అదేబాటలో తనయులు

ABN , First Publish Date - 2022-06-11T06:25:38+05:30 IST

ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీ నాయకుల వర్గపోరు రూటు మారింది. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మధ్య ఆధిపత్యపోరు

అదేబాటలో తనయులు

అన్నదమ్ముల సవాల్‌

అదేబాటలో తనయులు

రచ్చకెక్కిన ఇంటిపోరు

రూటు మారిన వైసీపీ వర్గ విభేదాలు 

గతంలో శివరామి రెడ్డితో రాజకీయ వైరం

ఇప్పుడు ఇంటిపోరుతో విశ్వ సతమతం


ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీ నాయకుల వర్గపోరు రూటు మారింది. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతోంది. తాజాగా... ఆ నియోజకవర్గ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఆయన సోదరుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మధుసూదనరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. విశ్వ వర్సెస్‌ మధుగా సై అంటే సై అనే స్థాయిలో పరిణామాలు మారుతున్నాయి. స్వయాన అన్నదమ్ములు కావడంతో.. వారి మధ్య విభేదాలు ఇంటిపోరుకు దారితీశాయి. విశ్వ సోదరుల బాటలోనే వారి తనయులు ఢీ అంటే ఢీ అనే స్థాయిలో బహిరంగ విమర్శలకు వెనుకాడటం లేదు. ఒకే కుటుంబ సభ్యులైనప్పటికీ... ఒకరిపై ఒకరు నువ్వా.. నేనా అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. మొన్నటిదాకా సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు చేసుకున్న వారి తనయులు, ఏకంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేదాకా పరిస్థితులు వెళ్లాయి. ఈ పరిణామాలు కేసుల నమోదు వరకూ దారితీశాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. విశ్వేశ్వరరెడ్డికి ఇంటిలోనే వేరుకుంపటి తయారైంది.

అనంతపురం ఆంధ్రజ్యోతి 


విశ్వ ఓటమితోనే..

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో విశ్వేశ్వరరెడ్డి ఓటమి చెందారు. అప్పటిదాకా అంతర్గతంగా సోదరుల మధ్య ఉన్న మనస్పర్థలు ఆ తరువాత ఒక్కొక్కటిగా బట్టబయలయ్యాయి. ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థులతో తన చిన్నాన్న మధుసూదన రెడ్డి, మరో చిన్నాన్న దివంగత రవీంద్రనాథ్‌ రెడ్డి కుమారుడు నిఖిల్‌నాథ్‌ రెడ్డి కుమ్మక్కు కావడంతోనే తన తండ్రి ఓటమి చెందాడని విశ్వ తనయుడు ప్రణయ్‌ రెడ్డి ప్రచారం చేసిన నేపథ్యంలోనే... వారి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయనే వాదన బలంగా వినిపిస్తోంది. అప్పటి వరకూ సోదరుల మధ్య అంతర్గతంగా ఉన్న మనస్పర్థలు బట్టబయలు కావడానికి ప్రధాన కారణం ఇదే అభిప్రాయం ఆ ప్రాంతంలో వ్యక్తమవుతోంది. సోదరుల మధ్య అంతర్గత మనస్పర్థలు ఉన్నప్పటికీ... బహిరంగంగా ఇప్పటివరకూ విమర్శలు చేసుకోలేదు. తన తండ్రి ఓటమికి చిన్నాన్న మధుసూదనరెడ్డి, మరో చిన్నాన్న కుమారుడు నిఖిల్‌నాథ్‌రెడ్డే కారణమని విశ్వ కుమారుడు ప్రణయ్‌రెడ్డి చేస్తున్న ప్రచారాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో నిఖిల్‌నాథ్‌రెడ్డి సోషల్‌ మీడియా వేదికగా... విశ్వ, ఆయన కుమారుడు ప్రణయ్‌రెడ్డిపై విమర్శలకు దిగారు. ప్రణయ్‌రెడ్డి అదేస్థాయిలో ప్రతివిమర్శలు చేయడంతో ఇంటిపోరు రచ్చకెక్కింది. విశ్వ రాజకీయ ఎదుగుదల క్రమంలో.. వెన్నంటే నడిచిన మధుసూదనరెడ్డిపై విశ్వ తనయుడు చేసిన విమర్శలే కుటుంబంలో చిచ్చుకు ప్రధాన కారణమనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో విశ్వ, ఆయన కుమారుడు ప్రణయ్‌రెడ్డి ఒకవైపు... మధుసూదనరెడ్డి, ఆయన కుమారుడు అవినా్‌షరెడ్డి, దివంగత రవీంద్రనాథ్‌రెడ్డి కుమారుడు నిఖిల్‌నాథ్‌రెడ్డి ఒక వర్గంగా పార్టీలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ప్రణయ్‌రెడ్డితో అవినా్‌షరెడ్డి, నిఖిల్‌నాథ్‌రెడ్డి విభేదిస్తూ వస్తున్నారు. కుమారుడి ప్రచారానికి చెక్‌ పెట్టాల్సిన విశ్వేశ్వర రెడ్డి మౌనం వహించారు. దీంతో ప్రణయ్‌ రెడ్డి ద్వారానే తన సోదరుడు తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని భావించిన మధుసూదనరెడ్డి, క్రమేపీ అన్నకు దూరమైనట్లు సమాచారం.


ప్రణయ్‌ రెడ్డి తీరే కారణమా..?

ఉరవకొండ నియోజకవర్గంలో ప్రణయ్‌ రెడ్డి మితిమీరిన రాజకీయ జోక్యమే విశ్వ, మధుసూదన రెడ్డి మధ్య విభేదాలకు ప్రధాన కారణమని కొందరు అంటున్నారు. నియోజకవర్గంలో ప్రణయ్‌రెడ్డి మాటే చెల్లుబాటయ్యే విధంగా తండ్రి విశ్వేశ్వరరెడ్డి పరోక్షంగా సహకరిస్తున్నారని, ఇది సోదరుల మధ్య దూరం పెంచడానికి మరో కారణమనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆది నుంచి రాజకీయాల్లో వెన్నుదన్నుగా నడిచినా.. కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం తన సోదరుడు విశ్వేశ్వరరెడ్డి ఆరాటపడుతుండటాన్ని మధుసూదనరెడ్డి జీర్ణించుకోలేకపోయారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. దీనికి తోడు నియోజకవర్గంలో ప్రణయ్‌రెడ్డి జోక్యం మితిమీరిపోవడం, భూ దందాలు, దౌర్జన్యాల ఆరోపణలు వెల్లువెత్తినా, కుమారుడిని విశ్వ నిలువరించడం లేదని, ఇది కూడా సోదరులు, వారి తనయుల మధ్య విభేదాలకు ప్రధాన కారణమని అంటున్నారు. ఆర్థిక అంశాలు దీనికి తోడైనట్లు తెలుస్తోంది. 


తనయులూ అదేబాటలో..

సార్వత్రిక ఎన్నికల్లో విశ్వేశ్వరరెడ్డి ఓటమి తరువాత.. ఆయనకు, మధుసూదనరెడ్డికి మధ్య మాటలు దూరమయ్యాయి. ఒకరినొకరు కలుసుకునే పరిస్థితులు దాదాపుగా లేవనే చెప్పాలి. ఒకరంటే మరొకరికి సరిపడనంతవరకూ పరిస్థితులు వెళ్లాయి. ఎన్నికల తరువాత సోదరులు విరోధులుగా మారారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే క్రమంలో మధుసూదనరెడ్డి కుమారుడు అవినా్‌షరెడ్డి, దివంగత రవీంద్రనాథ్‌రెడ్డి కుమారుడు నిఖిల్‌నాథ్‌రెడ్డి ఒక కుంపటిగా... విశ్వేశ్వరరెడ్డి కుమారుడు ప్రణయ్‌ రెడ్డి మరో కుంపటిగా విడిపోయారు. ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే దాకా పరిస్థితులు వెళ్లాయి. ప్రణయ్‌రెడ్డి తన సోదరులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా... నిఖిల్‌నాథ్‌రెడ్డి ప్రణయ్‌రెడ్డిపై చేయి చేసుకున్నారనే ప్రచారం ఆ పార్టీలో జోరుగా సాగింది. పార్టీ కార్యాలయంలో ప్రణయ్‌రెడ్డి కార్యకర్తలతో సమావేశంలో ఉండగా.. అక్కడికి నిఖిల్‌నాథ్‌ రెడ్డి వెళ్లారు. తమపై దుష్ప్రచారం చేయడానికి ఏ ఆధారాలు ఉన్నాయని నిఖిల్‌నాథ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తప్పుడు ప్రచారం మానుకోకపోతే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరిస్తూ... వెనుదిరుగుతున్న సమయంలో ప్రణయ్‌రెడ్డి అనుచరుడు ధనరాజ్‌ మరింత రెచ్చగొట్టేలా వ్యవహరించారని, దీంతో దాడివరకూ పరిస్థితులు వెళ్లాయని తెలుస్తోంది. ఈ పరిణామంతో సోదరుల కుమారులపై విశ్వేశ్వరరెడ్డి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయించినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. సోదరుల తనయుల మధ్య చెలరేగిన వివాదాన్ని రాజీమార్గంలో సర్దుబాటు చేయకుండా, మరింత ఆజ్యం పోసేలా కేసుల వరకూ తీసుకెళ్లడాన్ని మధుసూదనరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన సోదరుల మధ్య మరింత దూరాన్ని పెంచిందనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. విశ్వేశ్వరరెడ్డి కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఎక్కడికి దారితీస్తాయో, ఆ పార్టీ అధినాయకత్వం ఎంతమేరకు స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.





Updated Date - 2022-06-11T06:25:38+05:30 IST