నెమ్మది నెమ్మదిగా..

ABN , First Publish Date - 2022-08-13T06:56:34+05:30 IST

నెమ్మది నెమ్మదిగా..

నెమ్మది నెమ్మదిగా..
భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం

భద్రాచలం వద్ద స్వల్పంగా తగ్గుతున్న గోదావరి ప్రవాహం 

13గంటల పాటు 52.5 అడుగుల వద్ద నిలకడగా..

కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక 

ఏజెన్సీలో మూడురోజులుగా నిలిచిన రాకపోకలు

భద్రాచలం, ఆగస్టు 12: గోదావరి ప్రవాహం భద్రాచలం వద్ద 13గంటల పాటు నిలకడగా ఉంది. గురువారం రాత్రి 8గంటలకు 52.5అడుగుల నీటిమట్టానికి చేరుకున్న గోదావరి శుక్రవారం ఉదయం 9గంటల వరకు అదే నీటిమట్టం వద్ద నిలకడగా ఉంది. 10 గంటలకు 52.4అడుగులకు తగ్గి మళ్లీ మరో గంటపాటు నిలకడగా ఉండి.. తిరిగి 12గంటలకు 52.3, రాత్రి 11గంటలకు 51.8అడుగులకు తగ్గింది. ఈ క్రమంలో గోదావరి వరద తగ్గుముఖం స్వల్పంగానే ఉంటుందని చెబుతున్న అధికారులు మూడోరోజూ రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఇక గోదావరి వరద కారణంగా భద్రాచలం ఏజెన్సీలో పలు చోట్ల రహదారులపైకి నీరు రావడంతో 72గంటలుగా రాకపోకలు స్తంభించాయి. భద్రాచలం వద్ద స్నాన ఘట్టాలు పూర్తిగా నీట మునగగా దేవస్థానం కల్యాణ కట్ట కిందిభాగం మూడు రోజులుగా నీటిలో ఉంది. దీంతో అటుగా ఎవరిరీ రానీయకుండా పటిష్ఠ గస్తీ ఏర్పాటు చేశారు. విస్తా కాంప్లెక్స్‌ స్లూయిస్‌ వద్ద గేట్లు మూసివేయటంతో పట్టణంలోని వ్యర్థనీరు, బ్యాక్‌వాటర్‌ను 20 భారీ మోటార్లతో గోదావరిలోకి పంపుతున్నారు. దీంతో విస్తా కాంప్లెక్స్‌, చప్టా దిగువ, రామాలయ పరిసరాలు వరద ముంపు నుంచి బయటపడ్డాయి. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాలలో నారచీరల ప్రాంతం నాలుగు రోజులుగా ముంపులో ఉంది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుండటంతో పాటు తెలంగాణ- ఆంధ్రా సరిహద్దుల్లోని గుండాల, రాయనిపేట ప్రాంతంలో రోడ్లపైకి వరద నీరు చేరడంతో ఏపీ, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశాలకు రాకపోకలు స్తంభించాయి. కిలోమీటర్ల మేర రహదారికి ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. ఈ క్రమంలో మూడు రోజులుగా ఇతర ర్రాష్టాలకు చెందిన లారీ డ్రైవర్లు,క్లీనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బూర్గంపాడు నుంచి ఏపీలోని జంగారెడ్డిగూడెం వెళ్లే మార్గంలో భారీగా వరద వచ్చింది. అశ్వాపురం మండలంలోని అమెర్థా, అమ్మగారిపల్లి మధ్య గోదావరి వరద కారణంగా వాగు పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చర్ల మండలంలో కుదునూరు వద్ద రహదారి, బూర్గంపాడు మండలంలోని బూర్గంపాడు-సారపాక, బూర్గంపాడు-కుక్కునూరు, బూర్గంపాడు-సోంపల్లి రహదారులపైకి వరద రావడంతో రాకపోకలు నిలిపివేశారు. 


ఆర్టీసీకి భారీగా తగ్గిన ఆదాయం

వరదల ఆరణంగా భద్రాచలం ఆర్టీసీ డిపోకు ఆదాయం భారీగా తగ్గింది. నాలుగు రోజులుగా రెండో  ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి గోదావరి ప్రవహిస్తుండటంతో భద్రాచలం డిపో నుంచి వెంకటాపురం, కూనవరం, కుంట వైపు వెళ్లే 16సర్వీసులను నాలుగు రోజులుగా నిలిపివేశామని, పలితంగా రూ.12లక్షల ఆదాయం తగ్గిందని అధికారులు తెలిపారు. జూలైలో వరదలు వచ్చిన సమయంలో కూడా రూ.70లక్షల ఆదాయాన్ని కోల్పోయామని, మళ్లీ ప్రస్తుత వరదలతో నదీ పరివాహక మండలాలు, గ్రామాలకు బస్సు సర్వీసులను నిలిపివేయటంతో భద్రాచలం డిపోకు భారీ స్థాయిలో నష్టం వాటిల్లిందని వివరించారు. 

Updated Date - 2022-08-13T06:56:34+05:30 IST