సొంతిల్లు కలేనా..?

ABN , First Publish Date - 2021-09-18T06:00:58+05:30 IST

జపాన్‌ షేర్‌వాల్‌ టెక్నాలజీ, జీ+3, అత్యంత ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు టిడ్కో ఆధ్వర్యంలో గృహాలను నిర్మించారు.

సొంతిల్లు కలేనా..?

  1. టిడ్కో ఇళ్ల పనులకు నిధుల కొరత
  2. రూ.300 కోట్ల బ్యాంకు రుణాలపై సందిగ్ధత
  3. మౌలిక వసతులకు రూ.150 కోట్లు అవసరం
  4. డిసెంబరుకు ఇళ్లు ఇస్తామంటున్న ప్రభుత్వం
  5. పైసా లేకుండా.. ఎలా సాధ్యమని అనుమానం


నంద్యాల, సెప్టెంబరు 17: జపాన్‌ షేర్‌వాల్‌ టెక్నాలజీ, జీ+3, అత్యంత ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు టిడ్కో ఆధ్వర్యంలో గృహాలను నిర్మించారు. సాధారణ ఎన్నికలు జరిగే నాటికి జిల్లాలో టిడ్కో గృహాల నిర్మాణం 90 శాతం పూర్తి అయింది. మిగిలిన పది శాతంలో మంచి నీరు, విద్యుత్‌ సౌకర్యం తదితర మౌలిక సదుపాయాల పనులు మాత్రమే మిగిలాయి. ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టిడ్కో గృహాలను లబ్ధిదారులకు ఇవ్వకుండా మోకాలడ్డింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో గృహాల కేటాయింపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. పెండింగ్‌ పనుల పూర్తికి ప్రభుత్వం సరైన కార్యాచరణ అమలు చేయడం లేదు. పెండింగ్‌ పనుల పూర్తికి లబ్ధిదారుల బ్యాంకు లింకేజీ వ్యవహారం ముడిపడి ఉంది. 


మూడు కేటగిరీలు


టీడీపీ ప్రభుత్వ హయాంలో మూడు కేటగిరీలుగా టిడ్కో గృహాల నిర్మాణం చేపట్టారు. కేటగిరి-1 సింగిల్‌ బెడ్‌ రూమ్‌ కింద 300 చ.అ. విస్తీర్ణానికి ఖర్చు రూ.5.65 లక్షలు. ఇందులో కేంద్రం నిధులు రూ.1.50 లక్షలు, రాష్ట్ర నిధులు రూ.1.50 లక్షలు, లబ్ధిదారుని వాటా రూ.500 పోను మిగిలిన రూ.2,64,500 బ్యాంకు రుణం మంజూరు చేయాల్సి ఉంది. కేటగిరి -2 సింగిల్‌ బెడ్‌రూమ్‌ 365 చ.అ.విస్తీర్ణానికి ఖర్చు రూ.6.65 లక్షలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీ రూ.3 లక్షలు, నాలుగు విడతల్లో రూ.50 వేలు లబ్ధిదారుడి వాటా, మిగిలిన రూ.3,15 లక్షలు బ్యాంకు రుణం. కేటగిరి -3 డబుల్‌ బెడ్‌రూమ్‌ 430 చ.అ. విస్తీర్ణానికి ఖర్చు రూ.7.65 లక్షలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీ రూ.3 లక్షలు, నాలుగు విడతల్లో రూ.లక్ష లబ్ధిదారుడి వాటా, మిగిలిన రూ.3.65లక్షలు బ్యాంకు రుణం.


రూ.300 కోట్ల రుణం ఇస్తారా..?


బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించే విషయంలో అధికార యంత్రాంగం చేతులెత్తేసినట్లు సమాచారం. 300 చదరపు అడుగుల సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రభుత్వం ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. కాగా సింగిల్‌ బెడ్‌ రూమ్‌ 365 చ.అడుగుల విస్తీర్ణం టిడ్కో ఇంటికి రూ.3.15 లక్షలు, 430 చ.అ. విస్తీర్ణం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటికి రూ.3.65లక్షల చొప్పున లబ్ధిదారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వాల్సి ఉంది. కర్నూలు నగరంలో 300 చ.అ. విస్తీర్ణం సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు 3,888, నంద్యాలలో 8,704, ఆదోనిలో 4,208, ఎమ్మిగనూరులో 3,792 ఇళ్లు మొత్తం 20,592 ఇళ్లను ఉచితంగా ఇవ్వనున్నారు. వీటికి ఆళ్లగడ్డలో రీ టెండర్‌ చేసి నిర్మిస్తున్న దాదాపు వెయ్యి ఇళ్లు, డోన్‌లో నిర్మిస్తున్న 288 ఇళ్లు అదనం. 365 చ.అ. విస్తీర్ణం సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కర్నూలులో 1904, నంద్యాలలో 288, ఆదోనిలో 160, ఎమ్మిగనూరులో 192 మొత్తం 2544 ఇళ్లను, 430 చ.అ. డబుల్‌ బెడ్‌రూమ్‌లలో కర్నూలులో 4208, నంద్యాలలో 1,008, ఆదోనిలో 352, ఎమ్మిగనూరులో 432.. మొత్తం 6,000 ఇళ్లకు బ్యాంకు లింకేజీ కావాల్సి ఉంది. 365 చ.అ. ఇళ్లకు 2,544 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.3.15 లక్షలు చొప్పున రూ.80.14 కోట్లు, 430 చ.అ. ఇళ్లకు 6 వేల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.3.65 లక్షల చొప్పున రూ.219 కోట్లు మొత్తం రూ.299.14 కోట్లు బ్యాంకుల నుంచి రుణం మంజూరు కావాల్సి ఉంది. 


పైసా లేకుండా..


డిసెంబరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో గృహాల పెండింగ్‌ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లు అప్పగిస్తామని సీఎం జగన్‌, మంత్రులు, రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే పైసా లేకుండా పనులెలా పూర్తి చేస్తారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జిల్లాలోని టిడ్కో గృహాలకు వివిధ బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. అయితే సక్రమంగా ఈఎంఐలు కట్టకపోవడంతో రుణ అకౌంట్లన్నీ ఎన్‌పీఏకు గురయ్యాయి. దీంతో ఏపీ టిడ్కో సంస్థ ఎన్‌పీఏకు గురి కాకుండా రూ.34 కోట్లు బ్యాంకులకు చెల్లించినప్పటికీ ప్రస్తుతం కొత్త రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు రావడంలేదని తెలుస్తోంది. దీంతో రూ.299.14 కోట్ల రుణానికి గాను జిల్లాలో ఇప్పటివరకు కేవలం రూ.13.15 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. 90 శాతం స్ట్రక్చర్‌ పనులు పూర్తయినా, పెండింగ్‌ పనులు పూర్తిచేయడం పట్ల అధికారులు దృష్టి సారించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. బ్యాంకు లింకేజీపై అధికారులు దృష్టి సారించడంలేదని, కేవలం జగనన్న కాలనీల ఏర్పాటు ప్రక్రియపైనే ప్రత్యేక దృష్టి సారించారన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలో గృహ నిర్మాణ పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక జాయింట్‌ కలెక్టర్‌ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు-బ్యాంకుల మధ్య లింకేజీ ప్రశ్నార్థకంగా మారింది. 


ఒక్క రూపాయకే అని ప్రచారం


టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణంలో, లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయకే టిడ్కో ఇంటిని ఇస్తామని ప్రకటించింది. హామీ ప్రకారం పెండింగ్‌ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వాలి. అయితే 300 చ.అ. విస్తీర్ణం గల సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను మాత్రమే ఒక్క రూపాయి హామీకి పరిమితం చేశారు. 365, 430 చ.అ. విస్తీర్ణం ఇళ్లకు లబ్ధిదారులు బ్యాంకు రుణం తీసుకోవాల్సిందే అని మెలిక పెట్టారు. ఒక్క రూపాయికి టిడ్కో ఇల్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, మాట మార్చడంతో టిడ్కో కాలనీలు ఎప్పుడు పూర్తవుతాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


మౌలిక వసతులకు రూ.150 కోట్లు


కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరులో 90 శాతం స్ట్రక్చర్‌ పూర్తయిన టిడ్కో గృహాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలంటే రూ.150 కోట్లకు పైగా అవసరమవుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. మిగిలిన పది శాతం పెండింగ్‌ పనులకు, మౌలిక సదుపాయాల కల్పన అంచనా మొత్తం అదనం అని భావిస్తున్నారు. జిల్లాలో బ్యాంకు లింకేజీ వ్యవహారం పూర్తి అయితేగానీ పెండింగ్‌ పనుల్లో పురోగతి ఉండదని అంటున్నారు. జిల్లాలో దాదాపు 30 వేల ఏపీ టిడ్కో గృహాలను పూర్తిచేసి, డిసెంబరు నాటికి లబ్ధిదారులకు ఇవ్వాలంటే బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు కావాల్సిందేనని, లేదంటే సాధ్యం కాదని అంటున్నారు. 

Updated Date - 2021-09-18T06:00:58+05:30 IST