అప్ఘన్‌‌లో క్లిష్ట పరిస్థితి.. అఖిలపక్ష సమావేశంలో కేంద్రం

ABN , First Publish Date - 2021-08-26T20:14:16+05:30 IST

తాలిబన్లు స్వాధీనం చేసుకున్న అప్ఘనిస్థాన్‌లో ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశంలో రాజకీయ పార్టీల

అప్ఘన్‌‌లో క్లిష్ట పరిస్థితి.. అఖిలపక్ష సమావేశంలో కేంద్రం

న్యూఢిల్లీ: తాలిబన్లు స్వాధీనం చేసుకున్న అప్ఘనిస్థాన్‌లో ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేసింది. సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉంటున్న భారతీయులను వెనక్కి తీసుకురావడానికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంది. ప్రస్తుతం కొనసాగుతున్న తరలింపు ప్రక్రియను కూడా విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ సమావేశంలో పాల్గొన్న పార్లమెంటరీ పార్టీ నేతలకు గురువారంనాడు పార్లమెంట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో వివరించారు. జైశంకర్‌తో పాటు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ సమావేశంలో పాల్గొన్నారు.


సాధ్యమైనంత త్వరగా అప్ఘన్‌లోని భారతీయులను వెనక్కి తీసుకువచ్చే ప్రక్రియ కొనసాగుతోందని, దీనికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రులు ఈ సందర్భంగా సమావేశంలో పేర్కొన్నారు. దోహా ఒప్పందాలకు తాలిబన్లు బేఖాతరు చేసినట్టు కూడా ప్రభుత్వం వివరించింది. అప్ఘన్ సమాజంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం.. మతపరమైన స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి కట్టుబడాలని దోహా ఒప్పందం చెబుతోంది. తాలిబన్ నేతలు, అమెరికా మధ్య 2020 ఫిబ్రవరిలో ఈ ఒప్పందం జరిగింది.


అప్ఘన్ పరిస్థితి, కేంద్రం తీసుకుంటున్న చర్యలపై ఏర్పాటు చేసిన ఈ అఖిలపక్ష సమావేశంలో ఎన్‌సీపీ నేత శరద్ పవార్, రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీకర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, అప్నాదళ్ ఎంపీ అనుప్రియ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఆప్ఘనిస్థాన్‌లో భారత రాయబారి రుద్రేంద్ర టాండన్, విదేశాంగ కార్యదర్శి హర్ష ష్రింగ్లే కూడా హాజరయ్యారు. అప్ఘన్‌లో నెలకొన్న పరిస్థితిని అన్ని రాజకీయ పార్టీలకు వివరించాల్సిందిగా కేంద్ర విదేశాంగ శాఖను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆదేశించారు.

Updated Date - 2021-08-26T20:14:16+05:30 IST