త్వరలో 6 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్‌.. పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌లు!

ABN , First Publish Date - 2021-10-30T15:53:53+05:30 IST

త్వరలో 6 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్‌.. పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌లు!..

త్వరలో 6 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్‌.. పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌లు!

హైదరాబాద్‌ : దేశాన్ని ‘డిజిటల్‌ భారత్‌’గా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నదని, త్వరలోనే దేశంలోని ఆరు లక్షల గ్రామాలకు ఇంటర్నెట్‌ సదుపాయం అందనుందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. ఇంటర్నేషనల్‌ ఇంటర్నెట్‌ డే సందర్భంగా హైటెక్స్‌ లో శుక్రవారం మిలీనియం ఇన్ఫోటెక్‌ సంస్థ నిర్వహించిన ‘గ్లోబల్‌ ఇగ్నైట్‌-2021’ కార్యక్రమాన్ని ఉద్దేశించి గవర్నర్‌ మాట్లాడారు. ఇంటర్నెట్‌ వినియోగంలో భారత్‌ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని అన్నారు.


ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2.4 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కల్పించిందని, త్వరలో దీనిని ఆరు లక్షల గ్రామాలకు విస్తరించే ప్రయత్నం చేస్తోందని వివరించారు. ప్రపంచమంతా ఇంటర్నెట్‌పై ఆధారపడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మంచి పనులకు మాత్రమే ఇంటర్నెట్‌ను వినియోగించుకోవాలని గవర్నర్‌ సూచించారు. ల్యాప్‌టా‌ప్‌లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లు లేక చాలామంది పేద విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.


వీరికి డిజిటల్‌ గాడ్జెట్స్‌ను అందించడానికి రాజ్‌భవన్‌ వినూత్న కార్యక్రమం చేపట్టిందని, కార్పొరేట్‌ సంస్థలు, ఐటీ కంపెనీలు వినియోగించి మూలన పెట్టిన ల్యాప్‌టా‌ప్‌లు, ట్యాబ్‌లను రాజ్‌భవన్‌ లో అందించాలని కోరారు. వీటిని పేద విద్యార్థులకు అందిస్తామన్నారు. మిలీనియం ఇన్ఫోటెక్‌ సీఈఓ రమణ క్రోసూరి, జస్టిస్‌ గూడ చంద్రయ్య, బ్రాడ్‌రిడ్జ్‌ ఎండీ లక్ష్మీకాంత్‌, వెట్‌హబ్‌ సీఈఓ దీప్తి రావుల, ఇంటర్నేషనల్‌ ఎగ్‌ కమిషన్‌ చైర్మన్‌ సురేష్‌ చిట్టూరి, టాస్క్‌ సీఈఓ శ్రీకాంత్‌ సిన్హా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T15:53:53+05:30 IST