స్పందన అర్జీలకు సత్వర పరిష్కారం

ABN , First Publish Date - 2022-07-02T06:30:43+05:30 IST

గిరిజనులు స్పందన కార్యక్రమంలో సమర్పించే అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు.

స్పందన అర్జీలకు సత్వర పరిష్కారం
స్పందనలో అర్జీదారుల సమస్యలు ఆలకిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

తిరస్కరిస్తే.. కారణం పేర్కొనాలి

అధికారులకు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌  ఆదేశం

స్పందనలో 130 వినతులు అందజేసిన గిరిజనులు

పాడేరు, జూలై 1 (ఆంధ్రజ్యోతి): గిరిజనులు స్పందన కార్యక్రమంలో సమర్పించే అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు. ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ, సబ్‌కలెక్టర్‌ వి.అభిషేక్‌లతో కలిసి ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమస్యలపై గిరిజనులు ఇస్తున్న వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని సకాలంలో పరిష్కరించాలన్నారు. ఒకవేళ అర్జీని తిరస్కరిస్తే.. అందుకు గల కారణాన్ని స్పష్టంగా పేర్కొనాలని కలెక్టర్‌ సూచించారు. అన్ని శాఖల అధికారులు స్పందన కార్యక్రమానికి కచ్చితంగా హాజరుకావాలన్నారు. 

స్పందనలో 130 అర్జీలు 

ఐటీడీఏలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులు 130 అర్జీలను అందజేశారు. తాగునీరు, భూములు, రహదారుల సమస్యలపై ఫిర్యాదులు, వినతిపత్రాలు ఇచ్చారు. ఇంకా ఉద్యోగ అవకాశాలు, అటవీ హక్కు పత్రాలు, ఇళ్ల స్థలాలు, తదితర వ్యక్తిగత సమస్యలపై అర్జీలు అందజేశారు. తమకు అటవీ హక్కు పత్రాలు మంజూరు చేయాలని అనంతగిరి మండలం కొత్తూరు పంచాయతీలోని దంసరాయి గ్రామస్థులు దలేసి సిద్దు, బడ్నాయిని బచ్చమ్మ, మరో పది మంది రైతులు విజ్ఞప్తి చేశారు. ఏకలవ్య పాఠశాలల్లో పూర్తిస్థాయిలో సీబీఎస్‌ఈ ఆంగ్ల మాధ్యమం ఉపాధ్యాయులను నియమించాలని పాడేరు, హుకుంపేట, పెదబయలు, అనంతగిరి, జి.మాడుగుల మండలాలకు చెందిన విద్యార్థుల తలిదండ్రులు సీహెచ్‌.మత్స్యరాజు, పి.సుబ్రహ్మణ్యం, తదితరులు కోరారు. తమకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని పెదబయలు మండల పాత్రికేయులు సీహెచ్‌.చిట్టిబాబు, సీహెచ్‌.మత్స్యరాజు, కె.శ్రీను, ఎల్‌.విశ్వనాథం, ఎం.అశోక్‌కుమార్‌, కె.కొండబాబు, తదితరులు వినతిపత్రం సమర్పించారు.  కొయ్యూరు మండలం దొడవగొయ్యి గ్రామానికి చెందిన పి.సుబ్బారావు, ఎస్‌.రమేశ్‌.. తమ గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలని కోరగా, జీకేవీధి మండలం రింతాడ పంచాయతీ గొడిచింత వాసి కొయ్యం బాలరాజు తనకు కాఫీ లైజన్‌ వర్కర్‌గా ఉద్యోగం ఇప్పించాలని కోరారు. చింతపల్లి మండలం ఎర్రబొమ్మలు ఎంపీటీసీ సభ్యుడు ఎస్‌.సత్తిబాబు.. పెద్దగెడ్డ గ్రామం నుంచి కొండవంచుల గ్రామానికి రోడ్డు వేయాలని  వినతిపత్రం సమర్పించారు. స్పందన ఈ కార్యక్రమంలో డీఆర్‌వో బి.దయానిధి, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈలు డీవీఆర్‌ఎం.రాజు, కె.వేణుగోపాల్‌, పంచాయతీరాజ్‌ ఈఈ కె.లావణ్యకుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి పీఎస్‌.కుమార్‌, డీఎంహెచ్‌వో బి.సుజాత, కాఫీ విభాగం ఏడీ  బి.భాస్కరరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-02T06:30:43+05:30 IST