ఇంజనీరింగ్‌ విద్యార్థి హత్య కేసులో నిందితులను త్వరలో పట్టుకుంటాం : ఎస్పీ

ABN , First Publish Date - 2021-11-28T03:54:48+05:30 IST

కావలిలో ఇంజనీరింగ్‌ విద్యార్థి కంచర్ల రాజేంద్ర హత్య కేసులో నిందితులను త్వరలో పట్టుకుంటామని ఎస్పీ విజయరావు తెలిపారు.

ఇంజనీరింగ్‌ విద్యార్థి హత్య కేసులో   నిందితులను త్వరలో పట్టుకుంటాం : ఎస్పీ
సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ విజయరావు, తదితరులు

కావలి, నవంబరు 27: కావలిలో ఇంజనీరింగ్‌ విద్యార్థి కంచర్ల రాజేంద్ర హత్య కేసులో నిందితులను త్వరలో పట్టుకుంటామని ఎస్పీ విజయరావు తెలిపారు. స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీస్‌ అఽధికారులు, వెంకటగిరి, బుచ్చిరెడ్డిపాలెం సీఐలతో కలసి శనివారం కావలికి వచ్చిన ఎస్పీ స్థానిక డీఎస్పీ ప్రసాద్‌, సీఐ ఖాజావళి, ఎస్‌ఐలతో కలసి విద్యార్థి మృతదేహం లభించిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం రూరల్‌ పోలీసు స్టేషన్‌లో హత్యకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. ఘటనా స్థలంలో దొరికిన సాక్షాధారాలు, పోస్టుమార్టం అనంతరం ప్రాథమికంగా లభించిన ఆధారాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ విద్యార్థి హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసేందుకే కావలికి వచ్చానన్నారు. హత్య జరిగిన ప్రాంతంలో కొంత క్లూ లభించగా, పోస్టుమార్టం అనంతరం మరికొన్ని ఆధారాలు లభించాయన్నారు. విద్యార్థి బయలుదేరిన దగ్గర నుంచి హత్య జరిగిన ప్రాంతం, పోస్ట్‌మార్టం వరకు అన్నీ క్షుణ్ణంగా విచారించామన్నారు. హత్యకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. సాంకేతికతను ఉపయోగించి సమగ్ర దర్యాప్తు జరిపేందుకు ఆదేశాలు జారీ చేశామన్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

ఎస్పీ దృష్టికి బాలికపై అత్యాచారం కేసు

రామానుజపురంలో బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో జరుగుతున్న పరిణామాలు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరును అత్యాచార వ్యతిరేక న్యాయ పోరాట కమిటీ నాయకులు ఎస్పీ విజయరావు దృష్టికి తీసుకెళ్లారు. శనివారం కావలికి వచ్చిన ఎస్సీని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కలిసి బాలిక అత్యాచారంపై ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని తెలిపారు. కొందరు పోలీసులు కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఎస్పీ ఆ బాలిక విషయంలో సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని, తప్పకుండా న్యాయం జరుగుతోందని చెప్పారు. పోలీసులు ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు వివరాలను మీరు నెల్లూరుకు వస్తే డిస్‌ప్లే ద్వారా వివరిస్తామని, ఆ తర్వాత మీరేదైనా చెప్పితే పరిగణలోనికి తీసుకుని విచారిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అత్యాచార వ్యతిరేక న్యాయ పోరాట కమిటీ నాయకులు పీ.అంబేద్కర్‌, సీ.శారద, అబ్దుల్‌ అలీమ్‌, డేగా సత్యనారాయణ, పసుపులేటి పెంచలయ్య, కరువాది భాస్కర్‌, గోచిపాతల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T03:54:48+05:30 IST