27 తమిళనాడు బస్సుల సీజ్‌

ABN , First Publish Date - 2021-01-16T06:59:41+05:30 IST

సరైన ధ్రువప త్రాలు లేని కారణంగా తమిళనాడుకు చెందిన 27 బస్సులను శుక్రవారం ఆర్టీవో అధికారులు సీజ్‌ చేశారు.

27 తమిళనాడు బస్సుల సీజ్‌
అధికారులు సీజ్‌ చేసిన తమిళనాడు బస్సులు

చిత్తూరు జనవరి 15: సరైన ధ్రువప త్రాలు లేని కారణంగా తమిళనాడుకు చెందిన 27 బస్సులను శుక్రవారం ఆర్టీవో అధికారులు సీజ్‌ చేశారు. ఇందులో ఆ రాష్ట్రానికి చెందిన 18 ఆర్టీసీ బస్సులు ఉండటం గమనార్హం. సాధారణంగా ప్రైవేట్‌ బస్సులనే ఎక్కువగా సీజ్‌ చేస్తుంటారు. కానీ తమిళనాడు ఆర్టీసీ బస్సులను సీజ్‌ చేయడం వెనుక ఓ చిన్న సంఘటన ఉందని ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లు చెబుతున్నారు. 


ఏపీ బస్సులను వదల్లేదనే..!

తిరుపతి, చిత్తూరు నుంచి వేలూరుకు నిత్యం పదుల సంఖ్యలో ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులు నడుస్తుంటాయి. అయితే వేలూరు బస్టాండులో ఏపీ ఆర్టీసీ బస్సులు ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులను తరలిస్తున్నారని, టైమింగ్‌ కూడా పాటించడం లేదని తమిళనాడు ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్టుకు చెందిన వ్యక్తి అక్కడి ఆర్టీవో అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో బుధవారం తమిళనాడు ఆర్టీవో అధికారులు వేలూరు బస్టాండులో తనిఖీ చేశారు. పర్మిట్‌ ఉన్నప్పటికీ డిస్‌ప్లే చేయని కారణంగా చిత్తూరు రెండో డిపోకు చెందిన మూడు బస్సులను సీజ్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రాకు చెందిన ఆర్టీసీ, ఆర్టీవో అధికారులు గురువారం వేలూరు ఆర్టీవో కార్యాలయానికి వెళ్లారు. సీజ్‌ చేసిన బస్సులకు చెందిన పర్మిట్‌ పత్రాలను చూపించారు. అయినా అక్కడి అధికారులు ఏపీ బస్సులను వదల్లేదు. పైగా రెండ్రోజులు ఆగి రమ్మన్నారు. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేసినట్లు సమాచారం. చిత్తూరులో 11, కుప్పంలో ఆరు, పుత్తూరులో 10 తమిళనాడుకు చెందిన బస్సులను సీజ్‌ చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ బస్సుల్లో తరలించారు. ఈ సీజ్‌ విషయం తెలిసిన వెంటనే ఏపీ బస్సులను తమిళనాడు ఆర్టీవో అధికారులు రిలీజ్‌ చేయడం కొసమెరుపు.

Updated Date - 2021-01-16T06:59:41+05:30 IST