కంటైనర్‌లో మంటలు

ABN , First Publish Date - 2020-10-02T08:58:42+05:30 IST

పలాస మండలం లక్ష్మీపురం టోల్‌గేట్‌ వద్ద గురువారం ఓ కంటైనర్‌లో మంటలు చెలరేగాయి. ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్‌’కు చెందిన గృహాలంకరణ సామగ్రి, టీవీలు, సెల్‌ఫోన్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి.

కంటైనర్‌లో మంటలు

‘ిఫ్లిప్‌కార్ట్‌’ సరుకులు దగ్ధం

 సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం

 లక్ష్మీపురం టోల్‌ప్లాజా వద్ద సంఘటన

పలాస/రూరల్‌, అక్టోబరు 1 :

పలాస మండలం లక్ష్మీపురం టోల్‌గేట్‌ వద్ద గురువారం ఓ కంటైనర్‌లో మంటలు చెలరేగాయి. ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్‌’కు చెందిన గృహాలంకరణ సామగ్రి, టీవీలు, సెల్‌ఫోన్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. కంటైనర్‌లో ‘ఫ్లిప్‌కార్ట్‌’ సామగ్రిని కోల్‌కత్తా నుంచి విశాఖపట్నం వైపు రవాణా చేస్తుండగా లక్ష్మీపురం టోల్‌గేట్‌ వద్ద మంటలు చెలరేగాయి. కంటైనర్‌లో ప్రమాద సూచిక లైట్ల వద్ద విద్యుత్‌ షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


దట్టంగా పొగలు వ్యాపించడంతో డ్రైవర్‌ వెంటనే అప్రమత్తమై కంటైనర్‌ను రోడ్డు పక్కన నిలిపేశారు. డ్రైవర్‌, స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. వారంతా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే 40 శాతం సామగ్రి కాలి బూడిదైంది. మిగిలిన సరుకులు తీసే క్రమంలో నీటిలో తడిసి ముద్దయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.20 లక్షల మేరకు ఆస్తినష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు.


కాలిపోయిన వాటిలో ఎక్కువగా చెప్పులు, షూలు, సెల్‌ఫోన్లు, స్మార్ట్‌టీవీలు, దుస్తులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం కంటైనర్‌లో ఉన్న సరకులంతా బయటకు తీసి వాటికి రక్షణ  కల్పించారు. సంఘటన స్థలానికి కాశీబుగ్గ సీఐ జి.శ్రీనివాసరావు, ఎస్‌ఐ మధుసూధనరావు చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో గుర్తించి వాహనాన్ని నిలపకపోతే భారీ ఆస్తి నష్టం జరిగేదని  కంటైనర్‌ డ్రైవర్‌, సిబ్బంది తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-10-02T08:58:42+05:30 IST