మూడు రోజుల్లో ఆరుగురి మృతి

ABN , First Publish Date - 2022-01-28T06:13:12+05:30 IST

కర్నూలు సర్వజన వైద్యశాలలో మూడు రోజుల్లో ఆరుగురు మృతి చెందడం కలకలం రేపింది.

మూడు రోజుల్లో ఆరుగురి మృతి

నలుగురు అనుమానితులు, ఇద్దరు బాధితులు..
కరోనా అనుమానితులకు సరిగా అందని వైద్యం


కర్నూలు(హాస్పిటల్‌), జనవరి 27: కర్నూలు సర్వజన వైద్యశాలలో మూడు రోజుల్లో ఆరుగురు మృతి చెందడం కలకలం రేపింది. వీరిలో నలుగురు కరోనా అనుమానితులు, ఇద్దరు బాధితులు ఉన్నారు. కొవిడ్‌ ఉధృతి కారణంగా ఆసుపత్రిలో అడ్మిట్‌ అవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జనవరి ప్రారంభంలో ఐదులోపు ఈ సంఖ్య ఉండేది. ప్రస్తుతం 89 మంది బాధితులు, 41 మంది అనుమానితులు చికిత్స పొందుతున్నారు. అయితే.. మూడు రోజుల్లో కొవిడ్‌ అనుమానిత రోగులు నలుగురు మృతి చెందడం అధికారులు, మెడిసిన్‌ వైద్యుల మధ్య వివాదంగా మారింది. అనుమానిత కేసులను శుశృత భవన్‌లో కాకుండా మరో వార్డులో పెట్టి చికిత్స అందించాలని అధికారులు వైద్యులకు తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేల నుంచి ఈ విషయంలో తీవ్ర ఒత్తిడి ఉందని, కచ్చితంగా ఆదేశాలు పాటించాలని గట్టిగా చెప్పారు. అయినా శుశృత భవన్‌లో కొవిడ్‌ పాజిటివ్‌ బాదితులతో పాటు అనుమానితులకు వైద్యం అందిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. దీనివల్ల అనుమానితులు కూడా త్వరగా వైరస్‌కు గురవుతున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 25న బండి ఆత్మకూరు మండలానికి చెందిన 55 ఏళ్ల ఓ వ్యక్తి, కోవెలకుంట్ల మండలానికి చెందిన 24 ఏళ్ల యువకుడు, 27వ తేదీన 12 ఏళ్ల బాలిక, మరో వ్యక్తి మృతి చెందారు. అలాగే కొవిడ్‌తో 25న ఒకరు, 26న ఒకరు చనిపోయారు. అనుమానిత కేసులను బూత్‌బంగ్లాలో కాకుండా మరో వార్డులకు షిఫ్ట్‌ చేసి మెరుగైన చికిత్స అందించాలని బంధువులు కోరుతున్నారు. కరోనా అనుమానితులకు సరైన వైద్యం అందడం లేదని, రోగుల ప్రాణాలంటే లెక్కే లేకుండా పోయిందని వారు ఆరోపిస్తున్నారు.

ఒక్కరోజే 1,835 కేసులు

34.04 శాతానికి చేరిన పాజిటివిటీ

జిల్లాలో గురువారం కొవిడ్‌ పాజిటివిటీ 34.04 శాతానికి ఎగబాకింది. రెండు రోజులుగా 25 శాతానికి లోపే ఉండేది. గడిచిన 24 గంటల్లో  జిల్లాలో 5,391 శాంపిల్స్‌ సేకరించగా.. రికార్డు స్థాయిలో 1,835 మందికి వైరస్‌ సోకింది. 50 మండలాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. కర్నూలు నగరంలో 364, నంద్యాల మున్సిపాలిటీల్లో 325, గోస్పాడులో 54, బనగానపల్లెలో 49 అత్యధికంగా కేసులు వెలుగు చూశాయి. బండి ఆత్మకూరులో 48, రుద్రవరంలో 47, ఉయ్యాలవాడలో 47, సీ బెళగల్‌లో 46, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 44, కౌతాళంలో 44, ఆదోని మున్సిపాలిటీలో 40, ఓర్వకల్లులో 37, డోన్‌ మున్సిపాలిటీలో 38, ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో 35, మహానందిలో 35, దొర్నిపాడులో 33, పగిడ్యాలలో 33, శిరివెళ్లలో 32, గోనెగండ్లలో 31, ఆళ్లగడ్డ రూరల్‌లో 31, ఆదోని రూరల్‌లో 28, నందికొట్కూరు మున్సిపాలిటీలో 25, కౌతాళంలో 23, నందికొట్కూరు రూరల్‌లో 23, చాగలమర్రిలో 23, కొత్తపల్లిలో 23, నంద్యాల రూరల్‌లో 23, చాగలమర్రిలో 21, కర్నూలు రూరల్‌లో 20, కోడుమూరులో 19, శ్రీశైలంలో 18, నందవరంలో 16, పాణ్యంలో 16, బేతంచెర్ల మున్సిపాలిటీలో 13, గూడూరు మున్సిపాలిటీలో 13, ఎమ్మిగనూరు రూరల్‌లో 13, సంజామలలో 12, హొళగుందలో 12, అవుకులో 12, కౌతాళంలో 11, దేవనకొండలో 11, కొలిమిగుండ్లలో 11, వెలుగోడులో 9, నంద్యాల రూరల్‌లో 9, జూపాడు బంగ్లాలో 8, పత్తికొండలో 8 గడివేములలో 7, ఆలూరు, పాములపాడులో ఆరేసి చొప్పున, చిప్పగిరి, కల్లూరు, వెల్దుర్తిలో, పెద్దకడుబూరులో నాలుగేసి చొప్పున, తుగ్గలి, ఆత్మకూరు రూరల్‌, గూడూరు రూరల్‌, ఆస్పరి, క్రిష్ణగిరిలో రెండేసి చొప్పున కేసులు నమోదయ్యాయి.

బడిపై కరోనా పంజా

వైరస్‌ బారిన విద్యార్థులు, టీచర్లు

పాఠశాలల్లో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు కొవిడ్‌ బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం గోనెగండ్ల, శిరివెళ్ల, ఓర్వకల్లు, రుద్రవరం స్కూళ్లలో కరోనా కేసులు వెలుగు చూశాయి.

గోనెగండ్లలో 11 మందికి..

గోనెగండ్ల, జనవరి 27: గోనెగండ్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు హెచ్‌ఎం నాగభూషణం తెలిపారు. దీంతో మూడు రోజుల పాటు 8వ తరగతి విద్యార్థులకు సెలవు ప్రకటించినట్లు చెప్పారు.

శిరిళ్లలో 8 మందికి..

శిరివెళ్ల, జనవరి 27: శిరివెళ్లలోని మోడల్‌ స్కూల్‌లో ఐదుగురు విద్యార్థులు, డిపెప్‌ ప్రాథమిక పాఠశాలలోని ముగ్గురు విద్యార్థులు కరోనా బారిన పడినట్లు ఇన్‌చార్జి ఎంఈవో అబ్దుల్‌ కరీం గురువారం తెలిపారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో శాంపిల్స్‌ సేకరించినట్లు వైద్యులు తెలిపారు. పాఠశాలల్లో కరోనా కేసులు రావడంతో హైపో క్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేయించి శానిటైజేషన్‌ చేయించినట్లు ఎంఈవో తెలిపారు.

ఓర్వకల్లులో 15 మంది విద్యార్థులకు..

ఓర్వకల్లు, జనవరి 27: ఓర్వకల్లు కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో 10 మందికి పాజిటివ్‌ నమోదు కావడంతో వారిని హోం ఐసొలేషన్‌కు తరలించారు. బ్రాహ్మణపల్లెలో మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో పాఠశాలకు రెండు రోజుల సెలవు ప్రకటించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఎంపీడీవో శివనాగప్రసాద్‌, ఎంఈవో సోమశేఖర్‌ తెలిపారు.

రుద్రవరంలో ఇద్దరికి..

రుద్రవరం, జనవరి 27: రుద్రవరం కస్తూర్బాగాంధీ విద్యాలయంలో ఇద్దరు విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌ నమోదైనట్లు వైద్యురాలు గాయత్రి తెలిపారు. ప్రజలు మాస్క్‌ ధరించి భౌతికదూరం పాటించాలని అన్నారు.

Updated Date - 2022-01-28T06:13:12+05:30 IST