కుళ్లిన ఉల్లి!

ABN , First Publish Date - 2020-10-28T08:22:50+05:30 IST

రాయితీ ఉల్లి కోసం వెళ్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది. కుళ్లిపోయిన ఉల్లి సరఫరా చేస్తుండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కుళ్లిన ఉల్లి!

రైతుబజార్లలో సరఫరా

రాయితీపై ‘రద్దు’ సరుకు

బయట మార్కెట్‌లో మేలంటున్న కొనుగోలుదారులు


(రాజాం): రాయితీ ఉల్లి కోసం వెళ్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది. కుళ్లిపోయిన ఉల్లి సరఫరా చేస్తుండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఉల్లి ధర రూ.100కు ఎగబాకడంతో ప్రభుత్వం రాయితీపై రూ.40కే అందించేందుకు నిర్ణయించింది. మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో రాజాం, శ్రీకాకుళం, ఆమదాలవలస, కోటబొమ్మాళి రైతుబజార్లలో ప్రత్యేక విక్రయశాలలను ప్రారంభించింది. రాయితీ ఉల్లిపై పెద్దఎత్తున ప్రచారం చేయడంతో కొనుగోలుదారులు ఎగబడుతున్నారు. ఉదయాన్నే బారులుదీరుతున్నారు. కానీ కుళ్లిన ఉల్లిపాయలను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో ఉల్లిపాయల్లో సగానికిపైగా కుళ్లినవే అందిస్తున్నారని చెబుతున్నారు.


బయట మార్కెట్‌లో కొనుగోలు చేయడమే మేలని అభిప్రాయపడుతున్నారు. ఇంతవరకూ జిల్లాలో రాయితీ విక్రయ కేంద్రాల్లో 32 టన్నుల ఉల్లి సరఫరా చేసినట్టు అధికారులు చెబుతున్నారు. సోమవారం 10 టన్నులు, మంగళవారం 22 టన్నుల ఉల్లి జిల్లాకు చేరుకుంది. వీటిలో అధికంగా కుళ్లిన ఉల్లి ఉన్నట్టు మార్కెటింగ్‌ శాఖ అధికారులు, సిబ్బంది గుర్తించారు. మహారాష్ట్ర నుంచి దిగుమతి అవుతున్న నేపథ్యంలో రెండుచోట్ల లారీల్లో లోడ్‌ చేయడం వల్లే ఈ దుస్థితికి కారణమని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. 


 నీరుగారుతున్న లక్ష్యం

గత కొద్దిరోజుల నుంచి ఉల్లి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. వర్షాలతో పంటకు నష్టం వాటిల్లడం... స్థానికంగా పంట లభ్యత లేకపోవడంతో దిగుమతులపై ప్రభావం చూపింది. దీంతో ధర పెరుగుతూ వచ్చింది. ఈ నెల మొదటి వారానికి కిలో ఉల్లి రూ.40 ఉండగా...చివరి వారం నాటికి రూ.90కు చేరుకుంది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో రూ.100 పైమాటే. దసరా సమయంలో కృత్రిమ కొరత సృష్టించి మరీ కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకున్నారన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రాయితీపై ఉల్లి అందిస్తామని ప్రకటించడంతో కొనుగోలుదారులు ఎంతగానో ఆనందించారు. కానీ కుళ్లిన ఉల్లిని అంటగడుతుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన ఉల్లిని సరఫరా చేయాలని కోరుతున్నారు. 


ఉన్నతాధికారులకు నివేదించాం..బి.శ్రీనివాసరావు, మార్కెటింగ్‌ శాఖ ఏడీ, శ్రీకాకుళం

రైతుబజార్లలో అందిస్తున్న ఉల్లిలో ఎక్కువ భాగం కుళ్లిన మాట వాస్తవం. రైతుబజార్లలో క్షేత్రస్థాయిలో సందర్శించి ఉల్లిపాయలను పరిశీలించాం. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం. పాడైన ఉల్లిని పక్కన పెట్టి నాణ్యమైన ఉల్లిని అందించాలని సిబ్బందిని ఆదేశించాం. నాణ్యమైన ఉల్లిని అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2020-10-28T08:22:50+05:30 IST