).


మామూలుగా అయితే ఇవి కొన్ని పేర్లు మాత్రమే. కానీ ఆ పేర్లకువున్న పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇన్నీ కావు. ఒకప్పుడు ఇలాటి మహనీయులు నడయాడిన నట్టిళ్లు ఆకాశవాణి కేంద్రాలు. వారు బయట ప్రదేశాలకు వెళ్ళి సంగీత కచ్చేరీలు ఇచ్చినప్పుడు పలానా వారు, బెజవాడ రేడియో కేంద్రం, హైదరాబాదు కేంద్రంలో నిలయ విద్వాంసులు అని కరపత్రాలు ముద్రిస్తే, అది వారు పనిచేసే కార్యాలయానికి ఒక అదనపు గుర్తింపు తెచ్చిపెట్టేదిగా భావించేవారు. గతంలో రేడియో కేంద్రాలకు అధిపతులుగా పనిచేసిన అధికారులు కూడా వారికి తగిన గౌరవ మర్యాదలు ఇచ్చేవారు. చక్కటి సంగీత కళాకారులు తమ వద్ద పనిచేయడం అనేది గొప్ప విషయంగా పరిగణించేవారు. ఆ కారణంగానే పాత కాలంలో సంగీతానికి రేడియో, రేడియోకు సంగీతం పరస్పర సహకారం ఇచ్చుకున్నందువల్లే కచ్చేరీల ద్వారా కొందరికే అందుబాటులో వున్న సంగీతం రేడియో ద్వారా ఎల్లెడలా వున్న జనాలకు చేరువకాగలిగింది.

Prapancham Sitaram: తెలుగు సంగీతానికి ఖ్యాతిని తెచ్చి.. పరాయి దేశం అమెరికాలో మరణం.. ప్రపంచం సీతారాం గురించి ఓ నిజం..!

కానీ కాలం గడుస్తున్న కొద్దీ అన్ని వ్యవస్థల్లో మార్పులు వచ్చినట్టే రేడియోలో కూడా పరిస్థితులు మారుతూవచ్చాయి. తమ సంగీతపాటవాన్ని పదిమందికీ తెలియచేయాలన్న తపనతో ఓ పక్క రేడియోలో పనిచేస్తూనే కొందరు కళాకారులు మరోపక్క తగిన అనుమతులు తీసుకోకుండా బయట సంగీత కచ్చేరీలలో పాల్గొంటూ వుండేవారు. ముందే చెప్పినట్టు వెనుకటి రోజుల్లో ఈ తరహా వ్యవహారాలను అధికారులు ఓ దృష్టితో చూసి, చూసీ చూడనట్టు వొదిలేస్తే తదనంతరం వచ్చిన అధికారుల్లో కొందరు దీన్ని నిబంధనలకు వ్యతిరేకం అన్న కోణంలో చూడసాగారు. అదిగో అక్కడే రేడియో ఆర్టిస్టులకు, అధికారులకు మధ్య సంఘర్షణలకు దారితీసింది. అయితే సహజంగా ఈ విషయంలో అధికారులదే పైచేయి కావడంతో ఆర్టిస్టులు మానసికంగా కుంగిపోయేవారు. రేడియోలో తమది ఉపాధి అనుకున్నారు కాని ఉద్యోగం కాదనుకుని వచ్చి , పరిస్తితులతో రాజీపడలేని కొందరు రేడియోనే వొదిలేసారు. అలాటివారిలో ప్రపంచం సీతారాం ఒకరు. దక్షిణ భారతంలో పేరెన్నికగన్న టీ ఆర్ మహాలింగం శిష్యులు. ప్రపంచం అన్నది సీతారాం ఇంటిపేరు కాదనీ, ఎప్పుడో దశాబ్దాలక్రితం తెలుగులో తీసిన 'ప్రపంచం' అనే చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరించిన కారణంగా ఆయనకు ప్రపంచం అన్నది ఇంటి పేరుగా మారిపోయిందని చెబుతారు.


నిబంధనల పేరుతొ నిరంకుశంగా వ్యవహరించే అధికారుల చేతుల్లో కళాకారులు యెలా కుంగిపోతారన్నదానికి ఒక అనుభవాన్ని బెజవాడ రేడియోలో న్యూస్ ఎడిటర్ గా పనిచేసిన నా సీనియర్ సహచరులు ఆర్వీవీ కృష్ణారావు నాతొ పంచుకున్నారు.


మంగళగిరి, నంబూరు నడుమ ఒక జైన దేవాలయం వుంది. ఆ ఆలయం అధికారుల ఆహ్వానం మేరకు ఒకరోజు బెజవాడ రేడియో స్టేషన్ డైరెక్టర్ శ్రీ అయూబీ, కృష్ణారావు గారిని వెంటబెట్టుకుని అక్కడకు వెళ్లారు. అదే సమయంలో అక్కడ వారికి ప్రపంచం సీతారాం తన బృందంతో తారసపడ్డారు. అప్పటికే ఆయన రేడియో కళాకారుడే కాకుండా తదనంతరం సంపాదించుకున్న డిగ్రీల సాయంతో రేడియోలో ప్రోగ్రాం ఎక్జిక్యూటివ్ గా ఎంపికై.. ప్రమోషన్ మీద బెజవాడ రేడియో స్టేషన్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఉద్యోగం ఏదైనప్పటికీ, స్వతహాగా ఆయన సంగీతకారుడు. కచ్చేరీలు చేయాల్సిందిగా ఆహ్వానాలు అందుతూ వుండేవి. అయితే రేడియో ఉద్యోగులు ఇలా కచ్చేరీలు చేయడం అప్పటి స్టేషన్ డైరెక్టర్ కు సుతరామూ ఇష్టం వుండేది కాదు. పైగా అలాటి వారికి మెమోలు ఇవ్వడం, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఆయనకు అలవాటు. ఆయన హయాములో రేడియో కళాకారులు బిక్కచచ్చినట్టు వుండేవారు.


జైన దేవాలయంలో పై అధికారి కనబడగానే కచ్చేరీ నిమిత్తం అక్కడికి వచ్చిన ప్రపంచం సీతారాం కూడా కంగారు పడిపోయారు. మరునాడు స్టాఫ్ మీటింగులో కూడా స్టేషన్ డైరెక్టర్ అదే విషయాన్ని ప్రస్తావించి హెచ్చరిక చేయడంతో, ఆయన కృష్ణారావు గారితో చెప్పుకుని తెగ మధన పడిపోయారు. ఇలాటి అనేకానేక అనుభవాల తరువాత రేడియోలో స్టేషన్ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన తరువాత కూడా సీతారాం, తన మనస్సుని సమాధానపరచుకోలేక, తన మనస్సుకు నచ్చని రేడియో ఉద్యోగాన్ని వొదిలి పెట్టి పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో చేరి, అక్కడే విభాగాధిపతిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. తన సంగీత జ్ఞానంతో తెలుగు సంగీత ప్రాభవాన్ని ఏనాడో ఎల్లలు దాటించిన ప్రపంచం సీతారాం, 2014లో దేశం ఎల్లలు దాటివెళ్ళి అక్కడెక్కడో పరాయిదేశం అమెరికాలో   మరణించడం విధి విచిత్రం.

Prapancham Sitaram: తెలుగు సంగీతానికి ఖ్యాతిని తెచ్చి.. పరాయి దేశం అమెరికాలో మరణం.. ప్రపంచం సీతారాం గురించి ఓ నిజం..!

– భండారు శ్రీనివాసరావు

(సీనియర్ పాత్రికేయులు, రచయిత)

9849130595

ఇవి కూడా చదవండిLatest News in Telugu

ఎవరీ రతన్ ప్రసాద్..? పోలీస్ కమిషనర్ స్వయంగా రేడియో స్టేషన్‌కు వచ్చి మరీ ఆమెను అభినందించడం వెనుక..Jean-Luc Godard: చివరి క్షణాలను సైతం కెమెరాలో రికార్డు చేస్తూ కన్నుమూయాలనుకున్న గొడార్డ్‌.. ప్రపంచ సినీ చరిత్రను మార్చేసి..Jean-Luc Godard: శ్రీశ్రీని కూడా ప్రభావితం చేసిన ఈ గొడార్డ్ ఎవరు..? తన చావును తానే రాసుకున్న ఈ మహా దర్శకుడి కథేంటంటే..!Krishnam Raju: జయలలిత కొన్నారంటూ కృష్ణంరాజుకు కూడా అమ్మేవాళ్లట.. నటనలో మెళకువల కోసం ఆయన్ను కలిసి..UK New PM Liz Truss: అతడితో వివాహేతర సంబంధంతో కాపురం కూలిపోయే స్థితి.. ఆనాడు లిజ్‌తో భర్త హ్యూ అలా అనకపోయి ఉంటే..Bapu Death anniversary: దటీజ్ బాపూ.. శంకరాభరణం సినిమాకు వెళ్తే థియేటర్లో షాకింగ్ అనుభవం.. నలుగురిలోనూ చెప్పి మరీ..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.