ఇదేం.. ‘తీరు’వా

ABN , First Publish Date - 2022-07-15T06:08:16+05:30 IST

సాగు పనులు మొదలయ్యాయి. పెట్టుబడుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సేద్యం కలిసి రాక అప్పులపాలయ్యారు.

ఇదేం.. ‘తీరు’వా

పెట్టుబడుల వేళ రైతులపై శిస్తు భారం

వడ్డీ సహా చెల్లించాలంటూ అధికారుల ఒత్తిడి

మెట్టభూమి రైతులూ నీటి తీరువా కట్టాలని పట్టు

ఆరేళ్లుగా పట్టించుకోకుండా ఇప్పుడు వసూళ్లపై దృష్టి

సాగునీరు అందకుండా ఎలా కడతామంటున్న రైతులు

జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.18 కోట్ల బకాయిలు

బాపట్ల, జూలై 14 (ఆంధ్రజ్యోతి): సాగు పనులు మొదలయ్యాయి. పెట్టుబడుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సేద్యం కలిసి రాక అప్పులపాలయ్యారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా ఉండాలి. కాని అదనంగా శిస్తు భారం వేస్తోండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   కొన్ని చోట్ల ఆయకట్టుకు సాగునీరు అందకపోయినా తీరువా చెల్లించాల్సిందేనని రెవెన్యూ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. అసలే పెట్టుబడులకు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఉరుములేని పిడుగులా నీటి తీరువా భారం రైతులపై పడింది.  బకాయిలను వడ్డీ సహా చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. శిస్తు వసూళ్లకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలపై ఇదేం తీరు అని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు రూ.18 కోట్లు శిస్తు బకాయిలు ఉన్నాయి. ఆరేళ్లుగా రెవెన్యూ విభాగం నిర్లక్ష్యంగా ఉండి ఇప్పుడు మేల్కొని ఉన్నపళాన ఒత్తిడి తేవడంపై   రైతులు తప్పు పడుతున్నారు. మెట్టభూమిగా నిర్ధారించిన దానికి కూడా నీటి తీరువా కట్టాలని జాబితా రూపొందించారు. సాగునీటి ప్రాజెక్టు కాల్వలున్న ప్రాంతాలలో ఆయకట్టు విస్తీర్ణాన్ని గణించి వాటికి మాత్రమే నీటి తీరువా వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ అలాకాకుండా ఆయా కాల్వల ప్రాంత పరిధిలోని సర్వే నెంబర్ల ఆధారంగా అందరికీ నోటీసులు ఇవ్వడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

వసూళ్లకు ప్రత్యేక బృందాలు

కొన్నేళ్లుగా ఆశించిన స్థాయిలో నీటి తీరువా వసూలు జరగకపోవడంతో ఈసారి లక్ష్యాలను విధించుకుని ప్రత్యేక బృందాలతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. వాస్తవానికి అక్టోబరు, మార్చి నెలల్లో ఈ వసూలు ప్రక్రియను చేపడతారు. కానీ ప్రభుత్వం ఈ సారి దీనిని నిరంతర ప్రక్రియగా చేపట్టి సాధ్యమైనంత మేర బకాయిలు వసూలు చేయాలని చూస్తోంది.  జిల్లా వ్యాప్తంగా సాగర్‌ ఆయకట్టు కింద 1.10 లక్షల ఎకరాలు ఉండగా, కొమ్మమూరు కాలువ కింద 1.72 లక్షల ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంది. వీటి పరిధిలో నీటి లభ్యతపై నమ్మకం లేక చాలామంది రైతులు మెట్ట పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం ఆదాయ మార్గాల అన్వేషణలో భాగంగా నీటి తీరువాపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

చెల్లించడానికీ అగచాట్లు

నీటి తీరువా చెల్లించడానికి ముందుకు వచ్చే రైతులకు కూడా ఆన్‌లైన్‌ అగచాట్లు ఎదురవుతున్నాయి. రైతులు వీఆర్వోల వద్దకు వెళితే సచివాలయాల దగ్గరకు వెళ్లమని చెబుతున్నారని రైతులు అంటున్నారు. అక్కడికెళ్తే సర్వర్‌ సమస్యలు ఉన్నాయనే సమాధానం వస్తోందని అన్నదాతలు చెబుతున్నారు. వ్యవసాయ పనుల వేళ తామురోజుల తరబడి శిస్తు కట్టడానికి తిరగలేక పోతున్నామని రైతులు వాపోతున్నారు. ఉన్న రాయితీలకు మంగళం పాడిన ప్రభుత్వం ఈ కాస్త మొత్తాలకు తమ వెంటబడడం భావ్యం కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికంగా ఈ ప్రక్రియను వాయిదా వేసుకుని దిగుబడులు వచ్చేటప్పుడు మొదలుపెట్టాలని రైతులు కోరుతున్నారు. వడ్డీ విషయంలో కూడా ప్రభుత్వం పునరాలోచించాలని అభ్యర్థిస్తున్నారు. 


Updated Date - 2022-07-15T06:08:16+05:30 IST