కోవిడ్ డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సరళతరం చేయాలి.. కేంద్రానికి సుప్రీం ఆదేశం

ABN , First Publish Date - 2021-06-21T20:58:59+05:30 IST

కోవిడ్‌తో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షలు ఎక్స్‌గేషియా ఇచ్చేలా కేంద్రాన్ని..

కోవిడ్ డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సరళతరం చేయాలి.. కేంద్రానికి సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: కోవిడ్‌తో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షలు ఎక్స్‌గేషియా ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు సోమవారంనాడు రిజర్వ్ చేసింది. న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎం.ఆర్ షాలతో కూడిన ధర్మాసనం రెండు గంటల సేపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ అడ్వకేట్ ఎస్.బీ.ఉపాధ్యాయ్, ఇతర లాయర్ల వాదనలు వింది. సంబంధిత పార్టీలు మూడు రోజుల్లోగా లిఖిత పూర్వక సబ్మిషన్లు కోర్టుకు అందజేయాలని ధర్మాసనం పేర్కొంది. కోవిడ్‌తో మరణించిన వారి డిపెండెంట్లకు డెత్ సర్టిఫికెట్ జారీ ప్రక్రియను సరళతరం చేయాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించారు.


కాగా, దీనికి ముందు కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేమని అత్యున్నత న్యాయస్థానానికి కేంద్రం తెలియజేసింది. ప్రకృతి విపత్తుల కారణంగా మరణించిన వారికి మాత్రమే పరిహారం చెల్లింపు వర్తిస్తుందని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఒడిదుడుకుల్లో ఉన్నందున కోవిడ్ మృతులు ప్రతి ఒక్కరికీ పరిహారం చెల్లించడం కుదరదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు 183 పేజీల అఫిడవిట్‌ను సమర్పించింది. కొవిడ్‌ బారిన పడి మరణించిన వారందరికీ ఆ విషయాన్ని మరణ ధ్రువీకరణ పత్రాల్లో నమోదు చేస్తామని కేంద్రం తెలిపింది. కరోనాతో ఇంట్లో, ఆస్పత్రుల్లో, ఇంకెక్కడ మరణించినా అటువంటి వారికి ‘కొవిడ్‌తో మరణించినట్లు’గా ధ్రువీకరణ పత్రాల్లో నమోదు చేస్తామని చెప్పింది. ధ్రువీకరణ పత్రం ఇవ్వని వైద్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.


కాగా, పిటిషన్‌దార్లలో ఒకరైన అడ్వకేట్ గౌరవ్ కుమార్ బన్సాల్ తన వాదన వినిపిస్తూ, డిజాస్టర్ మేనేజిమెంట్ చట్టం-2005లోని సెక్షన్ 12(iii) కింద, వైపరీత్యాలతో మృతిచెందిన ప్రతి ఒక్క కుటుంబం రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియాకు అర్హమైనట్టు చెప్పారు. కోవిడ్‌ను ప్రకృతి వైపరీత్యంగా 2015 ఏప్రిల్ 9న ఇచ్చిన ఉత్తర్వు ఇచ్చారని, అందువల్ల కోవిడ్ మృతులందరి కుటుంబాలు నష్టపరిహారానికి అర్హమైనవేనని అన్నారు. మరో పిటిషనర్ రీపక్ కాన్సల్ తరఫున హాజరైన న్యాయవాది తన వాదన వినిపిస్తూ, కోవిడ్ వల్ల పెద్దసంఖ్యలో మృతిచెందారని, వారి కుటుంబాలకు డెత్ సర్టిఫికెట్లు జారీ చేయాల్సిన అవసరం ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ తర్వాత మాత్రమే సెక్షన్ 12 (iii) కింద పరిహారాన్ని క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కోవిడ్ మృతులు, వారి కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా రాష్ట్రాలను సైతం ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.

Updated Date - 2021-06-21T20:58:59+05:30 IST