ఆరు నెలల తరువాత

ABN , First Publish Date - 2022-06-12T06:38:15+05:30 IST

పింఛన దరఖాస్తులను ఏ నెలకు ఆ నెల పరిశీలించి, అర్హులకు మంజూరు చేసేవారు. ఇకపై అలా కాదట

ఆరు నెలల తరువాత

పింఛనపై సర్కారు వంచన

ఆరు అంచెల వడపోతకు ఆదేశాలు

16లోపు వెరిఫికేషన చేయాలని సూచన

జిల్లాలో 15,933 మంది ఎదురుచూపు

అనంతపురం క్లాక్‌టవర్‌, జూన 11: పింఛన దరఖాస్తులను ఏ నెలకు ఆ నెల పరిశీలించి, అర్హులకు మంజూరు చేసేవారు. ఇకపై అలా కాదట. దరఖాస్తు చేసినవారు ఆరు నెలలు ఆగాల్సి ఉంటుంది. ఇకపై జూన, డిసెంబరులో మాత్రమే కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి జగన ప్రకటించారు. ఇప్పటికే జాబితాలో ఉన్న అర్హుల్లో కొందరి పేర్లను తొలగించారు. అడిగితే.. మళ్లీ దరఖాస్తు ఇవ్వాలని సూచిస్తున్నారు. రాజకీయ జోక్యంతో వడపోత జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. గత ఏడాది డిసెంబరు నుంచి ఇప్పటి వరకు జిల్లాలో పింఛన కోసం 15,933 మంది దరఖాస్తు చేసుకున్నారు. 31 మండలాలు, 6 మున్సిపాలిటీల పరిధిలో వీరు ఎదురు చూస్తున్నారు. ఇందులో అధికంగా అనంతపురం నగర పాలకసంస్థ నుంచి 1323 ఉన్నాయి. అనంతపురం రూరల్‌ మండలం నుంచి 965 మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వలంటీరు ద్వారా సచివాలయాల్లో చేసుకున్న దరఖాస్తులను ఈ నెల 16లోపు క్షేత్రస్థాయిలో పరిశీలించి తుది జాబితా పంపాలని ప్రభుత్వం వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇదివరకే వలంటీరు, సచివాలయ కార్యదర్శి, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌ఓ, డీఆర్‌డీఏ ఏపీఎం కలిసి.. ఆరు అంచెలలో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, వడపోశారు. తొలగించేందుకు ఏ నిబంధనా పాటించని ప్రభుత్వం, కొత్త పింఛన్ల విషయంలో సవాలక్ష సాకులు వెతుకుతోందని దరఖాస్తుదారులు వాపోతున్నారు. 


జూన పింఛన వస్తుందా?

ఆనలైనలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన నుంచే పింఛన ఇస్తారా లేదా అనేది అనుమానంగా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 1వతేదీనే జిల్లాలో దరఖాస్తు చేసుకున్న 15,933 మందికి సొమ్ము ఇవ్వాలి. ఆ గడువుకూడా దాటిపోయింది. లబ్ధిదారులకు నిరాశ మిగిలింది. తిరిగి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, ప్రాసె్‌సలో ఉన్నాయని అంటున్నారు. వలంటీర్ల ద్వారా పింఛన పంపిణీ చేయడం తప్ప, సామాజిక పింఛన్ల అంశంలో ఈ ప్రభుత్వంలో కొత్తగా ఒరిగింది ఏమీ లేదని విమర్శలువస్తున్నాయి. అధికారంలోకి రాగానే పింఛన మొత్తాన్ని రూ.3 వేలకు పెంచుతామని జగన హామీ ఇచ్చారు. సీఎం ఆయ్యాక ఆ మాట మార్చారు. ఏటా రూ.250 చొప్పున పెంచుతూ నాలుగేళ్లలో రూ.3 వేలు చేస్తానని అన్నారు. ఆ హామీని కూడా తుంగలోతొక్కారు. 


కోతలే కోతలు..

కొత్త పింఛన్ల మంజూరు సంగతి పక్కన పెడితే, పాత పింఛన్లను రద్దు చేసే ప్రక్రియ మాత్రం నిరంతరం కొనసాగుతోందని బాధితులు వాపోతున్నారు. ఆరంచెల వడపోత విధానంతో లబ్ధిదారుల కంటి మీద కునుకు కరువైంది. పింఛన పొందేవారి కుటుంబంలో ఎవరైనా నగరాల్లో నివసిస్తూ ఉండి, ఎప్పుడో ఒక్కసారి ఆదాయపు పన్ను చెల్లించినా పింఛన కట్‌ చేస్తున్నారు. ఇటీవల అమ్మఒడి పథకం లబ్ధిదారులను ఇలాగా భారీగా కుదించారు. సామాజిక పింఛన్లకూ ఆరు అంచెల వడపోత అమలు చేసి, జిల్లాలో 20 వేల వరకు తొలగిస్తారని తెలుస్తోంది. గత నెలలోనే 1,327 మందిని జాబితా నుంచి తొలగించడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఎక్కడ ఉన్నా పింఛన  తీసుకునే పోర్టబులిటీ వెసులుబాటును వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే తొలగించింది. ఒకటో తేదీన సొంత ఊరిలో లేకపోతే ఆ నెల పింఛన పోయినట్లే. ఒకటో తేదీన పొరపాటున ఆస్పత్రికో, ఏదైనా కార్యక్రమానికో వెళితే.. ఆ నెల పింఛన వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వరుసగా రెండు నెలల పాటు పింఛన తీసుకోకున్నా, మూడో నెల మొత్తం కలిపి ఇచ్చే విధానాన్ని వైసీపీ రద్దు చేసింది. ఒకటో తేదీన పింఛన తీసుకుంటే సరేసరి. లేదంటే వదులుకున్నట్లే.  వరుసగా రెండు నెలలు తీసుకోకపోతే పింఛనను ఏకంగా రద్దుచేస్తున్నారు. ఈ నిబంధనలతో నగరాలు, పట్టణాల్లోని తమ పిల్లల దగ్గర ఉంటున్న వేలాది మంది లబ్ధిదారులు పింఛన్లు కోల్పోతున్నారు. 

Updated Date - 2022-06-12T06:38:15+05:30 IST