గ్రామకంఠం స్థలాలపై హక్కులు కల్పించేందుకు కసరత్తు

ABN , First Publish Date - 2022-08-20T04:59:15+05:30 IST

గ్రామాల్లో నివాస స్థలాలపై ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించి పాసుబుక్కులను జారీ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టే యోచనలో ఉన్నట్టు ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్‌ పేర్కొన్నారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం యావాపూర్‌ గ్రామంలో పంచాయతీరాజ్‌ కమిషనర్‌ హన్మంతరావు, కలెక్టర్‌ హరీశ్‌, అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌తో కలిసి గురువారం ఆమె పర్యటించారు.

గ్రామకంఠం స్థలాలపై హక్కులు కల్పించేందుకు కసరత్తు
యావాపూర్‌లో ప్రజలతో మాట్లాడుతున్న సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్‌

సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్‌

తూప్రాన్‌రూరల్‌, ఆగస్టు 19 : గ్రామాల్లో నివాస స్థలాలపై ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించి పాసుబుక్కులను జారీ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టే యోచనలో ఉన్నట్టు ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్‌ పేర్కొన్నారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం యావాపూర్‌ గ్రామంలో పంచాయతీరాజ్‌ కమిషనర్‌ హన్మంతరావు, కలెక్టర్‌ హరీశ్‌, అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌తో కలిసి గురువారం ఆమె పర్యటించారు. ఖాళీ స్థలాల రెగ్యులరైజేషన్‌పై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పిట్ల యాదగిరి, నరేందర్‌చారి ఇళ్ల వద్ద ఖాళీ స్థలాలను పరిశీలించి, వాటికి సంబంధించిన పత్రాలు ఉన్నాయా అని ఆరా తీశారు. భూమిహక్కు పత్రం మాదిరిగా ఇంటి స్థలాలకు హక్కుపత్రం ఇస్తే ఎలా ఉంటుంది.. డ్రోన్ల సహాయంతో స్థలాల వివరాల సేకరణకు సహకరిస్తారా.. అని పలువురు గ్రామస్థులను అడిగారు. ఖాళీ స్థలాలపై పంచాయతీ రికార్డులు, ఆయా స్థలాల్లో కొత్త ఇంటి నిర్మాణాల అనుమతులకు సంబంధించిన నిబంధనల అమలుపై పంచాయతీ కార్యదర్శి రంగవ్వను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో సమావేశంలో ప్రజలు, ప్రజాప్రతినిదుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. సర్పంచ్‌ నర్సింహారెడ్డి మాట్లాడుతూ గ్రామకంఠంలోని ఇంటి స్థలాలపై హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలను స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. సర్వే కోసం వచ్చే అధికారులకు సహకరిస్తామని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి మాట్లాడుతూ ఖాళీ స్థలాలకు హక్కుపత్రాల జారీచేసి, నామమాత్రపు పన్ను విధిస్తే అభ్యంతరం ఉండదని తెలిపారు. అనంతరం స్మితా సబర్వాల్‌ మాట్లాడుతూ గ్రామకంఠం పరిధిలోని ఖాళీ స్థలాలపై పంచాయతీ రికార్డుల నిర్వహణ సరిగ్గాలేక యజమానులకు స్ధలాలపై పూర్తిహక్కులు లేకుండా పోయాయని పేర్కొన్నారు. గ్రామంలోని ఖాళీ స్థలాలపై యజమానులకు చట్టబద్దమైన హక్కులు కల్పించేందుకు క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ డిప్యూటీ కమిషనర్లు రవిందర్‌, జాన్‌వెస్లీ, డీపీవో అరుణ్‌, జడ్పీ సీఈవో శైలేష్‌, ఎంపీడీవో అరుంధతి, తహసీల్దార్‌ జ్ఞానజ్యోతి, ఎంపీపీ గడ్డి స్వప్న, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-20T04:59:15+05:30 IST