నిధులు లేక.. నిర్మాణాలు కాక..

ABN , First Publish Date - 2022-05-01T06:15:38+05:30 IST

నిధులు లేక.. నిర్మాణాలు కాక..

నిధులు లేక.. నిర్మాణాలు కాక..
ఆరు నెలల కిందట ఆగిపోయిన తోట్లవల్లూరు మండలం గరికపర్రులోని సచివాలయ భవన నిర్మాణం

నత్తనడకన గ్రామీణ ఉపాధి హామీ పథక నిర్మాణాలు

సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్‌ క్లినిక్‌ల.. భవన నిర్మాణాల్లో జాప్యం

రెండేళ్లుగా పురోగతి లేక అవస్థలు

రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్లే..

ప్రస్తుతం అద్దె భవనాల్లో కార్యాలయాలు

సరైన వసతులు లేక సిబ్బందికి ఇబ్బందులు


మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లాలో నిర్మిస్తున్న భవన నిర్మాణాలు నత్తను తలపిస్తున్నాయి. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు, డిజిటల్‌ లైబ్రరీలు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ సెంటర్ల నిర్మాణ పనుల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో రెండేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. 


గుడివాడ, ఏప్రిల్‌  30 : జిల్లాలోని గ్రామ సచివాలయాలతో పాటు రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు, డిజిటల్‌ లైబ్రరీలు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ సెంటర్ల నిర్మాణ పనులను ఉపాధి హామీ పథకంలో భాగంగానే చేపట్టారు. పంచాయతీరాజ్‌ విభాగం ఇంజనీర్లు రూపొందించిన అంచనాల మేరకు వీటి నిర్మాణ పనులు జరిగాయి. అయితే, నిర్మాణాలు ప్రారంభమై రెండేళ్లు గడుస్తున్నా పురోగతి లేదు. సచివాలయాలు, ఆర్‌బీకేలు ప్రస్తుతం అద్దె, పాత భవనాల్లో నడుస్తుండటంతో మౌలిక సౌకర్యాలు లేక సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఇరుకు భవనాలు.. అరకొర వసతులు..

ప్రతి సచివాలయంలోనూ తొమ్మిది మంది కార్యదర్శులు, వలంటీర్లు పనిచేయాల్సి ఉంది. పని ఒత్తిడితో పాటు కార్యాలయంలో మౌలిక వసతులు కల్పించకపోవడంపై వారంతా మండిపడుతున్నారు. తాజాగా స్థిర, చరాస్తుల రిజిస్ట్రేషన్‌ సేవలు సైతం సచివాలయాల ద్వారానే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆస్తిపన్ను, నీటి తీరువా, భూమిశిస్తు, మంచినీటి బిల్లులు, చెత్తపన్ను వసూళ్లను సచివాలయాల పరిధిలోకి తీసుకొచ్చారు. ఆర్బీకేల్లో ధాన్యం సేకరణ, ఎరువుల విక్రయాలు, వ్యవసాయ పరికరాల అందజేత, సాగులో సలహాలు అందిస్తుంటారు. అంతటి కీలకమైన ఆర్బీకేలు కూడా అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాలతో నడపాల్సి వస్తోందని అధికారులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో అత్యధిక గ్రామాల్లో సహకార సంఘాల కార్యాలయాల్లోనే వీటిని ఏర్పాటు చేశారు. అయితే, ఇవన్నీ ఇరుగ్గా ఉండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యపరమైన సేవలు అందించేందుకు తలపెట్టిన వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో పేదలు అరకొర వైద్య సేవలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

40 శాతం దాటని సచివాలయ భవన నిర్మాణాలు  

జిల్లాలోని 25 మండలాల్లో 497 గ్రామ పంచాయతీలకు గానూ 387 గ్రామ సచివాలయాలు నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణానికి రూ.150.07 కోట్లతో అంచనాలు రూపొందించారు. నిర్మాణాలు ప్రారంభమై రెండేళ్లు దాటినా నేటికీ కేవలం 140 గ్రామ సచివాలయ భవనాలే నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. మిగిలిన 157 సచివాలయాల నిర్మాణాలు వివిధ దశల్లో అసంపూర్తిగానే ఉన్నాయి. వీటికి గానూ ఏజెన్సీలకు రూ.18.37 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. భూ సేకరణ, ఇతర సమస్యలతో 40 గ్రామ సచివాలయాల నిర్మాణాలు ఇంతవరకు ప్రారంభించలేదు. తోట్లవల్లూరు-2 సచివాలయాన్ని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల ఆవరణలో నిర్మించారు. దీంతో పంచాయతీరాజ్‌ అధికారులు సచివాలయ భవనాన్ని హైస్కూల్‌ నిర్వాహకులకు అప్పగించారు. గుడివాడ రూరల్‌ మండలం చౌటపల్లి ప్రాఽథమిక పాఠశాలలో నిర్మించతలపెట్టిన సచివాలయ పనులు ఆపేశారు. గ్రామంలో మరోచోట ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. 

నిర్మాణం పూర్తి చేసుకున్నవి 25 శాతం ఆర్బీకేలే..!  

జిల్లాలో 380 గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు నిర్మించడానికి రూ.82.84 కోట్లతో అంచనాలు రూపొందించారు. కేవలం 72 మాత్రమే పూర్తి చేసుకున్నాయి. దీనికి గానూ రూ.7.40 కోట్ల బకాయిలు ఏజెన్సీలకు విడుదల చేయాల్సి ఉంది. జిల్లాలో 282 గ్రామాల్లో వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లను రూ.49.35 కోట్లతో నిర్మించాలని అంచనాలు సిద్ధం చేశారు. వీటిలో కేవలం 42 మాత్రమే పూర్తయ్యాయి. 164 క్లినిక్‌లు నిర్మాణ దశల్లో ఉన్నాయి. మిగిలిన 76 క్లినిక్‌ల పనులు ప్రారంభం కాలేదు. వీటికి రూ.2.56 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. వైఎస్సార్‌ బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లను 23 మండలాల్లో నిర్మించాలని రూ.14.72 కోట్లతో అంచనాలు రూపొందించారు. వీటిలో 16 కేంద్రాల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఏడు కేంద్రాల పనులు ఇంకా ప్రారంభించలేదు. జిల్లావ్యాప్తంగా 30 డిజిటల్‌ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని రూ.4.76 కోట్లతో అంచనాలు రూపొందించారు. కారణాలు ఏమైనా వాటి నిర్మాణ పనులు అడుగు ముందుకు పడలేదు. ఏజెన్సీలకు బిల్లుల చెల్లింపులో తాత్సారం చేయడమే పనులు ఆలస్యంగా నడవడానికి కారణమని అధికారులు పేర్కొంటున్నారు. పెండింగ్‌ బిల్లులు వెంటనే విడుదల చేసి నిర్మాణాలను శరవేగంగా చేపట్టాలని కోరుతున్నారు.  

ఇక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో..

తాజాగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథక అమలును తన పరిధిలోకి తీసుకుంది. దీంతో గ్రామాల్లో నిర్మాణ పనులకు బిల్లుల చెల్లింపులో జాప్యం తలెత్తకపోవచ్చని నిపుణులు ఆశిస్తున్నారు. గతంలో పంచాయతీలకు దక్కాల్సిన కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర అవసరాలకు మళ్లించుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల పనులకు బిల్లుల చెల్లింపులో తీవ్రజాప్యం జరిగిందనే విమర్శలు ఉన్నాయి. ఇక మీదట ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టే పనులకు రాష్ట్ర ప్రభుత్వం, గ్రామ పంచాయతీలతో సంబంధం లేకుండా ఏజెన్సీల ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ చేయాలని కేంద్రం నిర్ణయించింది.




Updated Date - 2022-05-01T06:15:38+05:30 IST