Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 6 2021 @ 16:45PM

నాగాలాండ్ ఘటనపై సిట్..30 రోజుల్లో నివేదిక: లోక్‌సభలో అమిత్‌షా

న్యూఢిల్లీ: నాగాలాండ్‌లో తీవ్రవాదులనుకొని సైన్యం జరిపిన కాల్పుల్లో 14 మంది పౌరులు మరణించిన ఘటనపై 'సిట్' దర్యాప్తునకు ఆదేశించామని, 30 రోజుల్లోగా దర్యాప్తును 'సిట్' పూర్తి చేయాల్సి ఉంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు. నాగాలాండ్ దుర్ఘటనపై సోమవారం సాయంత్రం లోక్‌సభలో అమిత్‌షా ప్రకటన చేశారు. ఘటన పూర్వాపరాలను సభకు తెలియజేశారు. నాగాలాండ్ ఘటనలో 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై కేంద్రం విచారం వ్యక్తం చేస్తోందని అన్నారు.

ఘటన వివారాలను అమిత్‌షా సభకు వివరిస్తూ...''ఒటింగ్ ప్రాంతంలో తీవ్రవాదుల కదలికలపై సైన్యానికి సమాచారం అందింది. ఆ సమాచారం ఆధారంగా 21 మంది కమండోలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అక్కడికి ఒక వాహనం రావడంతో, దానిని ఆపాలంటూ కమెండోలు సంకేతాలు ఇచ్చినప్పటికీ వాహనం ముందుకు వెళ్లిపోయింది. తీవ్రవాదాలను ఆ వాహనంలో తీసుకు వెళ్తున్నారనే అనుమానంతో సైన్యం కాల్పులు జరిపింది. దీంతో ఆ వాహనంలోని 8 మందిలో ఆరుగురు మృతి చెందారు. అయితే, ఆ తర్వాతే తీవ్రవాదులనుకుని పొరపాటుగా పౌరులపై కాల్పులు జరిపినట్టు నిర్ధారణ అయింది. వాహనంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆర్మీ హెల్త్ కేర్ సెంటర్‌కు తరలించారు. పౌరులు చనిపోయారనే సమాచారం తెలియగానే స్థానికులు ఆర్మీ యూనిట్‌ను చుట్టుముట్టి వారిపై దాడికి దిగారు. రెండు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ దాడిలో ఒక భద్రతా జవాను మృతి చెందగా, పలువురు జవాన్లు గాయపడ్డారు. ఆత్మరక్షణ కోసం, మూకను చెదరగొట్టేందుకు సైన్యం కాల్పులకు దిగడంతో మరో ఏడుగురు పౌరులు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. పరిస్థితిని స్థానిక యంత్రాంగం, పోలీసులు అదుపులోకి తెస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నా అదుపులోనే ఉంది. ఘటనా స్థలిని నాగాలాండ్ డీజీపీ, కమిషనర్‌లు ఆదివారంనాడు సందర్శించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉఁచుకుని దర్యాప్తును రాష్ట్ర క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించాం. సిట్ ఏర్పాటు చేశాం. నెలరోజుల లోపు దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చాం'' అని అమిత్‌షా లోక్‌సభకు తెలియజేశారు.

Advertisement
Advertisement