Abn logo
Jun 13 2021 @ 23:49PM

సింగూరు గలగల

నాలుగు రోజులుగా ప్రాజెక్టులోకి కొత్త నీరు 

12,607 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోనమోదు 

ప్రాజెక్టులో 17.243 టీఎంసీలు


పుల్‌కల్‌, జూన్‌ 13 : నైరుతి రుతుపవనాల ప్రభావంతో సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పుల్కల్‌ మండలం సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. నాలుగు రోజులుగా ప్రాజెక్టులోకి 12,607 క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 523.600 మీటర్లకు 29.917 టీఎంసీలు. ఆదివారం నాటికి 520.709 మీటర్లకు 17.243 టీఎంసీల నీటిమట్టాన్ని కలిగి ఉన్నది. ప్రాజెక్టుకు ఎగువన ఉన్న మునిపల్లి, ఝరాసంగం, రాయికోడ్‌, న్యాల్‌కల్‌, మనూరు, నాగల్‌గిద్ద, రేగోడు, వట్‌పల్లి మండలాల్లో భారీ వర్షం నమోదు కావడంతో ఆ వరద నీరంతా ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌లో కలుస్తున్నది. ఈ నెల 10వ తేదీన 879 క్యూసెక్కులు, 11న 5,972 క్యూసెక్కులు, 12న 3,640 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరగా, ఆదివారం ఉదయం నాటికి 2,116 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. నీటి పారుదల శాఖ ఏఈ మజార్‌ తెలిపారు. వరద నీటి ప్రవాహం రాకముందు ప్రాజెక్టులో 16.5 టీఎంసీల నీటి నిల్వలు ఉండగా, తాజాగా కురిసిన వర్షాలకు దాదాపుగా అర టీఎంసీకిపైగా కొత్త నీరు వచ్చి చేరింది. వానాకాలం ప్రారంభంలోనే ప్రాజెక్టులో సగం టీఎంసీల నీరు ఉండడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కొత్తగా వచ్చి చేరిన వరద నీటితో ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ పరిసరాలు అలలతో కనువిందు చేస్తున్నాయి.


నల్లవాగులోకి మరో మూడు అడుగులు 

కల్హేర్‌, జూన్‌ 13 : సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండల పరిధిలోని నల్లవాగు ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం వరకు మరో మూడు అడుగుల వరద నీరు చేరింది. దీంతో 1487 అడుగులకు నీటిమట్టానికి చేరుకున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1493 అడుగులు. ప్రాజెక్టులోకి 1353 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు నీటి పారుదల శాఖ ఏఈ సూర్యకాంత్‌ తెలిపారు. మండలంలోని వాసర్‌చెరువు, ఉజ్లంపాడ్‌ ప్రాజెక్టు అలుగు పొంగిపొర్లింది. కల్హేర్‌ మండలంలోని మహరాజు, కాకి వాగులు పారుతుండడంతో రైతులు ఆనందం వ్యక్త చేస్తున్నారు.