Abn logo
Jan 14 2021 @ 00:49AM

చర్మం అమోఘం

చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా సౌందర్య చిట్కాలు పాటించాలి అనుకుంటే పొరపాటు. చర్మ సౌందర్యం కోసం అందుకు తోడ్పడే నియమాలు కచ్చితంగా పాటించాలి. 


మేకప్‌: రాత్రి నిద్రకు ముందు తప్పనిసరిగా మేక్‌పను పూర్తిగా తొలగించాలి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఎక్స్‌ఫోలియేట్‌ చేయాలి. దాంతో మృతకణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతూ అడుగున ఉన్న తాజా చర్మం బయల్పడుతూ ఉంటుంది.


సన్‌స్ర్కీన్‌: ఎండగా ఉన్నా, మబ్బు పట్టినా, వర్షం కురుస్తున్నా ముఖ చర్మానికి సన్‌స్ర్కీన్‌ అప్లై చేయడం మానకూడదు. ఎంచుకునే సన్‌స్ర్కీన్‌ ఎస్‌పిఎఫ్‌ కనీసం 15కు తగ్గకుండా చూసుకోవాలి. అప్పుడే సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ దక్కుతుంది.


పోషకాలు: తాజా కూరగాయలు, పండ్లు చర్మానికి పోషణనిస్తాయి. అలాగే వేపుళ్లు, జంక్‌ఫుడ్‌, శీతలపానీయాలు చర్మానికి చేటు చేస్తాయి. కాబట్టి చర్మానికి మేలు చేసే పోషకాలను జాగ్రత్తగా ఎంచుకోవాలి.


వ్యాయామం: చర్మానికి రక్తప్రసరణ మెరుగ్గా ఉంటేనే నిగారింపు సొంతమవుతుంది. ప్రతి రోజూ చేయాలి. జాగింగ్‌, నడక, ఏరోబిక్స్‌, యోగా... మీకు నచ్చినది ఎంచుకుని కొనసాగించాలి.


నిద్ర: నిద్ర తగ్గితే చర్మం నిర్జీవంగా మారుతుంది.  కళ్ల అడుగున నల్లని వలయాలు ఏర్పడతాయి. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. మాయిశ్చరైజర్‌ రాసుకోవడం మర్చిపోకూడదు.


నీళ్లు: రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగడం వల్ల చర్మం పొడిబారదు. గ్లాసు నీళ్లలో కొన్ని చుక్కల రోజ్‌ వాటర్‌ కలిపి తాగడం వల్ల పీహెచ్‌ లెవల్‌ నిలకడగా ఉండి, చర్మం నిగారిస్తుంది.


మొటిమలను గోళ్లతో గిల్లకూడదు. రోజు మొత్తంలో కనీసం మూడు సార్లు గోరువెచ్చని నీళ్లతో ముఖం కడుక్కుంటే మొటిమలు తగ్గుతాయి.

Advertisement
Advertisement
Advertisement