కొంగరమల్లయ్య గుట్ట నుంచి యథేచ్ఛగా మట్టి రవాణా

ABN , First Publish Date - 2021-03-04T06:50:31+05:30 IST

కొంగరమల్లయ్య గుట్ట నుంచి యథేచ్ఛగా మట్టిని తరలిస్తు న్నారు.

కొంగరమల్లయ్య గుట్ట నుంచి యథేచ్ఛగా మట్టి రవాణా
యథేచ్ఛగా తవ్వకాలు జరిపి, అక్రమ రవాణా

వత్సవాయి : కొంగరమల్లయ్య గుట్ట నుంచి యథేచ్ఛగా మట్టిని తరలిస్తు న్నారు. రెవెన్యూ, దేవదాయ శాఖాధికారులు పట్టించుకోకపోవటంతో రాత్రి, పగలు తేడా లేకుండా తవ్వకాలు జరిపి మట్టిని రవాణా చేస్తున్నా రన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భీమవరం పంచాయతీ పరిధిలోని కొంగమల్లయ్య గుట్ట కొనగిరి మల్లికార్జునస్వామి ఆలయాన్ని ప్రాచీన కాలంలో నిర్మించారు. శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. ఆలయ పరిధిలో 157ఎకరాల భూమి ఉంది. భక్తుల మనోభావాలను అతిక్రమించి మట్టిని తరలిస్తున్నారు. దీనిపై 2020లో గుట్ట భాగంలో దేవదాయశాఖకు ఎంత భూమి ఉందో సర్వే చేసి ఇవ్వాలని రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేశారు. నేటి వరకు హద్దులు ఏర్పాటు చేయకపోవ టంతో మట్టి తరలించే ముఠాను తాము నిరోధించలేకపోతున్నట్టు ఆలయ ఈవో హరిగోపాల్‌ తెలిపారు. మట్టిని మాత్రం అధికార పార్టీకి చెందిన కొందరు యంత్రాలను వినియోగించి టిప్పర్‌ల ద్వారా తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

 తాము ఎవరికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తహసీల్దార్‌  రామకృష్ణ తెలిపారు. మట్టి తరలకుండా మైన్స్‌, పోలీసులుకు ఫిర్యాదు చేస్తామన్నారు. దీనిపై  మైన్స్‌ అధికారి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సూరారెడ్డి అనే వ్యక్తికి గుట్ట సమీపంలోని 177/1లో మట్టి తరలించేందుకు మాత్రమే అనుమతులు ఇచ్చామని గుట్ట భాగంలో తవ్వేందుకు అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. మట్టి రవాణా విషయమై పరిశీలించి చర్యలు తీసుకుంటామని సుబ్రహ్మణ్యం తెలిపారు. 



Updated Date - 2021-03-04T06:50:31+05:30 IST