Bar row: కాంగ్రెస్ నేతలకు స్మృతి ఇరానీ లీగల్ నోటీసు, బేషరతు క్షమాపణకు డిమాండ్

ABN , First Publish Date - 2022-07-25T00:36:53+05:30 IST

నిబంధనలకు విరుద్ధంగా తన కుమార్తె జోయిష్ ఇరానీ గోవాలో బార్ నడుపుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు చేసిన..

Bar row: కాంగ్రెస్ నేతలకు స్మృతి ఇరానీ లీగల్ నోటీసు, బేషరతు క్షమాపణకు డిమాండ్

న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా తన కుమార్తె జోయిష్ ఇరానీ (Zoish Irani) గోవాలో బార్ నడుపుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) ఆదివారంనాడు లీగల్ చర్యలకు దిగారు. కాంగ్రెస్ నేతలు పవన ఖెరా, జైరామ్ రమేష్, నెట్ట డిసౌజా, కాంగ్రెస్ పార్టీకి  నోటీసులు ఇచ్చారు. బేషరతుగా లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పాలని, వారు చేసిన ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆ నోటీసులో ఆమె పేర్కొన్నారు. మీడియాకు లీగల్ నోటీసు ప్రతులను చూపించారు.


పద్దెనిమిదేళ్ల జోయిష్ ఇరానీ నిబంధనలకు విరుద్ధంగా గోవాలో బార్ నడుపుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను స్మృతి ఇరానీ శనివారంనాడు కూడా ఖండించారు. ఇవి కేవలం దురుద్దేశపూరితంగా చేసిన ఆరోపణలేనని అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ రూ.5,000 కోట్లు లూటీ చేశారని తాను చెప్పడం వల్లే తన కూతుర్ని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తన కుమార్తె ఫస్టియర్ కాలేజీ విద్యార్థిని అని, ఎలాంటి బార్ నడపడం లేదని తెలిపారు. ఏదైనా తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని కాంగ్రెస్ నేతలకు సవాలు చేశారు. గాంధీ కుటుంబం తరఫున తన కుమార్తెను కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేసుకుని ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీపై అమేథిలో తిరిగి పోటీ చేసి చిత్తుగా ఓడిస్తానని చెప్పారు. బీజేపీ కార్యకర్తగానే కాకుండా, 18 ఏళ్ల కుమార్తెకు తల్లిగా తాను ఈ ప్రతిన చేస్తున్నానని అన్నారు.

Updated Date - 2022-07-25T00:36:53+05:30 IST