స్పందన నిల్‌

ABN , First Publish Date - 2022-08-09T07:19:16+05:30 IST

సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యర క్రమం మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో మొక్కుబడి తంతుగా మారిపోయింది.

స్పందన నిల్‌

జీవీఎంసీలో మొక్కుబడిగా కార్యక్రమం

ప్రతి సోమవారం అర్జీలు స్వీకరిస్తున్న అధికారులు

అరకొరగానే పరిష్కారాలు

ఎటువంటి సమాచారం కూడా ఇవ్వడం లేదంటున్న ఫిర్యాదుదారులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యర క్రమం మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో మొక్కుబడి తంతుగా మారిపోయింది. గత ఏడాదికాలంలో జీవీఎంసీలో స్పందనకు దాదాపు 5,090 ఫిర్యాదులు రాగా వాటిలో కేవలం 68 మాత్రమే పరిష్కారానికి నోచుకోగా, మిగిలినవి పెండింగ్‌లో వున్నాయంటే అధికారుల స్పందన ఏ విధంగా ఇట్టే అర్థమవుతోంది.

జీవీఎంసీ నుంచి అందాల్సిన సేవలు, ఇతర సమస్యలు   పరిష్కారం కోసం ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మేయర్‌ లేదా కమిషనర్‌ స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, అర్జీలు స్వీకరిస్తుంటారు. అన్ని విభాగాల అధిపతులు కూడా స్పందనకు హాజరవుతుంటారు. మేయర్‌ లేదా కమిషనర్‌ స్పందనలో తమకు అందిన విజ్ఞప్తులు, ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించాలంటూ అక్కడే వున్న సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేస్తారు. వారం రోజుల్లోగా ఆయా సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుడితోపాటు తమకు కూడా తెలియజేయాలని ఆదేశిస్తుంటారు. కానీ స్పందనలో అందిన ఫిర్యాదుల పరిష్కారం ఏ స్థాయిలో వుందో కమిషనర్‌గానీ, మేయర్‌గా సమీక్షించిన దాఖలాలు లేవు. జీవీఎంసీకి గత ఏడాదికాలంలో సుమారు 5,090 ఫిర్యాదులు అందినట్టు అధికారులు అంచనాగా చెబుతున్నారు. వాటిలో ప్రజారోగ్య విభాగంతోపాటు టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి సంబంధించినవే సింహభాగం ఉన్నాయంటున్నారు. ప్రజారోగ్య విభాగానికి సంబంధించి 1,750 ఫిర్యాదులు అందగా వాటిలో 20 పరిష్కారమయ్యాయి. వీధి దీపాలపై 1,170 ఫిర్యాదులు అందగా వాటిలో 15 మాత్రమే పరిష్కారమయ్యాయి. యూసీడీ విభాగానికి సంబంధించి 55 ఫిర్యాదులు అందగా రెండు మాత్రమే పరిష్కారమయ్యాయి. టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి సంబంధించి 945 అందగా వాటిలో 12 మాత్రమే పరిష్కారమయ్యాయి. ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించి 450 అందగా ఇంతవరకూ కేవలం ఐదు మాత్రమే పరిష్కారమయ్యాయి. వాటర్‌ సప్లైకి సంబంధించి 390 అందగా ఐదు మాత్రమే పరిష్కారమయ్యాయి. రెవెన్యూ విభాగానికి సంబంధించి 230 అందగా ఆరు, పరిపాలనా విభాగానికి సంబంధించి వంద ఫిర్యాదులు అందగా మూడు మాత్రమే పరిష్కారమైనట్టు అధికారులు పేర్కొంటున్నారు. మిగిలినవి వివిధ దశల్లో వున్నట్టు చెబుతున్నారు. స్పందనలో ఇచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో బాధితులు మళ్లీ మళ్లీ అదే సమస్యపై అర్జీలు అందజేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. స్పందనలో ఫిర్యాదు స్వీకరించినట్టుగానీ, సంబంధిత అధికారులకు పరిష్కారం కోసం అసైన్‌చేసినట్టుగానీ ఎటువంటి సమాచారం అందడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతో స్పందనలో ఫిర్యాదులు ఇవ్వడం తమ సంతృప్తి కోసమే తప్ప, సమస్యల పరిష్కారం కోసం కాదనే భావన నెలకొంటోందని నిట్టూరుస్తున్నారు. 


నెల రోజులుగా ఫిర్యాదు చేస్తున్నా కనీసం మెసేజ్‌ రాలేదు

దండి ప్రియాంక, జేడీ ఫౌండేషన్‌ కన్వీనర్‌

హనుమంతవాక పరిసరాల్లోని కొండవాలు ప్రాంతాల్లో సమస్యలపై అధ్యయనం చేసి, వాటి పరిష్కారం కోరుతూ గత నెలరోజులుగా స్పందనలో జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాం. దీనిపై ఇంతవరకూ చర్యలు లేకపోగా ఫిర్యాదుచేసినట్టు తమకు ఇంతవరకూ ఒక మెసేజ్‌ కూడా రాకపోవడం విచారకరం.


స్పందన లేకుంటే కార్యక్రమం ఎందుకు 

జగన్‌ మురారి, ఇసుకతోట

నేను ఇంటి పన్ను సవరణ కోరుతూ గత నెల రోజులుగా ప్రతి వారం ‘స్పందన’కు వచ్చి విజ్ఞప్తి అందజేస్తూనే ఉన్నాను. ఇంతవరకూ సమస్య పరిష్కారం కాలేదు. కనీసం ఫిర్యాదు వచ్చిందని, దీనికి సంబంధించిన ఇతర వివరాలు కావాలనిగానీ అడిగిన పాపానపోలేదు. స్పందనలో వచ్చిన ఫిర్యాదులపైనే అధికారులు స్పందించకపోతే ఈ కార్యక్రమం నిర్వహించడం ఎందుకో అధికారులే చెప్పాలి. 


అర్హతలు ఉన్నా కొర్రీలు

సచివాలయాల్లో పట్టించుకోవడం లేదు

కలెక్టరేట్‌ ‘స్పందన’లో బాధితుల మొర

విశాఖపట్నం/మహారాణిపేట, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): పేదల ఇంటి ముంగిటకు అన్నీ అందిస్తున్నామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం, అదే పేదలను పలు రకాల నిబంధనలతో ఇబ్బందులకు గురిచేస్తోంది. ఎప్పటి నుంచో వున్న బియ్యం కార్డులను రద్దు చేస్తోంది. సంవత్సరాల తరబడిగా వస్తున్న పింఛన్‌ను అర్ధాంతరంగా నిలిపివేస్తోంది. దీంతో దిక్కుతోచని పేదలు వార్డు సచివాలయం చుట్టూ తిరిగి తిరిగి విసిగి చివరకు కలెక్టరేట్‌ గుమ్మం ఎక్కుతున్నారు. తమ ఆధార్‌ కార్డుకు సంబంధం లేని వ్యక్తుల పేర్లు అనుసంధానం కావడంతో బియ్యం కార్డులు రద్దు అవుతున్నాయని, పింఛన్‌లు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదే విషయంపై వార్డు సచివాలయాలకు వెళితే సరైన సమాధానం చెప్పకపోవడం లేదా...కారు ఉందని, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వుందని ఆన్‌లైన్‌లో చూపిస్తోందని అక్కడ సిబ్బంది చెబుతున్నారు తప్ప సమస్యను పరిష్కరించడం లేదంటున్నారు. 


ఏడాది నుంచి బియ్యం కార్డు కోసం తిరుగుతున్నా

మన్యాల విజయలక్ష్మి, అంగడిదిబ్బ

చాలాకాలం క్రితమే భర్త దూరమయ్యారు. అమ్మనాన్న దగ్గర ఉంటున్నా. నాన్న రిటైర్డు ఉద్యోగి కావడంతో వాళ్లకు పింఛన్‌ వచ్చేది. అయితే ఏడాది క్రితం ఆయన చనిపోయారు. అప్పటి నుంచి బియ్యం కార్డు కోసం సచివాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. 


100 శాతం అంధత్వం ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు

మళ్ల సాయి, సెకండ్‌ ఇయర్‌ డిగ్రీ విద్యార్థి, కంచరపాలెం

మాది గవర కంచరపాలెం. నాన్న అప్పలరాజు కూలి పనులు చేస్తుంటారు. ఏవీఎన్‌ కళాశాలలో సెకండ్‌ ఇయర్‌ డిగ్రీ చదువుతున్నా. నేను పుట్టుకతో అంధుడిని. ప్రతి నెలా మూడు వేలు పింఛన్‌ ఇచ్చేవారు. గత నెల నుంచి ఆపేశారు. మాకు కారు వుందని చెబుతున్నారు. కూలి పనులు చేసే తండ్రికి కారు ఎక్కడ నుంచి వస్తుంది. చివరకు విద్యాదీవెన ఉపకార వేతనం నిలిపివేశారు. 


కార్డు కట్‌ చేశారు

సిహెచ్‌ హైమావతి, గాజువాక

నా భర్త గతంలో వెయ్యి రూపాయలు ఇన్‌కమ్‌ట్యాక్స్‌ కట్టారంట. రెండేళ్ల క్రితం కరోనాతో ఆయన మృతిచెందారు. ట్యాక్స్‌ కట్టారని రేషన్‌ కార్డు కట్‌ చేశారు. నాకు ఆదాయం లేదు, ఇద్దరు పిల్లల చదువుకుంటున్నారు. రేషన్‌ కార్డు ఇప్పించాలని తిరుగుతున్నా. చాలా ఇబ్బందులు పడుతున్నాం. 


గత ఏడాది కాలంలో స్పందన ఫిర్యాదుల వివరాలు (సుమారుగా)

విభాగం ఫిర్యాదులు పరిష్కారం

పారిశుధ్యం 1,750 20

వీధి దీపాలు 1,170 15

యూసీడీ 55 2

టౌన్‌ప్లానింగ్‌ 945 12

ఇంజనీరింగ్‌ 450 5

వాటర్‌ సప్లై 390 5

రెవెన్యూ 230 6

పరిపాలన విభాగం 100 3

మొత్తం 5,090 68

Updated Date - 2022-08-09T07:19:16+05:30 IST