Siachen hero: 38 ఏళ్ల తర్వాత బంకర్‌లో కనిపించిన సియాచిన్ వీరుడి కళేబరం!

ABN , First Publish Date - 2022-08-15T00:44:39+05:30 IST

తెల్లదొరల కబంధ హస్తాల నుంచి భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని ప్రసాదించేందుకు ఎంతోమంది వీరులు

Siachen hero: 38 ఏళ్ల తర్వాత బంకర్‌లో కనిపించిన సియాచిన్ వీరుడి కళేబరం!

న్యూఢిల్లీ: తెల్లదొరల కబంధ హస్తాల నుంచి భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని ప్రసాదించేందుకు ఎంతోమంది వీరులు అసువులుబాసారు. దేశానికి స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశం మొత్తం వజ్రోత్సవాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నాడు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకుంటోంది. ఓ వైపు ఇలా ఉంటే, మరోవైపు 38 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన సియాచిన్ వీరుడి మృత అవశేషాలు తాజాగా లభ్యమయ్యాయి. ఆ అవశేషాలు లాన్స్ నాయక్ చంద్రశేఖర్‌(Lance Naik Chandra Shekhar)విగా గుర్తించారు.


ఆయనది ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ. 1984లో సియాచిన్‌లో నిర్వహించిన ఆపరేషన్ మేఘ్‌దూత్‌(Meghdoot)లో పాల్గొన్నాడు. ఈ నెల 13న సియాచిన్ గ్లేసియర్‌లోని ఓ పాత బంకర్‌లో ఆయన మృత కళేబరం లభించింది. చంద్రశేఖర్ అవశేషాలు లభించినట్టు తెలియడంతో ఆయన భార్య (65), ఇద్దరు కుమార్తెల 38 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. చంద్రశేఖర్ కుటుంబం మాత్రమే కాదు ఆయన యూనిట్‌లోని వారు, బంధువులు ఇప్పుడు ఈ వీరుడికి తుది వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నారు. 


హల్దవానీలో నిర్వహించే చంద్రశేఖర్ అంత్యక్రియలకు పెద్ద ఎత్తున హాజరవుతారని అంచనా వేస్తున్నారు. చంద్రశేఖర్ అసువులు బాసినప్పుడు ఆయన ఇద్దరు కుమార్తెలు చిన్నపిల్లలు. చిన్నమ్మాయి వయసు నాలుగు, పెద్దమ్మాయి వయసు 8 సంవత్సరాలు.  పాయింట్ 5965‌ను స్వాధీనం చేసుకునే పనిని లాన్స్ నాయక్ చంద్రశేఖర్ బృందానికి పై అధికారులు అప్పగించారు. ఈ పాయింట్‌పై పాకిస్థాన్ కూడా కన్నేసింది. ఈ పాయింట్‌ను ఇండియన్ ఆర్మీ ముందే ఖాళీ చేసింది. 19 కుమోవన్ రెజిమెంట్‌కు చెందిన బృందం దీనిని స్వాధీనం చేసుకోవడానికి బయలుదేరింది. అందులో లాన్స్ నాయక్ చంద్రశేఖర్ కూడా ఉన్నారు. 


సియాన్ గ్లేసియర్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఆపరేషన్ మేఘ్‌దూత్‌లో భాగంగా 29 మే 1984లో జరిగిన తొలి ఆపరేషన్ ఇదే.  అయితే, ఆ రాత్రి ఈ బృందం హిమపాతంలో చిక్కుకుంది. ఈ ఘటనలో ఒక అధికారి, సెకండ్ లెఫ్టినెంట్ పీఎస్ పుండిర్ సహా 18 మంది మరణించారు. ఈ ఘటన తర్వాత 14 మంది మృతదేహాలను గుర్తించగా ఐదుగురు గల్లంతయ్యారు. 


తాజాగా, ఈ నెల 13న సియాచిన్‌లో 16వేల అడుగుల ఎత్తున ఓ సైనికుడి అస్తిపంజర అవశేషాలను గుర్తించారు. వాటి పక్కనే ఆర్మీ నంబరుతో కూడిన డిస్క్ కూడా పడి ఉండడంతో ఆ అవశేషాలు లాన్స్ నాయక్ చంద్రశేఖర్‌వేనని నిర్ధారించారు. వేసవిలో మంచు కరుగుతూ ఉండడంతో గల్లంతైన వారి మృతదేహాల కోసం వెతికే పని సైనికులకు అప్పగిస్తుంటామని అధికారి ఒకరు తెలిపారు. సియాచిన్ గ్లేసియర్‌లోని ఓ పాత బంకర్‌లో చంద్రశేఖర్ అవశేషాలు లభించినట్టు ఆయన పేర్కొన్నారు. 


ఆపరేషన్ మేఘదూత్ ద్వారా సియాచిన్ గ్లేసియర్‌ను స్వాధీనం చేసుకుని, పాకిస్థాన్ స్థావరాలపై పూర్తి భారత సైన్యం పూర్తి ఆధిపత్యం సాధించింది. ఇండియన్ ఆర్మీ ఇప్పటి వరకు చేపట్టిన అత్యంత వ్యూహాత్మక సైనిక చర్యలలో ఇది ఒకటిగా నిలిచింది. భారత్ నియంత్రణలోని అత్యంత కీలకమైన సియాచిన్ గ్లేసియర్.. తూర్పు కారోకోరం శ్రేణిలో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్, చైనా అధీనంలోని ప్రాంతాలైన షక్స్‌గామ్ వ్యాలీకి సరిహద్దుగా ఉంది. 

Updated Date - 2022-08-15T00:44:39+05:30 IST