యోగి ప్రమాణస్వీకారానికి సోనియా వెళ్లొద్దు: రషీద్ అల్వీ

ABN , First Publish Date - 2022-03-19T22:00:10+05:30 IST

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్..

యోగి ప్రమాణస్వీకారానికి సోనియా వెళ్లొద్దు: రషీద్ అల్వీ

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ దూరంగా ఉండాలని, ఆమె హాజరయితే మైనారిటీ వర్గాలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత రషీద్ అల్వీ  శనివారంనాడు అన్నారు.


యోగి ఆదిత్యనాథ్ ఈనెల 25న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ  కార్యక్రమానికి విపక్షాల నుంచి సోనియాగాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, ఎస్‌పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బీఎస్‌పీ చీఫ్ మాయవతి తదితరులను బీజేపీ ఆహ్వాస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోనియాతో పాటు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి దూరంగా ఉండటం మంచిదని అల్వీ పేర్కొన్నారు. ''అదిత్యనాథ్ గత ఐదేళ్ల పాలనలో విద్వేష వ్యాప్తి చేస్తూ వచ్చారు. 80 వెర్సన్ 20 నినాదంతోనే ఆయన ఎన్నికల్లో గెలిచారు. బుల్‌డోజర్లు నడపడంపైనే మాట్లాడారు. సంప్రదాయాలు, విలువలు, దేశ సంస్కృతిని నమ్మే ఏ నేత అయినా ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారానికి దూరంగా ఉండటం మంచిది'' అని ఆయన అన్నారు.


కాగా, యోగి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానితుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ కార్యదర్శి జేపీ నడ్డా ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాల లబ్ధిదారులను, ముఖ్యంగా మహిళా లబ్ధిదారులను కూడా ఆహ్వానిస్తున్నారు. లక్నోలోని ఏకన స్టేడియం ఈ ఉత్సవానికి వేదిక కానుంది. ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. యోగి క్యాబినెట్ మంత్రుల పేర్ల ఖరారుపై అధిష్ఠానం కసరత్తు సాగిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 403 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 255 సీట్లు గెలుచుకుని, 41.29 శాతం ఓట్ షేర్ సొంతం చేసుకుంది.

Updated Date - 2022-03-19T22:00:10+05:30 IST