రైతు సరుకు మాయం..

ABN , First Publish Date - 2022-05-27T05:54:02+05:30 IST

రబీ సీజన్‌లో సాగుచేసిన శనగ పంట దిగుబడికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టింది. కొనుగోళ్ల

రైతు సరుకు మాయం..

ఏఎంసీ ద్వారా ప్రభుత్వం కొనుగోళ్లు

గోడౌన్‌ చేరకుండా పక్కదారి పట్టిన శనగలు

ఇష్టానుసారంగా తరుగు

నష్టపోతున్న రైతులు

అధికారుల మౌనమేల... !?


రేయింబవళ్లు కష్టపడి సాగుచేసిన పప్పుశనగ పంట దిగుబడికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేస్తోంది. అయితే సరుకు గోడౌన్‌ చేరకుండా మాయం అవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వీరి సరుకును ఏ దొంగలో దోచుకెళ్లలేదు. గిట్టుబాటు ధర కల్పన పేరుతో కొంతమంది సిబ్బంది పక్కాగా పక్కదారి పట్టించారు. దీంతో రైతులు నష్టపోతున్నారు. దీనికి తోడు కొనుగోలు కేంద్రాల వద్ద తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారు.


ప్రొద్దుటూరు, మే 26: రబీ సీజన్‌లో సాగుచేసిన శనగ పంట దిగుబడికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టింది. కొనుగోళ్ల బాధ్యతను ఏపీ మార్క్‌ఫెడ్‌కు అప్పగించగా నిర్వహణ బాధ్యతను వ్యవసాయ మార్కెట్‌ కమిటీ(ఏఎంసీ)లకు అప్పజెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పప్పుశనగ క్వింటాకు రూ.5,230 ధర చెల్లించాల్సి ఉంది. కానీ కమలాపురం ఏఎంసీ పరిధిలో కొనుగోళ్లు మొదలు పెట్టినా సరుకును ప్రైవేటు వ్యక్తుల వద్దకు చేర్చినట్టు సమాచారం. ఈ క్రమంలో పెండ్లిమర్రి, వల్లూరు మండలాల్లోని పలు గ్రామాల రైతులకు సంబంధించిన శనగలు గోడౌన్‌కు చేరకుండా పక్కదారి పట్టాయి. క్షేత్రస్థాయిలో సరుకు ప్రభుత్వ సంస్థలకు విక్రయించిన తర్వాత బ్యాంకు ఖాతాలో డబ్బు పడుతుందని రైతులు ఎదురుచూస్తుంటారు. మధ్యలో అక్రమాల గురించి ఎవరూ ఊహించరు. రైతు నమ్మకాన్ని వమ్ము చేస్తూ వల్లూరు మండలంలో శనగలను మాయం చేయడం వెలుగులోకి వచ్చింది. దీంతో రైతులు కొనుగోళ్ల సమయంలో తమకిచ్చిన రశీదులను మార్క్‌ఫెడ్‌ కార్యాలయానికి వెళ్లి పరిశీలించుకోవడం మొదలు పెట్టారు.


రైతు అనుమానం నిజమే

రైతుల అనుమానాలు నిజం అనిపించేలా అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. పెండ్లిమర్రి మండలంలోని ఓ గ్రామానికి సంబంధించిన రైతుల శనగలు వంద క్వింటాళ ్లకుపైగా పక్కగారి పట్టినట్లు సమాచారం. దీంతో వాస్తవాలు వెలుగులోకి రాకుండా సంబంధిత రైతులతో రాజీ కుదుర్చుకుని డబ్బు కట్టినట్లు తెలుస్తోంది. అదే విధంగా వల్లూరు మండలంలోని సీతోరుపల్లెకు చెందిన రైతు వద్ద 22.5 క్వింటాళ్ల శనగలు కొనుగోలు చేశారు. కానీ గోదాము చేరలేదు. దీంతో ఆ రైతుకు రావాల్సిన శనగల ఖరీదు రూ.1.17 లక్షలు నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఈ విషయంలో కూడా పంచాయితీ చేసుకుని రైతుకు డబ్బు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయంలో మార్కెట్‌ కమిటీ కార్యదర్శి వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడైనా రైతుకు సంబంధించిన సరుకు గోదాముకు చేరకపోతే వెంటనే చట్టపరమైన చర్యలకోసం పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం బాధిత రైతుకు 15 రోజులలోపు తాను చెల్లించగలనని ఏఎంసీ కార్యదర్శి సుబ్బనరసింహులు అంగీకార పత్రం మార్క్‌ఫెడ్‌ అదికారులకు ఇవ్వడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


ఇష్టానుసారంగా తరుగు

దళారి వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తూకాల్లో మోసాలను నిలువరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ శనగల కొనుగోళ్లలో ఇష్టానుసారంగా తరుగు పేరుతో రైతు కష్టాన్ని దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల కొంతమంది రైతులు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. క్వింటాకు పది కిలోలు తరుగు తీయడం ఏమిటని ఆయన మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌కు ఫోన్‌ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 38 కొనుగోళ్ల కేంద్రాల ద్వారా 5,367 మంది రైతులకు సంబందించిన 85,481.5 క్వింటాళ్ల పప్పుశనగలు కొనుగోలు చేసినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి.


క్వింటాకు రూ.150 మమూళ్లు

ఇదిలా ఉంటే ప్రభుత్వం గిట్టుబాటు ధరతో రైతులను ఆదుకోవాల్సి ఉంది. అయితే నిబంధనలు, నాణ్యత ప్రమాణాల సాకు చూపుతూ అధికారులు అక్రమ వసూళ్లకు తెరలేపుతున్నారు. జిల్లాలో పలు చోట్ల ఈ పరిస్థితులు ఉన్నట్లు రైతులు వాపోతున్నారు. కమలాపురం మార్కెట్‌ కమిటీ పరిధిలో రైతులు నుంచి శనగలు అమ్మాలంటే క్వింటాకు రూ.150 మామూళ్లు చెల్లించాల్సిందే. రైతు ఇంటి వద్ద నుంచి శనగలు సచివాలయం వద్దకు తరలించాలంటే ట్రాక్టర్‌ బాడుగ కింద మరో రూ.500 వసూలు చేసినట్లు సమాచారం. బహిరంగ మార్కెట్‌లో క్వింటా శనగలు రూ.4,500 వరకు ధర ఉంది. ప్రభుత్వం మద్దతు ధర కింద రూ.5,230 చెల్లిస్తుండడంతో అధిక సంఖ్యలో రైతులు కొనుగోలు కేంద్రాలకు బారులు తీరారు. వీరపునాయునిపల్లె మండలంలో తామే సంచులు సమకూర్చుకోగా క్వింటాకు 10 కిలోలు తరుగు వదులుకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.


అధికారుల మౌనమేల...

ఒకపక్క కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, స్వయంగా ఒక ఏఎంసీ కార్యదర్శి ఒప్పుకుంటూ బాధిత రైతుకు తాను డబ్బు చెల్లిస్తానని ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా పత్రం ఇచ్చినా చర్యలు తీసుకోకుండా మౌనం వహించడం విమర్శలకు తావిస్తోంది. కొనుగోలు కేంద్రాల వద్ద తరుగు పేరుతో రైతులను నిలువునా దోచుకుంటుంటే అధికారులు ఏమి చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయమై మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ పరిమళజ్యోతిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా కమలాపురం ఏఎంసీ పరిధిలో జరిగిన అక్రమాలను మార్కెటింగ్‌ శాఖ ఏడీ దృష్టికి తీసుకెళ్లానన్నారు. మార్కెటింగ్‌ శాఖ ఏడీ హిమశైలజను వివరణ కోరగా అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని, రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2022-05-27T05:54:02+05:30 IST