వివాద ‘సృష్టికర్తలు’ ప్రతిపక్షాలు : ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2020-09-21T19:36:07+05:30 IST

భారత దేశ గ్రామాలు స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నాయని, ఆ అడుగులు బిహార్ నుంచి మొదలు

వివాద ‘సృష్టికర్తలు’ ప్రతిపక్షాలు : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ :21 వ శతాబ్దిలో దేశం ముందుకు సాగడానికి వ్యవసాయ చట్టాలు అత్యంత అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లులతో విపక్షాల రైతుల ఓటుబ్యాంకు చేజారిపోయే ప్రమాదముందని, అందుకే ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తున్నాయని ఘాటుగా విమర్శించారు. ప్రతిపక్షాలు వివాదాస్పద వ్యాఖ్యలకు నిర్మాతలంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.


‘‘కొత్త చట్టాలతో చాలా మందికి కొత్త ఇబ్బందులు వచ్చాయి. కొత్త బిల్లుతో మండీలకే ఏం జరుగుతుంది? అవేమైనా మూతపడతాయా? అలాంటిది ఎప్పటికీ జరగదు’’ అని మోదీ స్పష్టం చేశారు. కొత్త చట్టంతో మార్కెట్‌కు వచ్చిన నష్టమేమీ లేదని, అవి కొనసాగుతాయని, గతంలో కంటే మరింత మెరుగ్గా పనిచేస్తాయని ఆయన ప్రకటించారు. కొత్త చట్టాలతో మార్కెట్‌కు నష్ట వాటిల్లుతుందని కొందరు ప్రచారం చేస్తున్నారని, అది పూర్తిగా తప్పుడు ప్రచారమని మోదీ స్పష్టం చేశారు.


కొత్త చట్టాలతో రైతుల ఆర్థిక పరిస్థితి మారిపోతుందని, 21 వ శతాబ్దికి ఈ బిల్లులు అత్యావశ్యకమని నొక్కి వక్కానించారు. ‘‘నిన్న (ఆదివారం) పార్లమెంటులో వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందాయి. రైతుకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నా. రైతుల్లో విప్లవం తేవడానికే ఈ బిల్లు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బిల్లు అత్యావశ్యకం’’ అని మోదీ పేర్కొన్నారు. 


భారత దేశ గ్రామాలు స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నాయని, ఆ అడుగులు బిహార్ నుంచి మొదలు కావడం ఎంతో ముదావహం అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బిహార్‌కు చెందిన 294 కోట్ల విలువైన హైవే ప్రాజెక్టులను ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించారు. దీంతో పాటు ‘ఇంటి వరకూ ఫైబర్’ అన్న కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.


ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ...  మౌలిక సదుపాయాలపై గ్రామాలు దృష్టి సారించాయని, అలా దృష్టి పెడుతూనే వేగంగా అభివృద్ధి సాగిస్తున్నాయని అన్నారు. అటల్ బిహారీ వాజ్‌పాయ్ ప్రభుత్వం మాత్రమే మౌలిక సదుపాయాల ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పిందని గుర్తు చేశారు. ఆయా రాష్ట్రాల్లోని చివరంచు ప్రాంతాలకు కూడా ‘ఫైబర్ ఇంటర్నెట్ సేవలు’ చేరాలన్నద లక్ష్యమని, ఈ డిజిటల్ విప్లవాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని మోదీ పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-21T19:36:07+05:30 IST