గాల్లో కలిసి సామాజిక దూరం.. రెమ్‌డెసివిర్ కోసం తోసుకున్న జనం

ABN , First Publish Date - 2021-05-16T02:05:19+05:30 IST

దేశంలో చెలరేగిపోతున్న కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం పలు మార్గదర్శకాలు విడుదల చేసింది.

గాల్లో కలిసి సామాజిక దూరం.. రెమ్‌డెసివిర్ కోసం తోసుకున్న జనం

చెన్నై: దేశంలో చెలరేగిపోతున్న కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. వాటిలో ప్రధానమైనవి సామాజిక దూరం, మాస్కు ధరించడం. అయితే, నేడు చెన్నైలో ఈ దూరాలన్నీ గాలికెగిరిపోయాయి. ఇక్కడి జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల విక్రయం ప్రారంభించారు. దీంతో వాటిని కొనుగోలు చేసేందుకు జనం ఎగబడ్డారు. క్యూలో బారులు తీరారు.


ఒకరినొకరు నెట్టుకుంటూ ఇంజక్షన్ సంపాదించుకునేందుకు తంటాలు పడుతున్నారు. తన తల్లిదండ్రులకు కరోనా సోకిందని, వైద్యుడు వారికి రెమ్‌డెసివిర్ ఇవ్వాలని చెప్పారని క్యూలో నిల్చున్న 30 ఏళ్ల సందీప్ రాజ్ చెప్పాడు. తాను గత పది రోజులుగా వీటి కోసం ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నాడు. 


సందీప్ ఆ ప్రయత్నాల్లో ఉండగానే ఈ ఉదయం అతడి తండ్రి మృతి చెందాడు. తండ్రి మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకుని తల్లిని బతికించుకునేందుకు ఇక్కడికొచ్చి క్యూలో నిల్చున్నట్టు చెబుతూ కన్నీరు పెట్టుకున్నాడు. తనకు టోకెన్ ఉన్నా ఫలితం లేకుండా పోయిందన్నాడు. ఇక్కడ టోకెన్లు ఉన్నవారికి, లేనివారికి మధ్య ఎలాంటి తేడా లేదన్నాడు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. సందీప్‌లానే మరెంతో మంది  స్టేడియానికి వచ్చి క్యూలో నిల్చున్నారు. కొందరు తెల్లవారుజామున ఒంటి గంటకే వచ్చి లైనులో నిల్చుంటున్నారు. 


ఇంజక్షన్ సంపాదించి తమ వారిని కాపాడుకోవడం సంగతేమో కానీ, ఇక్కడికొచ్చిన వారు మాత్రం తప్పకుండా ఆ మహమ్మారి బారినపడడం ఖాయమని మరో యువకుడు చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడప్పుడే కరోనా అంతమవడం కష్టమని నిర్వేదం వ్యక్తం చేశాడు. స్టేడియంలో ఉన్న పోలీసులు అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. 


తమిళనాడు ప్రభుత్వానికి రోజుకు 7 వేల రెమ్‌డెసివిర్  ఇంజక్షన్లు లభిస్తుండగా, వాటిని 20 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తోంది. జవహర్‌లాల్ స్టేడియం విశాలంగా ఉంటుంది కాబట్టి తాము అక్కడే రెమ్‌డెసివిర్ ఇంజిక్షన్లను పంపిణీ చేస్తామని తమిళనాడు ప్రభుత్వం ఇటీవల మద్రాస్ హైకోర్టుకు తెలిపింది. అంతకుముందు వాటిని కిల్పాక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పంపిణీ చేసేవారు. కాగా, ప్రస్తుతం రోజుకు 3 వేల ఇంజక్షన్లను పంపిణీ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.  

Updated Date - 2021-05-16T02:05:19+05:30 IST