‘సౌర’ భారం!

ABN , First Publish Date - 2021-08-04T06:04:47+05:30 IST

విద్యుత్‌ స్లాబ్‌ ధరలను అమాంతం పెంచేసి, ప్రజలను దోచుకుంటున్న ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ ఇంధనవనరుల వైపు ఆసక్తి చూపే వారినీ ఆ దిశగా వెళ్లకుండా నిరుత్సాహపరుస్తోంది.

‘సౌర’ భారం!

సౌర విద్యుత్‌ మీటర్ల సరఫరా బంద్‌

కొరత పేరుతో కొత్త దోపిడీ

ఓ వైపు విద్యుత్‌ చార్జీల బాదుడు

మరోవైపు సౌర విద్యుత్‌కు అవాంతరాలు

ప్రత్యామ్నాయానికి ప్రోత్సాహం కరువు

గతంలో ఉన్న సబ్సిడీలకూ చెల్లుచీటీ

విద్యుత్‌ శాఖ తీరుపై వినియోగదారుల ఆగ్రహం


ప్రజలపై విద్యుత్‌ భారాలను మోపారు. ప్రత్యామ్నాయంవైపు దృష్టి సారించేవారిని ప్రోత్సహించకపోగా సౌర విద్యుత్‌ ప్యానళ్లపై గత పాలకులు ఇచ్చిన సబ్సిడీకి చెల్లుచీటీ ఇచ్చారు. సౌర విద్యుత్‌ మీటర్ల కొరత పేరుతో కొత్త దోపిడీకి తెర తీశారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విద్యుత్‌ స్లాబ్‌ ధరలను అమాంతం పెంచేసి, ప్రజలను దోచుకుంటున్న ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ ఇంధనవనరుల వైపు ఆసక్తి చూపే వారినీ ఆ దిశగా వెళ్లకుండా నిరుత్సాహపరుస్తోంది. విద్యుత్‌ చార్జీల భారాన్ని మోయలేక వినియోగదారులు అనేక మంది సౌర విద్యుత్‌ వైపు ఆసక్తి చూపుతున్నారు. గతంలో సౌర విద్యుత్‌ ప్యానళ్లను ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు సబ్సిడీలిచ్చి మరీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించేవి. కానీ వైసీపీ సర్కారు పుణ్యమా అని సబ్సిడీ గాల్లో కలిసిపోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా మీటర్ల కొరత పేరుతో విద్యుత్‌ శాఖ అధికారులు నయా దోపిడీకి తెరదీశారు. దీంతో వినియోగదారులపై పడే భారం ఒక్కసారిగా పది రెట్లు పెరిగిపోయింది. ఓవైపు విద్యుత్‌ చార్జీల మోత.. మరోవైపు సౌరవిద్యుత్‌ను ఎంచుకుందామంటే మీటర్ల పేరుతో దోపిడీ చేస్తుండంతో వినియోగదారులకు దిక్కుతోచడం లేదు.


కొరత పేరుతో భారం

వైసీపీ సర్కార్‌ దొడ్డిదారిలో విద్యుత్‌ భారాలు మోపుతుండటంతో నెలకు 200 నుంచి 300 యూనిట్లు వాడే వినియోగదారులకు విద్యుత్‌ బిల్లులు షాక్‌ కొట్టిస్తున్నాయి. మధ్యతరగతి కుటుంబాలకూ విద్యుత్‌ బిల్లు రూ.2వేలకు పైగా వస్తోంది. దీంతో చాలా మంది సౌర విద్యుత్‌ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఇళ్లపైన, అపార్ట్‌మెంట్లపైన ఖాళీ స్థలంలో సోలార్‌ రూఫ్‌టాప్‌ ప్యానళ్లను ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. రూఫ్‌టాప్‌ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గృహావసరాలకు వాడుకోవడంతోపాటు మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు ఇవ్వడం ద్వారా ఆదాయం ఆర్జించవచ్చన్నది వారి ఆలోచన. అయితే ఈ ఆలోచను ఆదిలోనే తుంచివేస్తున్నారు విద్యుత్‌ శాఖ అధికారులు. సౌర విద్యుత్‌ను ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు ఇవ్వాల్సిన మీటర్లను కొరత పేరుతో నిలిపి వేశారు. దీంతో వినియోగదారులకు రూ.8,500 అయ్యే ఖర్చు అమాంతం రూ.85వేలకు చేరుతోంది. సౌర విద్యుత్‌ ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు సాధారణంగా నాలుగు రకాల మీటర్లను సీపీడీసీఎల్‌ అధికారులు ఇవ్వాల్సి ఉంటుంది. సింగిల్‌ ఫేజ్‌, త్రీ ఫేజ్‌, కరెంటు ట్రాన్స్‌ఫర్‌(సీటీ), హైటెన్షన్‌(హెచ్‌టీ) మీటర్లను ఆయా అవసరాలను బట్టి బిగిస్తారు. అధికశాతం సీటీ, హెచ్‌టీ మీటర్లనే బిగిస్తుంటారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర సీటీ మీటర్‌కు రూ.8,500, హెచ్‌టీ మీటర్‌కు సుమారు రూ.20వేలు.. కానీ వీటి సరఫరాను నిలిపివేసిన సీపీడీసీఎల్‌ అధికారులు.. వినియోగదారులపై పదింతల భారాన్ని మోపుతున్నారు. మీటరు సరఫరాదారులతో కుమ్మక్కయిన అధికారులు వారికి లబ్ధి చేకూర్చేందుకే ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 


అడుగడుగునా దోపిడీ

సోలార్‌ ప్యానళ్లు బిగించుకున్న వినియోగదారులు అనేక మంది మీటర్ల కొరత కారణంగా ఆరేడు నెలలుగా విద్యుత్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం నుంచి కొనుగోలు చేస్తే రూ.8,500 అయ్యే మీటరు ధర బహిరంగ మార్కెట్‌లో రూ.30వేల వరకు (మీటరు, బాక్సు కలిపి) పలుకుతోంది. గతంలో ఒక్క మీటరు పెడితే సరిపోయేది. కానీ ప్రస్తుతం దానికి విద్యుత్‌ శాఖ అభ్యంతరం చెబుతోంది. దీంతో మెయిన్‌ మీటరుతోపాటు చెక్‌ మీటరునూ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. దీనికి మరో రూ.30వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. వినియోగదారులు మీటరను బయట కొనుగోలు చేయాలంటే విద్యుత్‌ శాఖ అనుమతి ఇవ్వాలి. ఇలా అనుమతి ఇచ్చేందుకు మీటరుకు రూ.5వేలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బయట మీటరు కొన్న తర్వాత దానికి థర్డ్‌ పార్టీతో టెస్టింగ్‌ నిర్వహించి, విద్యుత్‌ శాఖ అధికారుల నుంచి అంతా బాగుందని పత్రం తీసుకోవాలి. వాస్తవానికి రూ.1000 కట్టించుకుని, విద్యుత్తు శాఖే ఈ టెస్టింగ్‌ను చేయాల్సి ఉన్నా చేయడం లేదు. బయట టెస్టింగ్‌కు రూ.6,500 తీసుకుంటున్నారు. టెస్టింగ్‌ తమ సమక్షంలో జరిగినట్టు ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు విద్యుత్‌ శాఖ అధికారికి మీటరుకు రూ.10వేలు చదివించుకోవాలి. చివరిగా మీటరు తీసుకెళ్లి విద్యుత్‌ శాఖ అధికారులకు ఇస్తే, వారు వెసులుబాటును చూసుకొని వచ్చి బిగించి మరో వెయ్యో.. రెండువేలో మామూలు పట్టుకెళుతారు. 

Updated Date - 2021-08-04T06:04:47+05:30 IST