పనులు షట్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-04-10T09:12:05+05:30 IST

జిల్లాలో భవన నిర్మాణం, ఆటో రవాణా, రోడ్డు పక్క వ్యాపారం, చేనేతలు, ఈవెంట్స్‌, హోటల్‌ రంగం.. ఇలా వివిధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న సామాన్యుల

పనులు షట్‌డౌన్‌

లాక్‌డౌన్‌ వల్ల గడప దాటని బడుగుజీవులు

నిలిచిపోయిన రవాణా.. భవన నిర్మాణాలు

పనులు లేక పస్తులతో గడపాల్సిన పరిస్థితి

అసంఘటిత కార్మికుల జీవనం దైన్యం

జిల్లాలో 5.28 లక్షల కుటుంబాల్లో దినదిన గండం

సామాన్యుల బతుకుల్లో కరోనా మిగిల్చిన కన్నీటి వ్యథలెన్నో..


కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు గత నెల 22 నుంచి లాక్‌డౌన్‌ అమలు చేస్తుండడంతో రవాణా స్తంభించింది. నిర్మాణ రంగం కుదేలైంది. ఇతర అన్ని రంగాలూ షట్‌డౌన్‌ అయ్యాయి. ఏ రోజుకారోజు పనిచేస్తే తప్ప పూట గడవని అభాగ్యుల బతుకులు ఛిద్రమవుతున్నాయి.


ఇప్పటికే 20 రోజులుగా పనులు లేక పస్తులు ఉంటున్నాం.. లాక్‌డౌన్‌ కాస్త సడలించి ఉపశమనం కలిగించాలని సామాన్యుల విన్నపం. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ నేపధ్యంలో పనులు లేక, ఆకలి కేకల సమరం సాగిస్తున్న సామాన్య బడుగు జీవుల కన్నీటి వ్యథలపై కథనం.


కడప, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో భవన నిర్మాణం, ఆటో రవాణా, రోడ్డు పక్క వ్యాపారం, చేనేతలు, ఈవెంట్స్‌, హోటల్‌ రంగం.. ఇలా వివిధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న సామాన్యుల కుటుంబాలు 5.28 లక్షలకు పైగానే ఉన్నాయి. వీరంతా రోజూ పనికి వెళితేనే ఇంటిల్లిపాది ఆకలి తీరేది. ఏ ఒక్క రోజు పని లేదంటే ఆ రోజు అర్ధాకలితో గడపాల్సిన దైన్య పరిస్థితి అనేక కుటుంబాల్లో ఉంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధించడానికి గత నెల 22వతేదీ నుంచి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ఆయా రంగాలు మూతబడ్డాయి.


వాటిపై ఆధారపడ్డ బడుగు జీవులు ఇల్లుదాటి బయటికి రాలేని పరిస్థితి. మనుషుల ప్రాణాలను హరించే కరోనా వైరస్‌ మహమ్మారిని తుదముట్టించాల్సిందే. అందుకు భౌతిక దూరం పాటించేందుకు లాక్‌డౌన్‌ తప్పనిసరి. అయితే.. ఏ రోజుకారోజు పనులు చేస్తే తప్ప కుటుంబం గడవని మాలాంటి సామాన్యుల పరిస్థితి ఏంటి..? అని బడుగుజీవులు ప్రశ్నిస్తున్నారు. పూట గడవక అవస్థలు పడుతున్నామని, ఇంటి అద్దె కోసం ఓనర్లు.. ఆటో యజమానులు.. తోపుడుబండ్ల ఓనర్లు ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడుపు నిండేదే కష్టంగా ఉంటే అద్దెకట్టేది ఎలా అని ఆందోళన చెందుతున్నారు.


రూ.525 కోట్లకు పైగా నష్టం

జిల్లాలో వివిధ రంగాల్లో రోజువారి కష్టంపై ఆధారపడ్డ కుటుంబాలు కార్మిక శాఖ అధికారుల అంచనా మేరకు దాదాపుగా 5.28 లక్షలు ఉన్నట్లు అంచనా. ఒక్కో కుటుంబం సగటున రోజుకు రూ.500 కూలీ రూపంలో సంపాదించే అవకాశం ఉంది. ఈ లెక్కన రోజుకు రూ.26.42 కోట్లు చొప్పున లాక్‌డౌన్‌ అమలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా రూ.550 కోట్లకు పైగా పేదలు నష్టపోయినట్లు ఓ అంచనా. ఈ మొత్తం ఎక్కువే ఉంటుంది తప్ప తక్కువ కాదని అంటున్నారు. రెక్కాడితే కానీ డొక్క నిండని పేదల ఉపాధి కోసం లాక్‌డౌన్‌ నిబంధనలు కొంత వరకైనా సడలించాలని విన్నవిస్తున్నారు.

 

పస్తులతో గడపాల్సి వస్తోంది..మన్సూర్‌, కడప

నేను బాడుగ ఆటో నడిపితే రోజుకు రూ.250 నుంచి రూ.300 వస్తుంది. 20 రోజులుగా లాక్‌డౌన్‌ వల్ల ఆటో రోడ్డెక్కడం లేదు. ఇంట్లో నలుగురం ఉన్నాం. పూట గడవాలంటే కష్టంగా ఉంది. ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సడలింపు ఇస్తే ఆటోను నడిపితే కుటుంబ పోషణకు కొంత డబ్బు అయినా వస్తుంది.


దినదిన గండం..ఓబులయ్య, మార్కెట్‌ యార్డు హమాలీ, కడప

మార్కెట్‌ హమాలీగా 28 ఏళ్లుగా పనిచేస్తున్నాను. ఐదుగురు సభ్యుల కుటుంబం. పిల్లలు చదువుకుంటున్నారు. మార్కెట్‌ జరిగితే రూ.350 - 400 హమాలీ డబ్బు వస్తుంది. కరోనా ఎఫెక్ట్‌ వల్ల మార్కెట్‌ మూసివేశారు. మార్కెట్‌ యార్డు లైసెన్స్డు హమాలీలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలి. రైతులు పంట దిగుబడులు తెచ్చేందుకు అనుమతిలివ్వాలి.


ఎలా బతకాలయ్యా..బాలనాగిరెడ్డి, భవన నిర్మాణ కార్మికుడు

నేను బేల్దారి పనికి వెళుతున్నా. నా భార్య ఇళ్లల్లో పనిచేసేందుకు వెళుతుంది. ఇద్దరం కష్టపడితే రోజు గడుస్తుంది. కరోనా రావడంతో భవన నిర్మాణ పనులు లేవు. ఇళ్లల్ల్లో పనిచేసేందుకు నా భార్య వెళతానంటే కరోనా ఉంది.. రావద్దు అంటున్నారు. దాతలు పెట్టే అన్నంతో కడుపు నింపుకుంటున్నాం.


ఇల్లు దాటలేం.. పనులు చేయలేం..వడ్డె సోమన్న, అడ్డా కూలీ, రాజంపేట

కర్నూలు జిల్లా డోన్‌ మా సొంతూరు. బతుకు దెరువు కోసం భవన నిర్మాణ పనుల కోసం ఇక్కడికి వచ్చాం. రోజూ తెల్లారగానే అడ్డాకు చేరుకుంటే పని ఉన్న రోజు పరమాన్నం.. లేదంటే పస్తులే. ఇంటిల్లిపాది కష్టపడితే రూ.1000 చేతికి వస్తుంది. లాక్‌డౌన్‌ వల్ల నిర్మాణాలు ఆగిపోయాయి. ఇల్లు దాటలేని పరిస్థితుల్లో ఉన్నాం. ప్రభుత్వం ఆదుకోవాలి.


అర్చకత్వం లేక.. ఆకలి తీరక..వెంకటసుబ్బయ్య శర్మ, పురోహితుడు, కడప

ముగ్గురు సభ్యుల కుటుంబం మాది. పౌరోహిత్యం జీవనాధారం. ప్రస్తుత చైత్రమాసం శుభకార్యాలకు అనుకూలం. కరోనా ఎఫెక్ట్‌ వల్ల దేవాలయాలు మూతబడ్డాయి. శుభకార్యాలు జరగడం లేదు. ఇళ్లల్లో కూడా పూజలు చేయించడం లేదు. పౌరోహిత్యం, అర్చకత్వం లేక కుటుంబ పోషణ భారంగా మారింది. జిల్లాలో 3వేలకు పైగా పురోహితులు ఉన్నాం. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలి.


ఆయా రంగాలపై ఆధారపడిన సామాన్యులు

రోజు వారి కూలీలు 2,75,000

ఆటో కార్మికులు 25,500

భవన నిర్మాణ కార్మికులు 65,000

హమాలీలు 20,000

పురోహితులు, పూజారులు 3,000

ఈవెంట్‌ ఆర్గనైజర్స్‌, కూలీలు 5,000

ఇంట్లో పనిచేసేవారు 35,000

రోడ్డు పక్క చిరువ్యాపారులు 85,000

చేనేత కార్మికులు 15,000


మొత్తం 5,28,500

Updated Date - 2020-04-10T09:12:05+05:30 IST