సింగరేణిలో భారీ కుంభకోణం

ABN , First Publish Date - 2022-03-15T07:58:02+05:30 IST

సింగరేణిలో భారీ కుంభకోణం జరుగుతోందని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు..

సింగరేణిలో భారీ కుంభకోణం

  రూ.50 వేల కోట్ల స్కామ్‌ జరగబోతోంది

  కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు టెండర్‌ అప్పగించే యత్నం

 ప్రధాని మోదీకి ఎంపీ కోమటిరెడ్డి ఫిర్యాదు


న్యూఢిల్లీ, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో భారీ కుంభకోణం జరుగుతోందని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు. సోమవారం పార్లమెంటు భవనంలో ప్రధానిని ఆయన కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సింగరేణిలో రూ.50 వేల కోట్ల అవినీతి జరగబోతోందని, కోల్‌ ఇండియా మార్గదర్శకాలను పక్కనబెట్టి సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు మైనింగ్‌ టెండర్‌ అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ప్రధానికి చెప్పినట్లు తెలిపారు. దీంతో తప్పకుండా చర్యలు ఉంటాయని ప్రధాని అన్నారని చెప్పారు. ఇదేకాకుండా.. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ఆధారాలతో సహా ప్రధానికి వివరించానని, ఏయే రంగాల్లో అవినీతి జరుగుతోందో ప్రధాని అడిగి తెలుసుకున్నారని, తెలంగాణపై దృష్టి పెడతామని చెప్పారని తెలిపారు. నమామీ గంగ తరహాలో మూసీ ప్రక్షాళన చేపట్టాలని కోరానన్నారు. హైదరాబాద్‌-విజయవాడ ఆరు లైన్ల రహదారి నిర్మాణంపై కూడా ప్రధానితో చర్చించానని, జీఎంఆర్‌ సంస్థ రహదారి నిర్మాణం చేపట్టకుండా ఆర్బిట్రేషన్‌కు వెళ్లి మొండిగా వ్యవహరిస్తోందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిందిగా ప్రధానికి విజ్ఞప్తి చేశానని వెల్లడించారు. మంగళవారం ఈ రహదారి అంశంపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సమీక్షించనున్నట్లు చెప్పారు. కొమురవెల్లి-యాదగిరిగుట్ట-రాయగిరి-మోత్కూరు రోడ్డును, నల్లగొండ-మల్లేపల్లి, భువనగిరి- చిట్యాల రోడ్లను జాతీయ రహదారిగా ప్రకటించాలని కోరానన్నారు. తన విజ్ఞప్తులకు ప్రధాని సానుకూలంగా స్పందించారని తెలిపారు. 

Updated Date - 2022-03-15T07:58:02+05:30 IST